వోళిగెలు, వడియాలు, చిత్రాన్నం... బాల్యం | In fact, a festival of Child | Sakshi
Sakshi News home page

వోళిగెలు, వడియాలు, చిత్రాన్నం... బాల్యం

Published Wed, Oct 21 2015 11:10 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

వోళిగెలు, వడియాలు, చిత్రాన్నం... బాల్యం - Sakshi

వోళిగెలు, వడియాలు, చిత్రాన్నం... బాల్యం

నిజానికి బాల్యమే ఒక పండుగ. కానీ అప్పుడా విషయం తెలిసి... భవిష్యత్తులో చాలా దూరం ప్రయాణిస్తే తప్ప, గతంలోని సంతోషాలను మనం అర్థం చేసుకోలేం. చిన్నప్పుడు దసరా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పది రోజులు స్కూలుండదు. ట్యూషన్ల గోల ఉండదు. అయ్యవార్లు కూడా వాళ్ల సొంతూళ్లకి వెళ్లిపోయేవాళ్లు. ప్రకృతి కూడా ఈ సెలవల్లో ప్రేమగా ఉంటుంది. లేత ఎండ తడుతూ ఉంటే, చలి చిగురులు వేస్తూ ఉంటుంది.

దసరాకి గ్యారంటీగా బట్టలు కుట్టించేవాళ్లు. అందరూ పెద్దపెద్ద షాపుల్లో కొంటూ ఉంటే, ఒక డబ్బా షాపుల్లో ఖాతా రాసి మేము తెచ్చుకునేవాళ్లం. నేను ధగధగలాడేవి చూస్తే పెద్ద వాళ్లు ధరలు చూసి మొదటి ఉతుక్కే కలర్ మాయమయ్యే వాటిని కొనేవాళ్లు... కొనడం కంటే కుట్టించడం మహా కష్టం. బాబా బుడాన్‌సాబ్ అనే టైలర్ దయ మా ప్రాప్తం. ఎలిజిబెత్ టేలర్ వచ్చి గౌన్ కుట్టమని అడిగినా వెంటనే మెడలో పాములా వేలాడుతున్న టేప్‌ని తీసి కొలతలు తీసుకునే రకం. జీవితంలో గౌన్ ఎలా ఉంటుందో చూడకపోయినా జంకేవాడు కాదు. ఆవు వ్యాసం టైప్. ఏం కుట్టాలో అదే కుడతాడు, నీ అభిప్రాయంతో నిమిత్తం లేదు.

పైజామా, జుబ్బా, మాసిపోయిన గడ్డం, ఇదీ ఆయన రూపం. జుబ్బాకు చిరుగులుండేవి. బట్టలు కుట్టేవాడికి బట్టలు లేకపోవడం, బియ్యం పండించేవాడికి అన్నం లేకపోవడం మన సంస్కృతిలో ఒక భాగం. మిషన్ తొక్కడమే బుడాన్ ఏకైక ... మిషన్. బట్టలు ఇవ్వగానే టేప్‌ని తెచ్చి మన ఒంటికి చుట్టేవాడు. కితకతలు పెట్టి కొలతలు తీసుకునేవాడు. పండగకి ముందు రోజు ఇస్తాననేవాడు. ఆ రోజు వెళితే గంటలో రెడీ అనేవాడు. గంటలో వెళితే ఇవ్వడం ఆయన ఇంటా వంటా లేదు.

పండగ రోజు స్నానం చేసి పాత బట్టలు వేసుకుని వెళితే అక్కడ నాలా చాలామంది బుడాన్ వైపు ఆశగా చూస్తూ ఉండేవాళ్లు. ఆయన ఎవరివైపూ చూడకుండా కాళ్లతో కిటకిటమని సౌండ్ చేసేవాడు. ఆయన కొడుకు నా ఈడువాడే. గుండీలు కుట్టేవాడు. సూది గుచ్చుకుని వాడి వేళ్లన్నీ రంధ్రాలతో నిండి ఉండేది. చివరికి ఎంతోమంది కుయ్యోమొర్రోమని సౌండ్ చేయగా గుండీలు ఉన్న అంగీని, గుండీలు లేని నిక్కర్‌ని ఇచ్చేవాడు. అది జారిపోకుండా పురికొసని, మొలతాడుని జాయింట్‌గా కట్టుకుని పోస్టాఫీసులు తెరుచుకుని పండగ జరుపుకునేవాళ్లం. అంగీని బొడ్డుపైకి, నిక్కర్‌ని పిర్రలపైకి కుట్టడం బుడాన్ స్పెషాలిటీ. ఆయన ముగ్గురు పిల్లలకు బట్టలు కావాలంటే మాకీ స్పెషల్ ట్రీట్‌మెంట్ తప్పదు.

వోళిగెలు (బొబ్బట్లు), వడియాలు, అప్పడాలు, చిత్రాన్నం ఇలా ఫుల్‌గా తినేసి సాయంత్రం జమ్మిచెట్టు దగ్గరకు బయలుదేరేవాళ్లం. వందలాది మందికి... అక్కడే సంబరం జరిగేది. పత్రిని  ఒకరికొకరు ఇచ్చుకుంటూ కౌగిలించుకుని, శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. పత్రిని పెద్దవాళ్లకిచ్చి దండం పెడితే డబ్బులిచ్చేవాళ్లు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి టపాసులు కొని కాల్చేసేవాళ్లం.
 ఇదిగాకుండా అమ్మవారిని ప్రతిరోజూ అలంకరించేవాళ్లు. పళ్లతో, డబ్బులతో చేసిన అలంకారాన్ని చాలా ఇష్టపడేవాళ్లం. అంత డబ్బు ఒకేచోట చూడ్డం కూడా ఇదే మొదలు.

కాలం మారింది. రోడ్డుసైడ్‌న జీవిస్తున్న బుడాన్‌సాబ్‌లు రోడ్డున పడ్డారు. ఇప్పటి పిల్లలకు జమ్మిచెట్టు ఎలా ఉంటుందో తెలియదు. తెలిసిన పెద్దవాళ్లు అప్యాయతలు, స్నేహాలు, అనుబంధాలు అన్నీ జమ్మిచెట్టు చాటున దాచేసి బతుకు కోసం నగరాలకొచ్చేసారు. తిరిగి వెళ్లినా ఆ చెట్టుని గుర్తు పట్టలేదు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో స్నేహితులు కనిపిస్తున్నారు కానీ స్వర్శ కోల్పోయి చాలాకాలమైంది. రోబోలు మనుషుల్లా చాలా పనులు చేస్తున్నాయని సంతోషించాలా? మనుషులు రోబోల్లా మారిపోతున్నారని బాధపడాలా?
 - జి.ఆర్. మహర్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement