కన్నుపడితే కబ్జా..!
ఖాళీ స్థలాలు మింగేస్తున్నారు..
కొండలను కాజేస్తున్నారు
రాష్ట్ర కబ్జాదారుల ఖిల్లాగా మారుతున్న జిల్లా
బడా నేతలు, ఉన్నతాధికారుల అండ
విశాఖపట్నం: నగరం, దాని చుట్టుపక్కల భూములు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. చట్టాన్ని లెక్కచేయకుండా స్థానికులను బెదిరించి కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా కబ్జాదారులకు మధురవాడ పరిసర ప్రాంతాలు స్వర్గధామంగా మారాయి. కొండలు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాలను ఆనుకుని ఉన్న స్థలాలు.. ఇలా ఒక్కటేమిటి ఏ ప్రాంతం చూసినా అంతో ఇంతో ఆక్రమణకు గురవుతూనే ఉంది. ఐటీ పార్కులు రావడం, నగరంలో స్థలాలు కరువవ్వడంతో ఇటు నివాసానికి, అటు వాణిజ్యానికి అనువైనవిగా శివారు ప్రాంతాలు మారుతున్నాయి. విద్యాసంస్థలు కూడా ఈ ప్రాంతాలకే విస్తరిస్తుండటం వల్ల ఇక్కడ భూమి బంగారమైంది. దీంతో కబ్జాదారులు కొత్త కొత్త పద్ధతులను అవలంబించి ఇక్కడి స్థలాలను కబ్జా చేస్తున్నారు. కొండలను కూడా వదలం లేదు. విశాఖలో కొండలపై ఇళ్లు సర్వసాధారణం. వాటినీ సొమ్ము చేసుకుంటున్నారు వీరు. భూ కబ్జాలను అరికట్టడానికంటూ నాలుగేళ్ల క్రితం ఏర్పడిన డాక్యుమెంట్ ఫ్రాడ్ ఇన్‌వెస్టిగేషన్ టీం (డీఎఫ్‌ఐటీ) ఎక్కడా కనిపించడం లేదు. ఈ విభాగం ఒకటుందని కూడా సామాన్యులకు తెలియదు. ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు నగరంలో పెరుగుతున్న భూ కబ్జాలు, రౌడీయిజం విషయంలో అధికారులపై మండిపడ్డారు.
వాటిని అరికట్టకపోతేచర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని భావిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్‌కు సీఎం మాటలు బలాన్నిచ్చాయి. కబ్జాలకు పాల్పడే నేరస్థుల చిట్టాలు తెప్పించి వారిలో అత్యంత ప్రమాదకరమైన వారిని గుర్తించే పనిని కొందరు అధికారులకు అప్పగించారు. ఇదే సమయంలో ఆక్రమణలకు గురైన భూములను క్రమబద్ధీకరించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం అధికారులను ఇరకాటంలో పడేసింది. దీంతో ఏం చేయాలో తెలియక, ఇటు పీడీ యాక్ట్ ప్రయోగించలేక పోలీసు ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. కబ్జాదారులు బాగుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనుకునే కింది స్థాయి పోలీసు సిబ్బంది మాత్రం ఈ విషయంలో సంబరపడుతున్నారు. నగరంలో భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపకుంటే తర్వాత నిలుచోవడానికి కూడా నేల మిగలదని విశాఖవాసులు కలవరపడుతున్నారు.