వచ్చే నెల 26న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష
♦ నోటిఫికేషన్ జారీ చేసిన విద్యా శాఖ
♦ 6వ తరగతిలో 19,200 సీట్లు
♦ ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 192 ఇంగ్లిష్ మీడియం మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2017–18లో చేపట్టనున్న ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ డైరె క్టర్ కిషన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, 7 నుంచి 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు 26వ తేదీ నాడే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.
ఈ పరీక్ష ద్వారా ఒక్కో స్కూల్లోని ఆరో తరగతిలో 100 సీట్ల చొప్పున మొత్తంగా 19,200 సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. 7 నుంచి 10వ తరగతిలో మాత్రం ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే భర్తీ చేస్తామని వివరించారు. అడ్మిషన్ ఫీజు కింద ఓసీ విద్యార్థులు రూ. 100, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. ఫీజు చెల్లింపు విధానం, దరఖాస్తుల వివరాలను ఈ నెల 16వ తేదీ నుంచి తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, అందులోని సూచనల ఆధారంగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 126 మోడల్ స్కూళ్లలో బాలికలకు హాస్టళ్లు ఉన్నాయని, వచ్చే మే నెలాఖరు నాటికి మరిన్ని మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఒక్కో హాస్టల్లో 100 మంది బాలికలకు నివాస వసతి ఉంటుందని వెల్లడించారు.
ఇదీ షెడ్యూలు..
► ఆన్లైన్లో దరఖాస్తు: ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు
► హాల్‌టికెట్ల డౌన్లోడ్: వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు.
► రాత పరీక్ష: ఫిబ్రవరి 26న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు (6వ తరగతికి), మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు (7 నుంచి 10 తరగతులకు).
► మెరిట్ జాబితాల ప్రకటన: మార్చి 9వ తేదీన
► జిల్లా స్థాయిలో ప్రవేశాల తుది జాబితా ఖరారు: మార్చి 10వ తేదీన
► సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు: మార్చి 17, 18 తేదీల్లో మధ్యాహ్నం