అధికార గృహాలకు రూ.2,187 కోట్లు
ప్రణాళిక రూపొందించిన సీఆర్డీఏ
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల (క్వార్టర్లు) నిర్మాణానికి రూ.2,187 కోట్లతో సీఆర్డీఏ అంచనాలు రూపొందించింది. ఇందులో రాజ్‌భవన్, సీఎం నివాస భవనాలకు రూ.122 కోట్లు, అధికారుల భవనాలకు రూ.965 కోట్లు, ఉద్యోగుల నివాస భవనాలకు రూ.1,100 కోట్లు వెచ్చించాలని తేల్చింది. మొత్తం 18 రకాల నివాస భవనాలు ప్రతిపాదించగా అందులో 113 ప్రత్యేక బంగ్లాలు, బహుళ అంతస్తుల్లో 900 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయించింది. వీఐపీ గృహ నిర్మాణం కింద 1.50 లక్షల చదరపు అడుగుల్లో రాజ్‌భవన్, 25 వేల చదరపు అడుగుల్లో సీఎం నివాస భవనాలను ప్రత్యేకంగా నిర్మించనున్నారు.
రెండో కేటగిరీ (బంగ్లాలు)లో మంత్రులకు ప్రత్యేకంగా 20 నివాస భవనాలు, హైకోర్టు న్యాయమూర్తులకు 36 నివాస భవనాలు, అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ప్రత్యేక నివాస భవనాలు (బంగ్లాలు) నిర్మించనుండగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు (300 క్వార్టర్లు), ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు (300 క్వార్టర్లు) అపార్టుమెంట్లలోనే బంగ్లా తరహా నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. మూడో కేటగిరీలో గెజిటెడ్ అధికారులకు రెండు రకాల నివాస భవనాలు (అపార్టుమెంట్లు), నాలుగో తరగతి ఉద్యోగులకు విడిగా నివాస భవనాలు నిర్మించాలని ప్రణాళికలో పేర్కొన్నారు.