Evariki Evaru
-
ముక్కోణపు యాక్షన్ స్టోరీ
చతుర్ముఖ ప్రేమకథ, ముక్కోణపు యాక్షన్ స్టోరీతో వెన్నెలకంటి కిశోర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎవరికి ఎవరు’. అరుణ్, ఆర్య, తనిష్క్ తివారీ, ప్రజ్ఞ ముఖ్య తారలుగా ఈ చిత్రాన్ని అజయ్ హంసాగర్ నిర్మించారు. చిన్నికృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని లోక్‌సభ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి, నటుడు సాయికుమార్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాలను సాయికుమార్, టైటిల్, సంస్థ లోగోను మల్టీడైమన్షన్ సంస్థ వాసు ఆవిష్కరించారు. ఇందులో శివభక్తుడి పాత్ర చేశానని సాయికుమార్ అన్నారు. దర్శక, నిర్మాతలు చెబుతూ -‘‘మూడు పాత్రల మధ్య జరిగే పోరులో రెండు ప్రేమ జంటలు చిక్కుకుని ఎలా బయటపడ్డాయనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రమేష్ బెన్నూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవికుమార్ కౌశిక్. -
‘ఎవరికి ఎవరు’ మూవీ స్టిల్స్
-
శివ భక్తునిగా...
‘‘ఇందులో శివ భక్తునిగా కనిపిస్తాను. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు’ సినిమాల తర్వాత అంతటి శక్తిమంతమైన పాత్ర ఇది’’ అని సాయికుమార్ చెప్పారు. కిషోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో ప్రసనాక్షి పిక్చర్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘ఎవరికి ఎవరు’. అరుణ్, ఆర్య, ప్రజ్ఞ, తనిష్క్ తివారి ముఖ్యతారలు. సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాయికుమార్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘కళాశాల, రాజకీయ నేపథ్యంలో సాగే నేరప్రధాన ప్రేమకథ ఇది. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్ని కృష్ణ, కెమెరా: జి. వెంకటేశ్వర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవికాంత్ కౌషిక్. -
ఎసీపీగా పోసాని
అరుణ్, ఆర్య, ప్రజ్ఞ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎవరికి ఎవరు’. సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ వెన్నెలకంటి దర్శకుడు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సి.కల్యాణ్ కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కిషోర్‌కుమార్(డాలీ) గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సుభాష్‌ఘయ్ వద్ద దర్శకత్వ శాఖలో చేశాను. రాజకీయం, కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. 40 రోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో ఏసీపీగా నటిస్తున్నానని పోసాని తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, ఛాయాగ్రహణం: జి.వెంకటేశ్వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవికాంత్ కౌశిక్.