ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్
ఈ కథనం చదవడానికి ముందుగా ఉచ్చారణ ఒకేలా అనిపించే రెండు వ్యాధులకు ఉన్న తేడాను తెలుసుకోవడం ముఖ్యం. అందులో మొదటిది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇందులో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంటుంది. ప్రయాణాల్లో ఏదైనా మనసుకు నచ్చింది తింటే... దార్లో ఎక్కడ విసర్జనకు వెళ్లాల్సి వస్తుందో అన్న ఆందోళనతో ఏమీ తినబుది ్ధకాదు. అలాగని తినగానే టాయిలెట్‌కు వెళితే ఒక పట్టాన రాదు. ఆ తర్వాత ఎప్పుడో విసర్జనకు వెళ్లాలన్న ఫీలింగ్ వచ్చి ఆందోళన పెరుగుతుంది... ఇవన్నీ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే వ్యాధి లక్షణాలు. ఇక దీన్ని గురించి మర్చిపోండి. ఈ పేరుతో పోలి ఉండే మరో వ్యాధి పేరే ‘ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్’. దీన్నే సంక్షిప్తంగా ‘ఐబీడీ’ అంటారు. ఐబీఎస్‌తో పొరబడకుండా ఐబీడీ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా ప్రధానం. అందుకు ఉద్దేశించిందే ఈ కథనం.
క్రోన్స్ డిసీజ్‌కు చికిత్స
క్రోన్స్ డిసీజ్‌కు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రోన్స్ డిజీస్లో జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైంది అన్న అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. క్రోన్స్ డిసీజ్‌కి చికిత్సల్లో కొన్ని...
జీర్ణవ్యవస్థలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి 5-అమైనోశాల్సిలేట్స్ అనే మందులను ఇస్తారు. సంక్షిప్తంగా ‘5-ఏఎస్ఏ’ అని పిలిచే ఈ మందులు మరిన్నిచోట్ల సమస్యలు రాకుండా నివారిస్తాయి.
ఒకవేళ ‘5-ఏఎస్ఏ’ మందులతో అంతగా ఫలితం కనిపించకపోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ కోర్సును డాక్టర్లు సూచిస్తారు.
ఒకవేళ ‘5-ఏఎస్ఏ’ మందులకూ, యాంటీబయాటిక్స్‌కూ సరిగా స్పందించని రోగులకూ, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికీ... ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను డాక్టర్లు సూచిస్తారు. అయితే వీటిని పరిమిత సమయం కోసం మాత్రమే వాడి, ఇన్ఫ్లమేషన్ అదుపులోకి రాగానే వీటిని ఆపేస్తారు. ఎందుకంటే దీర్ఘకాలం వాడటం వల్ల వీటివల్ల ఇతర దుష్ర్పభావాలు కనిపించవచ్చు.
ఇక లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునోమాడ్యులేటర్స్ అనే సరికొత్త తరహా మందులను ఇవ్వడం అన్నది ఆధునిక చికిత్స ప్రక్రియలో భాగంగా జరుగుతోంది. వీటితో పాటు బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే తరహా మందులనూ వాడతారు. ఇన్ఫ్లమేషన్ను ముందుగానే నివారించడం అన్నది వీటి ప్రత్యేకత. అయితే ఇవి కాస్త ఖరీదైన మందులు. పైగా దుష్ర్పభావాలూ ఎక్కువే. అందుకే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారికే ఇవి ఉపయోగిస్తారు.
ఒకవేళ పైన పేర్కొన్న అన్ని రకాల మందులు ఉపయోగించాక కూడా ఎలాంటి ఉపశమనమూ కనిపించని సందర్భంల్లోనూ, మందుల వల్ల కలిగే దుష్ర్పభావాల ఫలితాలు భరించలేనంతగా మారినప్పుడు ఇక చివరి ప్రత్యామ్నాయంగా డాక్టర్లు శస్త్రచికిత్సను సూచిస్తారు. అయితే శస్త్రచికిత్సతో క్రోన్స్ డిసీజ్ పూర్తిగా తగ్గుతుందని అనుకోడానికి వీల్లేదు. కాకపోతే ఆ వ్యాధి వల్ల కలిగే బాధలనుంచి చాలావరకు విముక్తి ఉంటుంది. ఇలా శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా వ్యాధి మళ్లీ మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది.
