Elizabeth Taylor
-
యాక్టర్ టు యాక్టివిస్ట్
స్నేహం ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరం చెప్పలేం. ఆ ప్రభావం వాళ్లని కొత్త దారిలోనూ నడిపించొచ్చు. అందుకు ఉదాహరణ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్. తన స్నేహితుడు రోజర్ వాల్ ప్రభావం వల్ల యాక్టర్ నుంచి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచే యాక్టివిస్ట్‌గా మారారామె. ఈ కథనంతా ఎలిజబెత్ టేలర్ బయోపిక్ రూపంలో త్వరలోనే సినిమాగా చూడవచ్చు. ‘స్పెషల్ రిలేషన్షిప్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎలిజబెత్ పాత్రను హాలీవుడ్ నటి రేచల్ వేయిస్ చేయనున్నారని తెలిసింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
చనిపోయినా.. సంపాదిస్తున్నారు!
వీడు చచ్చినా సాధిస్తున్నాడురా..! అని కొందరిని తిట్టుకుంటుంటాం.. కానీ, వీడు చచ్చినా సంపాదిస్తున్నాడురా! అనే మాట ఎప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం? చనిపోయిన తరువాత ఎవరైనా ఎలా సంపాదిస్తారు? అది కూడా.. కోట్ల రూపాయలా..? అస్సలు బతికి ఉన్నవాళ్లే డబ్బు సంపాదించేందుకు నానా కష్టాలు పడుతుంటే మరణించినవారికెలా సాధ్యమనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు కావాలంటే ఈ కథనం చదవాల్సిందే! మైకెల్ జాక్సన్ పాప్ సంగీతానికి రారాజుగా వెలుగొందిన మైకెల్ జాక్సన్ 50 ఏళ్ల వయసులో 2009లో మరణించారు. మైకెల్ మరణాంనంతరం కూడా సంపాదిస్తున్నారు. ఈయన అల్బమ్స్ అమ్మినందుకుగాను ఆయా కంపెనీలు ప్రతి ఏటా 115 మిలియన్ డాలర్ల మొత్తాన్ని జాక్సన్‌కు ఇంకా చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం మైకెల్ ఆల్బమ్స్‌ను సోనీ కంపెనీ పబ్లిష్ చేస్తోంది. పాప్ కింగ్ గా పేరు మోసిన జాక్సన్ సంగీత, నృత్యాల్లో, మ్యూజిక్ వీడియోల్లో విప్లవం తెచ్చారు. 1958 ఆగస్టు 29వ తేదీన ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే పాప్ సింగర్ గా పేరు పొందాడు. తన నలుగురు సోదరులతో కలిసి ఐదుగురితో పాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 1969లో ఈ గ్రూప్ మోటవున్ రికార్డ్సతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అప్పటి నుంచి మైకెల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జాక్సన్ ఆల్బం ‘థ్రిల్లర్’ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లరుగా రికార్డు సృష్టించింది. జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ ఎల్విస్ ప్రీస్లీ కూడా మరణాంనంతరం ఏటా 55 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. తను రూపొందించిన ఆల్బమ్స్‌ను పబ్లిష్ చేస్తున్న కంపెనీ ఈ మొత్తాన్ని అందజేస్తుంది. ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ ఒక అమెరికన్ గాయకుడు, నటుడు. 20 వ శతాబ్దంలో అమెరికాలో పేరుగాంచిన ప్రముఖ నటుడు ప్రీస్లీ. 