వికలాంగ సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు
సంగారెడ్డి అర్బన్: చెవిటి, మూగనైన తనకు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రి అధికారులు ధ్రువపత్రం ఇచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని తనకు పింఛన్ మంజూరు చేయాలని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన దండు కుమారస్వామి కోరారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు అర్జీలను అందజేశారు.
వికలాంగురాలైన తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని గత 15 సంవత్సరాలుగా సొంత ఇంటి కొరకై పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇల్లు మంజూరు చేయాలని రామచంద్రాపురానికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో జేసీ మండలంలోని ఏదైనా ఒక గ్రామంలో ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు.
పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామం బామన్ల కుంట చెరువును చెరువును తప్పుడు సేల్‌డీడ్‌తో 32 మంది వ్యక్తులు తప్పుడు హద్దులు చూపించి అక్రమించుకున్నారని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని గొల్ల నిమ్మలయ్య జొన్నాడ క్రిష్టా యాదవ్, శివరాజ్ ఫిర్యాదు చేశారు.
సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన గౌటాన్ భూమిలో దళితులైన తమకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వాలని గ్రామానికి చెందిన నర్సమ్మ, ఎల్లమ్మ, యశోద, మంజుల తదితరులు కోరారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటర్ల అవగాహన వాహనానికి జేసీ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్ పాల్గొన్నారు.