‘గేట్’- 2015: తుది దశ సన్నద్ధత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీలు, నిట్లు తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలుకల్పించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్). అంతేకాకుండా కోల్ ఇండియా, గెయిల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఐఓసీఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సాధనంగా కూడా గేట్ ర్యాంకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో గేట్‌కు అధిక ప్రాముఖ్యత ఏర్పడింది. ‘గేట్-2015’ జనవరి 31 నుంచి జరుగనున్న నేపథ్యంలో నెల రోజుల ప్రణాళికపై నిపుణుల సూచనలు...
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) - 2015కు సుమారు 40 రోజుల సమయం ఉంది. ఇప్పటివరకు పరీక్షకు ఎలా సన్నద్ధమైనప్పటికీ ఉత్తమ స్కోరు లక్ష్యంగా ఈ సమయంలో ప్రిపరేషన్ ఎంతో కీలకం. ముందుగా పరీక్ష సమీపిస్తుందన్న ఆందోళన చెందకుండా ప్రిపరేషన్‌కు పదును పెట్టాలి. సాధారణ స్థాయి విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ‘గేట్’ పరీక్ష పత్రాలను రూపొందిస్తారు. కాబట్టి ఈ నెల రోజులు పక్కా ప్రణాళికతో సన్నద్ధమైతే పరీక్షలో మెరుగైన స్కోరు సాధించొచ్చు.
ప్రిపరేషన్:
గేట్ పేపర్లో ఎక్కువ స్కోరు సాధించాలంటే.. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్‌తోపాటు ఎక్కువ వెయిటేజీ ఉన్నటువంటి ఏవైనా ఆరు టెక్నికల్ సబ్జెక్టులను ఎంచుకోవాలి.
ప్రతిరోజూ కనీసం 8గంటలు ప్రిపరేషన్, ప్రాక్టీస్‌కు కేటాయించుకోవాలి. ఏ రోజు చదివిన అంశాలనే ఆరోజే పరీక్షించుకునేందుకు మరో రెండు గంటలు తప్పనిసరి. అప్పుడే నేర్చుకున్న అంశాలు పక్కాగా గుర్తుంటాయి.
వారంలో మొదటి రెండు రోజులు ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు వేర్వేరు సబ్జెక్టులను నాలుగు గంటల చొప్పున చదవాలి. పగలు సమయంలో టెస్టింగ్కోసం కేటాయించి రెండు గంటలను సద్వినియోగం చేసుకోవాలి.
అలాగే 3, 4 రోజు, 5, 6 రోజు కూడా మరో రెండు సబ్జెక్టుల చొప్పున చదవాలి. వారం రోజులు చదివిన అంశాలను ఆదివారం 3- 4 గంటల సమయంలో పునశ్చరణ చేసుకోవాలి. ప్రాక్టీస్ పరీక్ష రాయడం ద్వారా స్వీయ అంచనాకు రావాలి. ఈ రకంగా చదవడం ద్వారా వారం రోజుల్లో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్‌తోపాటు మొత్తం ఎంచుకున్న ఆరు సబ్జెక్టులకు సన్నద్ధమవ్వొచ్చు. ఈ పద్ధతిలో కాన్సెప్ట్‌పై పట్టుతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
జనవరి 20కి ముందే ప్రిపరేషన్‌ను ముగించాలి. పరీక్షకు పదిరోజుల ముందు అంటే జనవరి 21 నుంచి వివిధ వెబ్‌పోర్టల్స్, విద్యాసంస్థలు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాయాలి.
- పి. శ్రీనివాసులు రెడ్డి, వాణి ఇన్స్టిట్యూట్