13 ఏళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టాడు. రాక్ అండ్ రోల్, హార్డ్ బ్రేక్ హోటల్ ప్రీస్లీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈయన ఆల్బమ్స్ రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్ల విక్రయాలు జరిపాయి. అతిగా డ్రగ్స తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి 42 ఏళ్ల వయసులోనే ప్రీస్లీ మరణించాడు. చార్లెస్ షుల్జ్ ప్రముఖ అమెరికన్ కార్టూనిస్టు చార్లెస్ షుల్జ్. చార్లెస్ మరణాంనతరం కూడా దాదాపు సంవత్సరానికి 40 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఈయన గీసిన కార్టూన్లను ప్రచురించే సంస్థ ఈ మొత్తాన్ని చార్లెస్ కుటుంబ సభ్యులకు అందజేస్తోంది. అనేక స్పూర్తినిచ్చే కార్టూన్లను చార్లెస్ గీశాడు. ఈయన రూపొందించిన పీనట్స్ కార్టూన్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలలో 21 భాషల్లో ప్రచురిస్తోంది. అమెరికాలో 3డి-యానిమేటెడ్ సినిమాగా కూడా పీనట్స్ వచ్చింది. 77 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో చార్లస్కు పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించాడు. ఎలిజిబెత్ టేలర్ ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజిబెత్ టేలర్. ఈమె నటించిన సినిమాలు ఇప్పటికీ అమ్ముడుపోతున్నాయి. ఇందుకుగాను ఈమెకు ప్రతి ఏటా 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందజేస్తున్నారు. హాలివుడ్ యొక్క స్వర్ణయుగంలో గొప్ప నటీమణుల్లో టేలర్ ఒకరు. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ చారిత్రక నటిమణుల్లో టేలర్‌కు ఏడవ స్థానం కల్పించారు. 1943లో విడుదలైన మెక్డోవల్ చిత్రం టేలర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గుండె సంబంధిత వ్యాధిలో 79 ఏళ్ల వయసులో 2011 సంవత్సరంలో టేలర్ మరణించారు. బాబ్ మెర్లీ బాబ్ మెర్లీ మరణాంనంతరం కూడా ప్రతి ఏటా దాదాపు 21 మిలియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. మెర్లీ బెవరేజ్ కంపెనీ, హౌజ్ ఆఫ్ మెర్లీ, ఆల్బమ్స్ ద్వారా ఆయన ఈ మొత్తాన్ని పొందుతున్నాడు. మెర్లీ గాయకుడే కాకుండా పాటల రచయిత, గిటారిస్టు, సంగీత దర్శకుడు కూడా. తన ప్రతిభతో అంతర్జాతీయంగా సినీదిగ్గజాల ప్రశంసలు మెర్లీ పొందాడు .ఈయన రూపొందించిన ‘ది వైలర్స్’తో మంచి పేరు సంపాదించుకున్నాడు. వన్ లవ్, కాయా, వెయిటింగ్ ఇన్ వెన్, జామింగ్ ఆల్బమ్స్ ప్రఖ్యాతిగాంచాయి. క్యాన్సర్ బారిన పడి 36 ఏళ్ల వయసులోనే 1981లో మెర్లీ మరణించాడు. -
వోళిగెలు, వడియాలు, చిత్రాన్నం... బాల్యం
నిజానికి బాల్యమే ఒక పండుగ. కానీ అప్పుడా విషయం తెలిసి... భవిష్యత్తులో చాలా దూరం ప్రయాణిస్తే తప్ప, గతంలోని సంతోషాలను మనం అర్థం చేసుకోలేం. చిన్నప్పుడు దసరా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పది రోజులు స్కూలుండదు. ట్యూషన్ల గోల ఉండదు. అయ్యవార్లు కూడా వాళ్ల సొంతూళ్లకి వెళ్లిపోయేవాళ్లు. ప్రకృతి కూడా ఈ సెలవల్లో ప్రేమగా ఉంటుంది. లేత ఎండ తడుతూ ఉంటే, చలి చిగురులు వేస్తూ ఉంటుంది. దసరాకి గ్యారంటీగా బట్టలు కుట్టించేవాళ్లు. అందరూ పెద్దపెద్ద షాపుల్లో కొంటూ ఉంటే, ఒక డబ్బా షాపుల్లో ఖాతా రాసి మేము