భారత్, షీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ: గడిచిన మార్చి నెలలో షీషెల్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కుదుర్చకున్న అవగాహనమేరకు.. బుధవారం భారత్, షీషెల్స్ దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మిఛెల్ బుధవారం మద్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యాయి. అనంతరం ఐదు కీలక ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకం చేశారు.
ఈ ఐదు ఒప్పందాల్లో పన్ను సమాచార మార్పిడి ఒప్పందంతోపాటు షీషెల్స్ కు డోర్నియార్ నిఘా విమానం అందజేత కీలకమైనవి. బ్లూ ఎకానమీ విషయంలో ఇరుదేశాల సహకారానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన, షీషెల్స్ లో వ్యవసాయ, విద్యారంగాల అభివృద్ధికి తోడ్పాటు తదితర ఇతర ఒప్పందాలపైనా ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాక మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొన్నారు.