employees layoff
-
ఉద్యోగులకు ఉద్వాసన
సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి భారీగా తొలగింపుల పర్వానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. గడచిన మూడు రోజుల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు.ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసే చిరుద్యోగులపై రాజకీయ ముద్రవేసి మరీ ప్రభుత్వం పక్కనపెట్టింది. 20వ తేదీన సుమారు 90 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంతకుముందు 18వ తేదీన సుమారు వంద మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువమంది మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న ఫళాన వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు. కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డీపీఓలు, ఇతర క్యాడర్ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా పదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంఅవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి, ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోనూ, సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. కానీ సహేతుకమైన కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కనపెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు. -
ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన, అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఓలా నుంచి ఫుడ్‌పాండా ఔట్: ఉద్యోగాలు ఫట్
సాక్షి, ముంబై : క్యాబ్ అగ్రిగ్రేటర్ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించి షాక్ ఇచ్చింది. ఓలా ఇటీవల ఫుడ్ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్ పాండా పుడ్ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. ప్రధానంగా స్విగ్గీ, జొమాటో లాంటి వాటికోసం తమ డబ్బును వృధా చేసుకోవాలని భావించడం లేదని మింట్ నివేదించింది. ఇన్‌హౌస్ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు అనేకమంది ఉద్యోగులను కూడా తొలగించనుంది. సుమారు 40మంది ఎంట్రీ-మిడ్ స్థాయి సిబ్బందిని తొలగించనుంది. 1,500 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ కాంట్రాక్టులను రద్దు చేసింది. అయితే ఫుడ్ పాండా ప్రైవేటు లేబుల్స్ క్రింద తన బిజినెస్‌ను యథావిధిగా కొనసాగిస్తుంది. గత ఏడాది స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్ పోటీపడేందుకు ఫుడ్‌పాండా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్విగ్గీ, జొమాటోలకు రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా, ఫుడ్ పాండా రోజు 5వేల ఆర్డర్లను సాధిస్తోందట. కాగా 2017లో సుమారు 200 కోట్ల రూపాయలతో (30-40 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆహార పంపిణీ సంస్థలో ఓలా కూడా 200 మిలియన్ల డార్లు (సుమారు రూ.1300 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. -
స్నాప్ ఉద్యోగులపై వేటు
అమెరికన్ టెక్నాలజీ, సోషల్ మీడియా కంపెనీ అయిన స్నాప్ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ఇంజనీరింగ్, కంటెంట్ ఉద్యోగులను తీసేసిన ఈ కంపెనీ, మరికొంత మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించింది. అయితే ఈ సారి అడ్వర్టైజింగ్ వైపు ఈ వేటు ఉండనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వంద మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. గతేడాది చివరిలో తమ టీమ్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని స్నాప్ సీనియర్ లీడర్లను ఆదేశించామని స్నాప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తమ వ్యాపారాల్లో నిలకడగా వృద్ధి సాధించడానికి తమ టీమ్‌ల మధ్య సన్నిహిత సహకారాలు ఏర్పరచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. స్నాప్‌చాట్ యాప్‌ను నిర్వహించే స్నాప్ ఈ నెల మొదట్లోనే 120 మంది ఇంజనీర్లను తన కంపెనీ నుంచి తీసేసింది. అడ్వర్టైజింగ్ బిజినెస్‌లను అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం కోసం స్నాప్ ఎక్కువగా అడ్వర్టైజింగ్ స్టాఫ్‌ను నియమించుకుంది. ప్రస్తుతం వీరిలో కొంతమంది ఉద్యోగులను స్నాప్ తీసేస్తోంది. గత ఏడాది క్రితం స్నాప్ ఐపీఓకి వచ్చిన తర్వాత, కంపెనీ వరుసగా మూడు క్వార్టర్ల నుంచి రెవెన్యూ వృద్ధిలో నిరాశపరుస్తూనే వచ్చింది. -
