Endowments Minister indrakaranreddy
-
దేవుడి మంత్రిగా మళ్లీ ‘ఇంద్రుడే’
సాక్షి, హైదరాబాద్ : ఆలయాల శాఖకు అమాత్యులుగా పనిచేసిన వారికి అనంతర రాజకీయ జీవితంలో దేవుడి కరుణ మాత్రం కలగలేదు. గతంలో 8 మంది నేతలు దేవాదాయ మంత్రులుగా పనిచేశారు. వారిలో ఎవరినీ మరోసారి మంత్రి పదవి వరించలేదు. ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమైందని చరిత్ర చెబుతోంది. కానీ, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. గత కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన ఆయన ఈసారి కూడా మంత్రి అయ్యారు. మంత్రి కావడమే కాదు... దేవాదాయ మంత్రిగా రికార్డు సృష్టించారు. (కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ ) చరిత్ర ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టడం అనేది జరగలేదు. మంత్రి పదవి అటుంచితే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించడమే గగనమైపోయింది. కొంతమందికైతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. మరీ పూర్వం నుంచి కాదు గానీ 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన యతిరాజారావుతో పాటు 1994లో ఎన్టీఆర్ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత సింహాద్రి సత్యనారాయణ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఇక 1995లో చంద్రబాబు కేబినెట్లో ఈ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తదుపరి ఎన్నికల్లో గెలవలేదు. ఇక 1999 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ చంద్రబాబు కేబినెట్లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం.సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెస్సార్ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు ఆ శాఖ చేపట్టారు. అయితే, 2009 ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. ఇక, 2009 ఎన్నికల తర్వాత దేవాదాయశాఖ చేపట్టిన గాదె వెంకట్‌రెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిపదవి దక్కలేదు. ఎమ్మెస్సార్‌కు, రత్నాకర్‌రావుకు మధ్యలో కొన్ని నెలలు దేవాదాయ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్‌రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయశాఖ చేపట్టలేదు. అప్పుడు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి 2018లో కేసీఆర్ ప్రభుత్వం రద్దయ్యేంతవరకు అదే శాఖ నిర్వహించారు. మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఇప్పుడు కేసీఆర్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమింపబడటం విశేషం. -
కల్యాణం.. కమనీయం
ఆరుట్లలోవైభవంగా రాజరాజేశ్వరి కల్యాణోత్సవం హాజరైన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆరుట్లలోవైభవంగారాజరాజేశ్వరి కల్యాణోత్సవం హాజరైన మంత్రులుఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు మంచాల: ఆరుట్ల గ్రామంలోని శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి స్థానిక సర్పంచ్ యాదయ్య, ఆలయ నిర్మాత వెదెరె పాండు రంగారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. మొదటగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. జంగిరెడ్డి కళా బృందం ప్రదర్శన, పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయాలను అభివృద్ధి చేస్తాం.. పురాతన, చారిత్రక ఆలయాల అభివృద్ధికి పాటుపడతామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల రాజరాజేశ్వరి మాత కల్యాణోత్సవానికి రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దేవాలయాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఆలయాలకు వస్తారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరంగల్‌లోని మేడారం ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించామన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని పురాతన దేవాలయాలు, వాటి స్థితిగతుల వివరాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆలయాలు అభివృద్ధి చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గుండెమోని జయమ్మ, ఇబ్రహీంపట్నం ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, మంచాల సహకార సంఘం చైర్మన్ సికిందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, మొద్దు అంజిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నోముల రవి, చింధం రఘుపతి, కందాల శ్రీశైలం, చంద్రయ్య, సీహెచ్ జంగయ్య, శేఖర్, సురేష్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జన గోదావరి
