పెట్రోల్ బంకుల్లో ఈ–చెల్లింపులతో జాగ్రత్త!
పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన తీవ్ర నగదు కొరత కారణంగా ఆన్లైన్ లావాదేవీలు తప్పని సరయ్యాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్‌తో పాటు మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) సూచిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ వ్యాలెట్లు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈ–పాస్) యంత్రాలు వినియోగించే సమయంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
పెట్రోల్ బంకుల్లో మొబైల్ వినియోగం నిషిద్ధమన్న విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత కారణంగా పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు ఈ– పాస్ యంత్రాలు, మొబైల్ వ్యాలెట్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మొబైల్ ఎక్కువగా వాడాల్సి రావడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికమయ్యాయని పీఈఎస్వో హెచ్చరించింది. పీఈఎస్వో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ పీటీ సాహూ స్వయంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని ఇటీవల వివరించారు. ఇందుకు సంబంధించిన ఉత్తరం పెట్రోలు బంకులు నిర్వహించే పలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీని ప్రకారం.. పెట్రోల్ బంకుల్లోని జోన్–1, జోన్–2 ప్రాంతాలలో ఈ– పాస్ మెషీన్లు, మొబైల్ వ్యాలెట్లు అనుమతించరాదని పెట్రోలియం మంత్రిత్వశాఖకు పీఈఎస్వో సూచించింది.
ఇది ప్రజల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఈఎస్వో సిఫార్సు మేరకు నిర్దిష్ట కాల వ్యవధిలో తగిన చర్యలు చేపట్టేలా అన్ని రాష్ట్రాల పెట్రోలియం మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఆయన కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఇది అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
బంకుల్లో ఇవి చేయకూడదు..
1. మొబైల్ బ్యాటరీలు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది పెట్రోలియం వేపర్ను తాకితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్రోల్ నింపేటప్పుడు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను
వాడకూడదు.
2.పెట్రోల్ నింపేటప్పుడు వాహన ఇంజిన్ని ఆఫ్ చేయాలి.
3.బంక్ పరిసరాల్లో ధూమపానం చేయరాదు.
4.పెట్రోల్ నింపిన తరువాత ఫిల్లింగ్ నాజిల్ బయటకు తీసేవరకు ఇంజిన్ స్టాట్ చేయకూడదు.
5.పెట్రోల్ బంకుల్లో మంటలను ఆర్పే కిట్లు తప్పనిసరిగా ఉండాలి.
6.పెట్రోల్ పంప్‌కు చిన్నారులను దూరంగా ఉంచాలి.