విమాన టికెట్లకూ ఈఎంఐలు!
కార్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు.. ఇలా ఇళ్లలో వాడుకునే వస్తువులను వాయిదాల పద్ధతిలో కొనుక్కోవడం ఇంతవరకు మనకు తెలుసు. కానీ విమాన టికెట్లను కూడా ఇలా వాయిదాల పద్ధతిలో కొనుక్కోవచ్చని మీకు తెలుసా? చవక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా ఈ ఆఫర్ ప్రకటించింది. 'బుక్ నౌ, పే లేటర్' అనే పథకాన్ని గురువారం నాడు స్పైస్ జెట్ ప్రారంభించింది. దీని కింద ప్రయాణికులు టికెట్లు తీసుకుని, ఆ చార్జీలను 3, 6, 9 లేదా 12 నెలల్లో సులభ వాయిదాలలో తిరిగి చెల్లించుకోవచ్చు.
ఇందుకోసం కొన్ని బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా కొనేవాళ్ల కంటే ఇలా వాయిదాల్లో కొనేవాళ్లకు 12 - 14 శాతం వడ్డీ అదనంగా పడుతుంది. కానీ, క్రెడిట్ కార్డుల మీద వసూలుచేసే 36 శాతం వడ్డీతో పోలిస్తే ఇది తక్కువేనని స్పైస్‌జెట్ అంటోంది. ఒకవేళ టికెట్ రద్దు చేసుకుంటే మాత్రం.. అప్పటికే బిల్లింగ్ అయిన వడ్డీ ఖర్చులను మాత్రం వినియోగదారులే భరించాలి.