సాక్షి బృందం : గోదావరి మహాపుష్కరాల తొలిరోజు జనవాహిని ఉప్పొంగింది. ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, మంథని, గోదావరిఖని సహా జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లవద్ద భక్తులు ఊహించని సంఖ్యలో తరలివచ్చారు. పుష్కరుడి రాకతో పులకించిన గోదావరి తల్లి తొలిరోజు పెద్ద పండుగ చేసుకున్నట్లయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికిపైగా గోదావరి ఒడిలో స్నానమాచరించి భక్తపారవశ్యంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధర్మపురి గోదావరినదిలో పుష్కరస్నానం ఆచరించి పుష్కరాల మహా వేడుకలను ప్రారంభించారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఇక్కడికి చేరుకున్న కేసీఆర్ రాత్రి స్థానిక హరిత ప్లాజాలో సతీమణి, మనుమడితో కలిసి బస చేశారు. మంగళవారం పలువురు పీఠాధిపతుల ఆశీర్వచనాలు, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 6.21 గంటలకు గోదావరినదిలో పట్టు వస్త్రాలంకరణతో సతీసమేతంగా స్నానమాచరించి ధర్మపురిలో పుష్కరాలను ప్రారంభించారు. పీఠాధిపతులు సచ్చిదానందస్వామి, మాధవానం దస్వామి, విద్యారణ్యభారతి, తొగుటస్వామి, రాఘవేం ద్రస్వామి, స్వరూపానందస్వామి, శ్రీశైల వీరశైవ పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరించిన అనం తరం సీఎం దంపతులకు ఆశీస్సులు అందజేశారు. పుష్కరస్నానం అనంతరం కేసీఆర్ ధర్మపురి నృసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటారని భావించిన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచారు. కానీ పుష్కరస్నానం చేసిన కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లకుండా గుడి బయట నుంచే మొక్కి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లిపోయారు. అనంతరం ధర్మపులో పుష్కర పైలాన్ ఆవిష్కరించి తిరుగుపయనమయ్యారు. సీఎం వెంట దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి తదితరులున్నారు. కాళేశ్వరంలో రాష్ర్టమంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, జూపల్లి కృష్ణారావు, జగదీష్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతిచ్చి, పుష్కర స్నానాలు చేసి వేడుకలను ప్రారంభించారు. మిగిలిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. ధర్మపురిలో మూడు లక్షల మంది... జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మపురిలో పుష్కర స్నానమాచరించేందుకు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీని అంచనా వేసిన పోలీసులు ధర్మపురి నుంచి ఐదు కిలోమీటర్ల వరకున్న కరీంనగర్-జగిత్యాల రహదారిని పూర్తిగా దిగ్బంధనం చేశారు. వాహనాలను పట్టణ శివారులోనే నిలిపివేయడంతో భక్తులు కాలినడకన గోదావరికి చేరుకుని పుష్కర స్నానాలు చేశారు. సాయంత్రం వరకు మూడు లక్షల మంది పుష్కర స్నానం చేసినట్లు అధికారుల అంచనా. ఇక్కడ కలెక్టర్ నీతూప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ జోయల్ డేవిస్ సహా ఉన్నతాధికారులు భక్తులకు ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కాళేశ్వర ంలో రెండు లక్షలకు పైగా... గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో తొలిరోజు రెండు లక్షల మందికి పైగా జనం తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి, పెద్దలకు పిండప్రదానాలు చేశారు. దీంతో కాళేశ్వరం ప్రాంతమంతా జన సందోహంతో నిండిపోయింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులంతా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెనుదిరిగారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలోని ధర్మపరి, కాళేశ్వరం, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్ మండలాలతో పాటు కోలిలింగాల, రామగుండం, గోదావరిఖని, సుందిళ్ల, మంథని సహా గోదావరి నది వెంట మొత్తం 39 ఘాట్లను ఏర్పాటు చేయగా, తొలిరోజు సుమారు 10 లక్షల మంది స్నానమాచరించినట్లు జిల్లా అధికారుల అంచనా వేశారు. ధర్మపురిలో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, జెడ్పీ చైర్పర్సన్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు వి.సతీష్‌కుమార్, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పుష్కర స్నానాలు ఆచరించారు.