ప్రజాస్వామ్యానికే ప్రమాదం
‘మణిపూర్ పరిస్థితి’పై సుప్రీం
- బూటకపు ఎన్కౌంటర్లపై కూలంకష దర్యాప్తుకు ఆదేశం
- ఏఎఫ్ఎస్పీఏ కింద అపరిమిత బలప్రయోగం చెల్లదు
న్యూఢిల్లీ : ‘మన దేశ పౌరులను కేవలం వారు ‘శత్రువు’లు అన్న ఆరోపణతోనో లేదా అనుమానంతోనో చంపటానికి మన సాయుధ బలగాల సభ్యులను మోహరించినా, నియోగించినా కేవలం చట్ట పాలనే కాదు.. మన ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతుంది’ అని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మణిపూర్లో పరిస్థితి ఎన్నడూ కూడా యుద్ధ పరిస్థితి కాదని పేర్కొంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కింద ‘కల్లోలిత ప్రాంతాల’లో సాయుధ బలగాలు, పోలీసులు అపరిమిత బలప్రయోగం చేయటాన్ని అనుమతించజాలమంది.
రాష్ట్రంలో ఆరోపణలు వచ్చిన బూటకపు ఎన్కౌంటర్ల హత్యలపై సంపూర్ణంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. 2000- 2012 మధ్య భద్రతా బల గాలు చట్టానికి అతీతంగా 1,528 హత్యలు చేశాయన్న పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు పై విధంగా స్పందించింది. నిషిద్ధ ప్రాంతంలో ఎవరైనా ఒక వ్యక్తి ఆయుధం కలిగి ఉన్నాడన్న కారణం చేతనే అతణ్ని ఉగ్రవాదిగా, శత్రువుగాముద్రవేయజాలరని పేర్కొంది. ‘మణిపూర్ పరిస్థితి దేశ భద్రతకు ప్రమాదం కాగల యుద్ధ పరిస్థితిగా కానీ, బయట్నుంచి చొరబాటు కానీ, సాయుధతిరుగుబాటు కానీ కాదు’ అని పేర్కొంది.