క్షిపణుల తయారీపై వేల్‌టెక్ ఒప్పందం
ఫ్రాన్స్ సంస్థతో వేల్‌టెక్ వర్సిటీ ఒప్పందం
చెన్నై: క్షిపణుల తయారీపై పరిశోధనలు సాగించేందుకు అంతర్జాతీయ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఏ మిసైల్ సిస్టమ్స్(ఫ్రాన్స్)తో చెన్నై వేల్‌టెక్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు రోజుల పాటూ చెన్నైలో నిర్వహించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వర్సిటీ వీసీల సమావేశంలో వేల్‌టెక్ వర్సిటీ ఫౌండర్, చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.రంగరాజన్, ఎంబీడీఏ మిసైల్ సిస్టమ్స్(ఫ్రాన్స్) ప్రతినిధి ఓలివర్ లూకాస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో వేల్‌టెక్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ, ప్రొ ైవె స్ చాన్స్‌లర్ చంద్రశేఖర్ మాట్లాడారు. వేల్‌టెక్ అధ్యాపకులు మిస్సైల్ తయారీలో పరిశోధనలు చేసేందుకు, విద్యార్థుల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన కార్యక్రమాలను ఫ్రాన్స్ సంస్థతో కలిసి నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
రెండురోజులపాటూ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌పై చర్చలు సాగాయన్నారు. ఐదు దేశాల నుంచి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ కులపతులు పాల్గొన్నారని వారు చెప్పారు. అలాగే భారతదేశం నుంచి డీఆర్డీఓ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంస్థలు, వర్సిటీలు, సీఎస్ఆర్ లాబ్స్ ప్రతినిధులు ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో టెక్నాలజీపై విశేష పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు విసై అనే ఎగ్జిబిషన్‌ను ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి 117 బృందాలు హాజరై తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. డిజైన్, అనాలసిస్, తయారీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టాపిక్స్‌లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వేల్‌టెక్ వర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థులు తైవాన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని పెద్ద పెద్ద ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండ్రెస్ ప్రెసిడెంట్ డాక్టర్ శకుంతలా రంగరాజన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, సింగపూర్, తైవాన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.