టెకీలందరికీ సమాన వేతనాలు
న్యూయార్క్: పురుషులతోపాటు మహిళలు కూడా పోటీ పడగలరని నిరూపిస్తున్న తరుణంలో కంపెనీ వేతనాల్లో లింగవివక్ష లేకుండా చేయాలని టెక్నాలజీ అగ్రగామి సంస్థలు నిర్ణయించాయి. సోషల్ నెట్ వర్క్ సైట్ ఫేస్ బుక్, టెక్నాలజీ దిట్ట మైక్రోసాఫ్ట్ కంపెనీలు మహిళలకి, పురుషులకి సమాన వేతనాలు ఇస్తామని ప్రకటించాయి. ఈ మంగళవారం నుంచి ఈ సమాన వేతనాలు అమలులోకి వస్తాయని తెలిపాయి. బోస్టన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ అర్జున్ క్యాపిటల్ ఒత్తిడి మేరకు ఈ రెండు సంస్థలు ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు వారి ఉద్యోగుల వేతనాలపై సమీక్ష చేపట్టాయి.
ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ తో పాటు యాపిల్ లాంటి తొమ్మిది టెక్నాలజీ సంస్థలు వేతన సమాచార వెల్లడిపై అర్జున్ క్యాపిటల్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎలాంటి లింగవివక్ష లేకుండా కంపెనీల్లో టాలెంట్ ఉన్న మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడంతో, పోటీ వాతావరణం పెరుగుతుందని అర్జున్ క్యాపిటల్ పార్టనర్ నతాసా ల్యాంబ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
పని విషయంలో పారదర్శకత కూడా ఉంటుందన్నారు. పెద్ద కార్పొరేషన్లలో పురుషులకు, మహిళలకు మధ్య 7శాతం వేతనాలు తేడా ఉన్నట్టు శాన్ ప్రాన్సిస్కో కు చెందిన ఓ స్టార్టప్ హయర్డ్ ఇంక్ వెల్లడించింది. ఒకే కంపెనీలో పురుషుడు, మహిళ ఒకటే ఉద్యోగం చేస్తున్న వారి వేతనాల్లో మాత్రం తేడా ఉంటుందని, మహిళ కంటే పురుషుడికి ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నారని హయర్డ్ లీడ్ ప్రొడక్ట్ డేటా సైంటిస్ట్ డాక్టర్. జెస్సికా కిర్క్‌పాట్రిక్ తెలిపారు.