మహిళలకు మాత్రమే..
అడవి కొలను (నిడమర్రు) : గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలలో ఒక రోజును పూర్తిగా మహిళలకే కేటాయించడం ఇక్కడి ఆచారం. ప్రతి ఏడాది స్వామి వారి రథోత్సవం జరిగిన రోజున మహిళలకు ప్రత్యేకంగా తీర్థోత్సవం జరుగుతుంది. అదే విధంగా గురువారం రథోత్సవం జరిగింది. అనంతరం తీర్థంలో మహిళలకు అవసరమైన గృహోపకరణాలైన కత్తిపీట, కవ్వం, అట్లపెనం, మూకుళ్లు వంటి వంట సామగ్రి దుకాణాలతో పాటు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ వస్తువుల దుకాణాలు, బొమ్మలు వంటి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు, కొనుగోలు చేసేందుకు ఈ రోజు కేవలం మహిళలనే అనుమతించడం ఇక్కడ అనాదిగా వస్తున్నఆచారం. మిఠాయి దుకాణాలు, మాంసం దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలోకి పురుషులు ఎవ్వరూ అడుగు పెట్టరు. ఇతర గ్రామాల నుంచి వచ్చే మగవారిని తీర్థంలోకి రాకుండా ఉత్సవ కమిటీ సభ్యులు కాపలా కాస్తారు. ఈ ఆచారం పూర్వ నుంచి ఉందని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోశింశెట్టి రామమూర్తి తెలిపారు. ఈ ఆచారం తెలుగు రాష్ట్రాల్లో కేవలం కడప జిల్లా పులివెందులలోనూ, మన జిల్లాలో అడవికొలను గ్రామంలో మాత్రమే ఉన్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల వరకూ మహిళలు వస్తువులు కొనుగోలు చేస్తారు. తర్వాత నుంచి గ్రామంలోని మగవారు తీర్థంలోకి వెళతారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దుకాణాల్లో వేకువజాము వరుకూ కొనుగోళ్లు జరుగుతాయని వ్యాపారస్తులు తెలిపారు. ఈ రోజుకోసం ఏడాది నుంచి ఎదురు చూస్తామని మహిళలు పేర్కొన్నారు. మహిళల తీర్థం పూర్తయ్యేంత వరకు ప్రతిఏడాది సత్యహరిశ్చంద్ర నాటకం మాత్రమే మగవారు చూడటం కూడా ఇక్కడ ప్రత్యేకత.