వ్యాధినిర్ధారణలో అప్రమత్తత అవసరం
క్రోన్స్ వ్యాధి నిర్ధారణలో అప్రమత్తత అవసరం. ఎందుకంటే... క్రోన్స్ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాల్లో ఇంటస్టినల్ ట్యూబర్క్యులోసిస్తో (పేగులో వచ్చే టీబీతో) పోలి ఉంటాయి. కాబట్టి వ్యాధి నిర్ధారణ చాలా శ్రద్ధగానూ, నిశితంగానూ ఉండాలి.
ఎవరెవరిలో ఎక్కువ...
సాధారణంగా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అని పిలిచే ఈ సమస్యలు యువకుల్లోనే ఎక్కువ. ప్రధానంగా 18 నుంచి 40 ఏళ్ల వయసు వారిలో కనిపించినా, 55 - 65 ఏళ్ల వారిలో కూడా ఎక్కుగానే కనిపిస్తుంటాయి. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో చాలా తక్కువ. అంతకంటే తక్కువ వయసున్న వారి విషయంలో కేవలం 10 శాతం మందిలోనే ఈ వ్యాధులు కనిపించడాన్ని పరిశీలకులు గమనించారు. ఇక పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఈ వ్యాధి కనిపించినా, మహిళల్లో మాత్రం ఒకింత ఎక్కువగా ఉండటాన్ని గమనించారు.
ముందుగానే గుర్తించి కూడా తగిన చికిత్స తీసుకోకపోతే...
ఒకవేళ అల్సరేటివ్ కొలైటిస్ను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే మరికొన్ని దుష్ర్పభావాలు కనిపించవచ్చు. అది ఒక్కోసారి ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే అత్యవసరమైన పరిస్థితికి దారితీయవచ్చు. అది కాస్త ప్రాణాంతకమైన పరిస్థితి.
ఇక క్రోన్స్ డిసీజ్ విషయానికి వస్తే ఇందులోని లక్షణాలు ప్రధానంగా ఇన్ఫ్లమేటరీ తరహాలో ఉంటాయి. వాటిని ముందుగానే అదుపు చేయకపోతే అవి ఫిస్టులాకు దారితీసే అవకాశం ఉంది.
గర్భిణులూ కాస్త జాగ్రత్త
సాధారణంగా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వల్ల కలిగే అల్సరేటివ్ కొలైటిస్గాని, క్రోన్స్ డిసీజ్గాని జీవితంలోని నాణ్యతను దెబ్బతీసి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ‘టాక్సిక్ మెగా కోలన్’ పరిస్థితి మినహా మిగతా పరిస్థితులేవీ ప్రాణాంతకం కాకపోయినా... తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ జీవితాన్ని దుర్భరం చేస్తాయి. ఇక గర్భిణుల విషయానికి వస్తే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఉన్నప్పుడు అది గర్భస్రావానికీ దారితీయవచ్చు. అయితే ఆ సమస్య ఉందని తెలిశాక తగిన జాగ్రత్త తీసుకుని, డాక్టర్ల సలహా మేరకు వ్యాధిని అదుపులో పెట్టుకుంటే అందరిలాగే పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
క్రోన్స్ డిసీజ్ లక్షణాలు
ఈ వ్యాధి ఉన్నవారిలో కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు నోట్లో పొక్కులు, చర్మసమస్యలు, కళ్లు ఎర్రబారి మండటం జరగవచ్చు. ఇక మలద్వారానికి సంబంధించిన సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకుపోవడం (యాబ్సెస్) వంటి సమస్యలూ కనిపిస్తాయి.
