ఏనుగు చర్మం ఒలిచి..
నెపిత: కాసుల కోసం ఏనుగుల్ని ఇష్టారీతిగా హతమారుస్తున్నారు స్మగ్లర్లు. ఆసియా జాతి ఏనుగులకు స్థావరమైన మయన్మార్ లోనైతే దుండగులు పేట్రేగిపోతున్నారు. ఏనుగుల దంతాలకే కాక చర్మానికి కూడా మార్కెట్ లో భారీ గిరాకీ ఉండటంతో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 50 ఏనుగులను హతమార్చారు. మయన్మార్ రెయిన్ ఫారెస్ట్ లో యథేచ్ఛగా సాగుతోన్న ఏనుగుల వధకు సంబంధించిన భీకర దృశ్యాలను కొందరు సాహసికులు రహస్యంగా చిత్రీకరించారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు అవే.
ఇక్కడ ఏనుగుల్ని చంపి, చర్మం ఒలిచి, ముక్కలుగా కత్తిరించి, చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో చైనాకు తరలిస్తారు. ఏనుగు చర్మాన్ని ప్రాసెస్ చేసి ఆభరణాలను తయారుచేస్తారు. ఈ ఆభరణాలు ధరిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందటమేకాక శుభం జరుగుతుందని చైనీయుల నమ్మకం. అందుకే ఎంత ఖర్చయినా వీటిని కొంటూఉంటారు.స్మగ్లర్లు ఏనుగుల్ని చంపుతోంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే.. 'అబ్బే మూడో నాలుగో ఏనుగులు చనిపోయాయంతే!' అని సమాధానమిస్తున్నారు మయన్మార్ అటవీశాఖ అధికారులు. మరి ఈ గజరాజులను కాపాడుకునేదెలా?