జాదవ్ అనుకున్నట్టే జరిగింది
పుణె: ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని టీమిండియా బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ అన్నాడు. ఇంగ్లండ్‌తో పుణె వన్డేలో సెంచరీ చేశాక, ఇదే జోరు కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంటానని భావించానని తెలిపాడు. జాదవ్ అనుకున్నట్టే ఈ సిరీస్‌లో రాణించి అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతేగాక పుణె వన్డే తర్వాత ఓ రోజులోనే స్టార్ క్రికెటర్ అయిపోయాడు. ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యసాధనలో జాదవ్ కీలక సమయంలో మెరుపు సెంచరీ (76 బంతుల్లో 120) చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.
శుక్రవారం పుణెలో జాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తన క్రికెట్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడుతున్న సమయంలో తనలో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని, ఏ జట్టుపైనైనా పరుగులు చేయగలననే నమ్మకం వచ్చిందని చెప్పాడు. కాగా టీమిండియా తరఫున ఆడే అవకాశం ఆలస్యంగా వచ్చిందని, పరిణతి లేకపోవడమే ఇందుకు కారణమన్నాడు. జట్టులో తనకు లభించిన అవకాశాన్ని విజయంగా మార్చుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తుంటాడని, తన సహజశైలిలో ఆడేందుకు సాయపడ్డాడని వెల్లడించాడు. కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పాడు. మాజీ కెప్టెన్ ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, యువ ఆటగాళ్లుకు ఆదర్శమని ప్రశంసించాడు. ఒత్తిడిని అధిగమించడం, సవాళ్లను ఎదుర్కోవడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండగలగడం వంటి లక్షణాలు ధోనీకి ప్రత్యేకమన్నాడు. ధోనీ, కోహ్లీ నాయకత్వ లక్షణాలు, శైలి భిన్నంగా ఉంటాయని చెప్పాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించడం వల్ల జట్టు సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారా అన్న ప్రశ్నకు.. తాను వర్తమానంలో జీవిస్తానని, భవిష్యత్ గురించి ఆలోచించనని అన్నాడు. కాగా మరో రెండు, మూడు సిరీస్‌లకు భారత జట్టులో చోటు లభిస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు.