Empty lots
-
కన్నుపడితే కబ్జా..!
ఖాళీ స్థలాలు మింగేస్తున్నారు.. కొండలను కాజేస్తున్నారు రాష్ట్ర కబ్జాదారుల ఖిల్లాగా మారుతున్న జిల్లా బడా నేతలు, ఉన్నతాధికారుల అండ విశాఖపట్నం: నగరం, దాని చుట్టుపక్కల భూములు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. చట్టాన్ని లెక్కచేయకుండా స్థానికులను బెదిరించి కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా కబ్జాదారులకు మధురవాడ పరిసర ప్రాంతాలు స్వర్గధామంగా మారాయి. కొండలు, జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలను ఆనుకుని ఉన్న స్థలాలు.. ఇలా ఒక్కటేమిటి ఏ ప్రాంతం చూసినా అంతో ఇంతో ఆక్రమణకు గురవుతూనే ఉంది. ఐటీ పార్కులు రావడం, నగరంలో స్థలాలు కరువవ్వడంతో ఇటు నివాసానికి, అటు వాణిజ్యానికి అనువైనవిగా శివారు ప్రాంతాలు మారుతున్నాయి. విద్యాసంస్థలు కూడా ఈ ప్రాంతాలకే విస్తరిస్తుండటం వల్ల ఇక్కడ భూమి బంగారమైంది. దీంతో కబ్జాదారులు కొత్త కొత్త పద్ధతులను అవలంబించి ఇక్కడి స్థలాలను కబ్జా చేస్తున్నారు. కొండలను కూడా వదలం లేదు. విశాఖలో కొండలపై ఇళ్లు సర్వసాధారణం. వాటినీ సొమ్ము చేసుకుంటున్నారు వీరు. భూ కబ్జాలను అరికట్టడానికంటూ నాలుగేళ్ల క్రితం ఏర్పడిన డాక్యుమెంట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం (డీఎఫ్ఐటీ) ఎక్కడా కనిపించడం లేదు. ఈ విభాగం ఒకటుందని కూడా సామాన్యులకు తెలియదు. ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు నగరంలో పెరుగుతున్న భూ కబ్జాలు, రౌడీయిజం విషయంలో అధికారులపై మండిపడ్డారు. వాటిని అరికట్టకపోతేచర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని భావిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్‌కు సీఎం మాటలు బలాన్నిచ్చాయి. కబ్జాలకు పాల్పడే నేరస్థుల చిట్టాలు తెప్పించి వారిలో అత్యంత ప్రమాదకరమైన వారిని గుర్తించే పనిని కొందరు అధికారులకు అప్పగించారు. ఇదే సమయంలో ఆక్రమణలకు గురైన భూములను క్రమబద్ధీకరించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం అధికారులను ఇరకాటంలో పడేసింది. దీంతో ఏం చేయాలో తెలియక, ఇటు పీడీ యాక్ట్ ప్రయోగించలేక పోలీసు ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. కబ్జాదారులు బాగుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనుకునే కింది స్థాయి పోలీసు సిబ్బంది మాత్రం ఈ విషయంలో సంబరపడుతున్నారు. నగరంలో భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపకుంటే తర్వాత నిలుచోవడానికి కూడా నేల మిగలదని విశాఖవాసులు కలవరపడుతున్నారు. -
అంతా మాయ
- కార్పొరేషన్ ఆదాయానికి సర్కార్ గండి - రూ.1.32 కోట్ల వీఎల్టీకి మినహాయింపు - మంత్రి అండతో ఎంఏయూడీ సర్క్యులర్ జారీ విజయవాడ సెంట్రల్ : 4 నగరంలో 14వేల ఖాళీ స్థలాలకు సంబంధించి రూ.40 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు పన్ను విధించని స్థలాలను గుర్తించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాల యజమానుల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేయాలని మేయర్ కోనేరు శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. 4 బందరురోడ్డులో ప్రశాంత్ ఆస్పత్రి ఎదురుగా భవన నిర్మాణం జరుగుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఖాళీ స్థలం పన్ను రూ.1.32 కోట్లు బకాయి ఉంది. ఒక్క సంవత్సరానికి సంబంధించి రూ.9 లక్షలు కట్టించుకుని బిల్డింగ్ ప్లాన్‌ను టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసింది. ఎంఏయూడీ (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్) నుంచి ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నాయని, అందుకే ప్లాన్ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సర్క్యులర్ వెనుక జిల్లా మంత్రి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరపాలక సంస్థలో నిబంధనలు అడ్డగోలుగా మారాయి. రాజకీయ అండదండలతో చీకటి జీవోలు పుట్టుకొస్తున్నాయి. ప్రతిదానికీ రూల్స్ బూచిని చూపి పేచీ పెట్టే టౌన్‌ప్లానింగ్ అధికారులు బడాబాబులకు రెడ్ కార్పెట్ వేసి మరీ ప్లాన్లు మంజూరు చేస్తున్నారు. బందరురోడ్డులోని ప్రశాంతి ఆస్పత్రి ఎదురుగా మల్టీప్లెక్స్ నిర్మాణం సాగుతోంది. రూ.1.32 కోట్లు ఖాళీ స్థలం పన్ను బకాయి ఉన్నప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇట్టే ప్లాన్ ఇచ్చేశారు. అదేమంటే ప్రజెంట్ ఈయర్ ట్యాక్స్ కట్టి ఉంటే ప్లాన్ ఇవ్వొచ్చనే నిబంధన ఉందని చెబుతున్నారు. ఈ ప్లాన్ మంజూరు వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండికొట్టిన సర్కార్ భవనం నిర్మించాలంటే ఖాళీ స్థలం పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలి. రెవెన్యూ రికార్డుల ప్రకారం నగరంలో రూ.40 కోట్లు వీఎల్టీ (వేకెండ్ ల్యాండ్ ట్యాక్స్) వసూలు కావాల్సి ఉంది. ఈ సంవత్సరం ట్యాక్స్ కడితే పాత పన్నుకు మినహాయింపు ఇవ్వొచ్చన్న ఎంఏయూడీ సర్క్యులర్ ప్రకారం నగరంలో ఖాళీస్థలాల యజమానులెవరూ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదే జీవో అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం చేపడదాం అనుకున్నప్పుడు ఆ సంవత్సరం వీఎల్టీ కడితే సరిపోతుంది. అంటే కార్పొరేషన్ ఆదాయానికి రాష్ట్ర ప్రభుత్వమే గండికొడుతోందన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. వెలుగుచూసింది ఇలా.. ఈనెల ఏడో తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పి.సుభాషిణి సభ దృష్టికి తెచ్చారు. రెవెన్యూ విభాగంలో బకాయి ఉంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీంతో అధికారులు తడబడ్డారు. కమిషనర్ జి.వీరపాండియన్ జోక్యం చేసుకుని రెండుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే బకాయి విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని, తాను ఫైల్‌ను పరిశీలిస్తానని సర్దిచెప్పారు. వీఎల్టీ మినహాయింపునకు సంబంధించి ప్రత్యేక సర్క్యులర్ ఉందన్నది తాజా వాదన. ఆ సర్క్యులర్ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులు పది రోజులుగా కోరుతున్నప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇవ్వకపోవడం అనుమానాలను తావిస్తోంది.