ట్విట్టర్లో వివాదాస్పదమైన యాడ్
ఎలెన్ డిజెనరస్ పిల్లల దుస్తులను ప్రచారం చేసేందుకు గ్యాప్ కిడ్స్ సంస్థ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో పెట్టిన యాడ్ వివాదాస్పదమైంది. యాడ్ జాతి వివక్షతను చూపుతోందని పలువురు విమర్శలు కుప్పించారు. ఓ నల్లజాతి బాలిక నెత్తిపై ఓ తెల్లజాతి బాలిక కుడి మోచేతిని ఆనించినట్లుగా ఫొటో ఉండడం పట్ల అందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఆ యాడ్‌లో ఎక్కువ మంది తెల్లజాతీయులను పెట్టి ఒకే ఒక నల్లజాతి బాలికను చూపడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
‘బాలికలు ఏదైనా సాధించగలరనే పిల్లలను చూడండి’ అనే కాప్షన్‌తో, ‘పరస్పరం సాధికారత సాధించే సామర్థ్యం మా అందరికి ఉంది’ అనే ట్యాగ్‌లైన్‌తో యాడ్ సాగుతుంది. సాధికారత సాధించడమంటే ఇదేనా, తెల్లజాతి బాలిక మోచేతి బరువు మోయడమా? అని ఒకరు, నల్లపిల్ల కాకపోతే ఏమైనా సాధించగమన్న అర్థమా, నల్ల పిల్లలు కేవలం తెల్ల పిల్లల మోచేతులు మోయడానికే పనికొస్తారని చెప్పడమా యాడ్ ఉద్దేశం అంటూ మరొకరు, అసలు యాడ్‌లో ఒక్క నల్ల పిల్లను మాత్రమే ఎందుకు తీసుకున్నారంటూ ఇంకొకరు విరుచుకుపడ్డారు.
జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, క్షమాపణలు చెబుతున్నామని, ఎవరని నొప్పించడం తమ ఉద్దేశం కాదని గ్యాప్ కిడ్స్ వెంటనే ఓ ప్రకటనను విడుదల చేసింది. వెంటనే ప్రత్యామ్నాయ యాడ్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. నిజ జీవితంలో ఏదో ఒకటి సాధించిన వాళ్లనే తమ యాడ్‌కు ఎంపిక చేస్తున్నామని కూడా తెలిపింది.