తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్‌స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్‌కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సగం వాటా కృష్ణా జలాలదే..
మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు.
జలాల తరలింపు ఇలా..
హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్‌సాగర్‌ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది.
అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు..
వేసవిని దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది.