సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
ఏలూరు: ఏలూరు నగర వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏలూరులో ఎస్పీ రఘురామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... విధుల పట్ల సీఐ మురళీకృష్ణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారించారని తెలిపారు. పెద్ద అవుటపల్లి కాల్పు ఘటనలో సీఐ మురళీకృష్ణ పాత్రపై అనుమానాలు ఉన్నాయని... వాటిని నిర్థారించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా సీఐ మురళీకృష్ణతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
వివిధ దొంగతనాల కేసుల్లో దొంగల నుంచి భారీగా బంగారం, నగదు సీఐ మురళీకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును ఆయన కోర్టులో డిపాజిట్ చేయకుండా అతడి వద్దే ఉంచుకున్నారు. అలాగే నగదును తన సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయం పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులుగా వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మురళీకృష్ణపై ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేస్తూ డీఐజీ హరికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అదికాక గత వారం విజయవాడ సమీపంలో మద్రాసు - కోల్కత్తా జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం పినమడక గ్రామస్తులుగా నిర్థారించారు. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ హస్తం ఉందేమోనని... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.