లేఆఫ్స్ ప్రకటన, ఉద్యోగులు తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో, తమ గ్రేటర్ నోయిడా ఆపీసులోని 60 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వీరిని కంపెనీ నుంచి బయటికి పంపేసింది. ఇక మీరు కంపెనీలో పనిచేసింది చాలంటూ, లంచ్ తర్వాత ఆఫీసుకు రావాల్సినవసరం లేదంటూ పేర్కొంది. దీంతో ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. కనీసం నోటీసు లేకుండా తమను తొలగించడంతో, ఉద్యోగులు నోయిడా ఆఫీసు సెక్యురిటీ గార్డులపై దాడిచేశారు. ఆఫీసు ప్రాపర్టీకి నష్టం కలిగించారు. గత నెలలోనే కంపెనీ ఎలాంటి నోటీసులు లేకుండా 700 మందిని తొలగించింది. ఈ ఘటన అనంతరం వర్కర్లు ఆఫీసు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. గార్డులకు, ఉద్యోగులకు అర్థగంట పైగా వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో ఎలాగోల పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కంపెనీ రిక్రూట్మెంట్ పాలసీకి అనుకూలంగా పనిచేయాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ఉండాలని గ్రేటర్ నోయిడా సర్కిల్ ఆఫీసర్-2 నిశాంక్ శర్మ ఉద్యోగులను కోరారు. ఆ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్‌తో నియమించుకున్నామని కంపెనీ అధికారులు స్పష్టంచేశారు. వీరిని తొలగించేటప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సినవసరం లేదని కూడా పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులు గార్డులపై దాడిచేశారని, ఫ్యాక్టరీని కూడా కొల్లగొట్టారని అధికారులు మండిపడ్డారు. కంపెనీ ప్రాపర్టీకి నష్టం వాటిల్లేలా చేయడంతో వీరిపై కంపెనీ ఎఫ్ఐఆర్ నమోదుచేయనున్నట్టు తెలిపారు. వ్యాపార నిర్ణయాలకు అనుగుణంగానే ఉద్యోగులపై వేటు వేసినట్టు కంపెనీ పేర్కొంది. నియమ, నిబంధనలకు, కాంట్రాక్ట్‌కు తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పింది. -
ఉద్యోగాల కోతపై టీసీఎస్ స్పందన
బెంగళూరు : దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లక్నోలోని తన కేంద్రాన్ని మూసివేయనుందని, ఈ మూతతో వేలకొద్ది ఉద్యోగులు రోడ్డున్న పడనున్నారని రిపోర్టులు ఊపందుకున్నాయి. ఈ రిపోర్టులను టీసీఎస్ కొట్టిపారేసింది. లక్నోలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసివేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సిటీలోని సెంటర్‌ను మూసివేస్తున్నట్టు తెలిపింది. లక్నోలోని తమ కంపెనీ వ్యాపారాలపై నిరాధారమైన రూమర్లు, రిపోర్టులు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయని, ఎలాంటి ఉద్యోగాల కోత ఉండదని కూడా టీసీఎస్ తేల్చిచెప్పింది. నోయిడాలో తమ యూపీ కార్యకలాపాలను సంఘటితం చేస్తున్నామని తెలిపింది. నోయిడా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సెంటర్లలో లక్నో సెంటర్ ఉద్యోగులకు అవకాశాలు కల్పించనున్నామని పేర్కొంది. లక్నోలోని ఏ ఉద్యోగులను తీసివేసే ప్రసక్తే లేదని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ గోపినాథ్ స్పష్టంచేశారు. ''ఎలాంటి లేఆఫ్స్ లేవు. యూపీలో తమ వ్యాపారాలు వృద్ధి పరుచుకోవాలని చూస్తున్నాం. ఈ క్రమంలోనే నోయిడాలో తమ కార్యకలాపాలను సంఘటితం చేస్తున్నాం'' అని పేర్కొన్నారు. జూన్ వరకు తమ కంపెనీలో దేశవ్యాప్తంగా 3,85,809 మంది ఉద్యోగులున్నట్టు టీసీఎస్ తెలిపింది. అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాలపై తక్కువగానే ఫోకస్ చేసినట్టు టీసీఎస్ గ్లోబల్ హ్యుమన్ రిసోర్స్ హెడ్, ఈవీపీ అజయ్ంద్ర ముఖర్జీ వివరించారు. ప్రస్తుతం తాము ట్రైనింగ్వైపే ఎక్కువగా దృష్టిసారించినట్టు వెల్లడించారు.