తెచ్చుకునేవాళ్లం. నేను ధగధగలాడేవి చూస్తే పెద్ద వాళ్లు ధరలు చూసి మొదటి ఉతుక్కే కలర్ మాయమయ్యే వాటిని కొనేవాళ్లు... కొనడం కంటే కుట్టించడం మహా కష్టం. బాబా బుడాన్సాబ్ అనే టైలర్ దయ మా ప్రాప్తం. ఎలిజిబెత్ టేలర్ వచ్చి గౌన్ కుట్టమని అడిగినా వెంటనే మెడలో పాములా వేలాడుతున్న టేప్‌ని తీసి కొలతలు తీసుకునే రకం. జీవితంలో గౌన్ ఎలా ఉంటుందో చూడకపోయినా జంకేవాడు కాదు. ఆవు వ్యాసం టైప్. ఏం కుట్టాలో అదే కుడతాడు, నీ అభిప్రాయంతో నిమిత్తం లేదు. పైజామా, జుబ్బా, మాసిపోయిన గడ్డం, ఇదీ ఆయన రూపం. జుబ్బాకు చిరుగులుండేవి. బట్టలు కుట్టేవాడికి బట్టలు లేకపోవడం, బియ్యం పండించేవాడికి అన్నం లేకపోవడం మన సంస్కృతిలో ఒక భాగం. మిషన్ తొక్కడమే బుడాన్ ఏకైక ... మిషన్. బట్టలు ఇవ్వగానే టేప్‌ని తెచ్చి మన ఒంటికి చుట్టేవాడు. కితకతలు పెట్టి కొలతలు తీసుకునేవాడు. పండగకి ముందు రోజు ఇస్తాననేవాడు. ఆ రోజు వెళితే గంటలో రెడీ అనేవాడు. గంటలో వెళితే ఇవ్వడం ఆయన ఇంటా వంటా లేదు. పండగ రోజు స్నానం చేసి పాత బట్టలు వేసుకుని వెళితే అక్కడ నాలా చాలామంది బుడాన్ వైపు ఆశగా చూస్తూ ఉండేవాళ్లు. ఆయన ఎవరివైపూ చూడకుండా కాళ్లతో కిటకిటమని సౌండ్ చేసేవాడు. ఆయన కొడుకు నా ఈడువాడే. గుండీలు కుట్టేవాడు. సూది గుచ్చుకుని వాడి వేళ్లన్నీ రంధ్రాలతో నిండి ఉండేది. చివరికి ఎంతోమంది కుయ్యోమొర్రోమని సౌండ్ చేయగా గుండీలు ఉన్న అంగీని, గుండీలు లేని నిక్కర్ని ఇచ్చేవాడు. అది జారిపోకుండా పురికొసని, మొలతాడుని జాయింట్‌గా కట్టుకుని పోస్టాఫీసులు తెరుచుకుని పండగ జరుపుకునేవాళ్లం. అంగీని బొడ్డుపైకి, నిక్కర్ని పిర్రలపైకి కుట్టడం బుడాన్ స్పెషాలిటీ. ఆయన ముగ్గురు పిల్లలకు బట్టలు కావాలంటే మాకీ స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదు. వోళిగెలు (బొబ్బట్లు), వడియాలు, అప్పడాలు, చిత్రాన్నం ఇలా ఫుల్‌గా తినేసి సాయంత్రం జమ్మిచెట్టు దగ్గరకు బయలుదేరేవాళ్లం. వందలాది మందికి... అక్కడే సంబరం జరిగేది. పత్రిని ఒకరికొకరు ఇచ్చుకుంటూ కౌగిలించుకుని, శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. పత్రిని పెద్దవాళ్లకిచ్చి దండం పెడితే డబ్బులిచ్చేవాళ్లు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి టపాసులు కొని కాల్చేసేవాళ్లం. ఇదిగాకుండా అమ్మవారిని ప్రతిరోజూ అలంకరించేవాళ్లు. పళ్లతో, డబ్బులతో చేసిన అలంకారాన్ని చాలా ఇష్టపడేవాళ్లం. అంత డబ్బు ఒకేచోట చూడ్డం కూడా ఇదే మొదలు. కాలం మారింది. రోడ్డుసైడ్న జీవిస్తున్న బుడాన్సాబ్లు రోడ్డున పడ్డారు. ఇప్పటి పిల్లలకు జమ్మిచెట్టు ఎలా ఉంటుందో తెలియదు. తెలిసిన పెద్దవాళ్లు అప్యాయతలు, స్నేహాలు, అనుబంధాలు అన్నీ జమ్మిచెట్టు చాటున దాచేసి బతుకు కోసం నగరాలకొచ్చేసారు. తిరిగి వెళ్లినా ఆ చెట్టుని గుర్తు పట్టలేదు. ఫేస్బుక్, వాట్సాప్‌లో స్నేహితులు కనిపిస్తున్నారు కానీ స్వర్శ కోల్పోయి చాలాకాలమైంది. రోబోలు మనుషుల్లా చాలా పనులు చేస్తున్నాయని సంతోషించాలా? మనుషులు రోబోల్లా మారిపోతున్నారని బాధపడాలా? - జి.ఆర్. మహర్షి