నోటి సమస్యలు : క్రోన్స్ డిసీజ్ తీవ్రంగా ఉన్నవారిలో ఆఫ్తస్ స్టొమటైటిస్ అని పిలిచే నోటి పొక్కులు ఎక్కువగా ఉంటాయి. ఇవి నోటిలోని చిగుర్లు, కింది పెదవి మధ్య భాగంలో ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు నాలుకకు పక్కభాగం లేదా కింద కూడా రావచ్చు. కొన్నిసార్లు ఈ పొక్కులు చాలా నొప్పిగా ఉంటాయి. ఇలాంటప్పుడు వీటి ఉపశమనం కోసం మందులు వాడాల్సి ఉంటుంది.
కళ్ల మంటలు/ఎర్రబారడం : క్రోన్స్ డిసీజ్‌లో కళ్ల ఇన్ఫ్లమేషన్ కూడా కనిపిస్తుంది. (దీన్నే యువైటిస్ లేదా స్క్లెరైటిస్ అని కూడా అంటారు.) క్రోన్స్ డిసీజ్ ఉన్న ఐదు శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తుంది. ఈ యువైటిస్ ఉన్నవారిలో కళ్ల నొప్పి, చూపు మసకబారడం, వెలుగును తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇక స్క్లెరైటిస్ ఉన్నవారిలో కళ్లు మండటం, దురదలుగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు తగ్గడానికి వైద్యులు చుక్కల మందులు సూచిస్తారు.
మలద్వారం సమస్యలు : క్రోన్ డిసీజ్ ఉన్నవారిలో మలద్వారం చుట్టూ కొన్ని సమస్యలు ఉంటాయి. అవి మలద్వారం చీరుకుపోవడం, అక్కడ పుండ్లు పడటం, ఫిస్టులా ఏర్పడటం జరగవచ్చు. కొందరిలో మలద్వారం కుంచించుకుపోవచ్చు. ఈ లక్షణాలు ఒక్కొక్కటిగానీ లేదా కొన్ని లేదా అన్నీ కనిపించవచ్చు. మలద్వారం వద్ద ఏర్పడే ఈ సమస్యలు కొందరిలో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా వాటంతట అవే తగ్గిపోతాయి.
అల్సరేటివ్ కొలైటిస్‌కు చికిత్స
ఈ వ్యాధి చికిత్స విషయంలో వైద్యులు రెండు రకాల ప్రణాళికలు అవలంబిస్తారు. మొదటిది... లక్షణాలను ఉపశమింపజేసేలా మందులు ఇవ్వడం. ఇక రెండోది అవే లక్షణాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడటం.
అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవారిలో లక్షణాలు తగ్గినట్టే తగ్గి మళ్లీ మాటిమాటికీ కనిపిస్తుండటం రోగిని నిస్పృహకు గురిచేస్తుంటుంది. అయితే 15శాతం మంది రోగుల్లో ఒకసారి అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు కనిపించినా అవి మళ్లీ పునరావృతం కాకపోవడం ఒక అదృష్టంగా భావించవచ్చు.
ఆహారంతో అదుపు ఇలా...
ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, బరువును అదుపులో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా లక్షణాలు తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాధి నివారణ/నియంత్రణ కోసం మల్టీవిటమిన్ టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రలను డాక్టర్లు సూచిస్తారు.
పరిహరించాల్సిన లేదా పరిమితంగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు:
పరిస్థితిని విషమింపజేసే ఈ కింది ఆహారాలను సాధ్యమైనంతగా పరిహరించడం లేదా పరిమితంగా తీసుకోవడం మేలు. అవి...
పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్ వంటివి.
చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు ఆల్కహాల్ పుల్లటి పండ్లు, పండ్ల రసాలు మసాలాలు (ఘాటైన మసాలా దినుసులు) వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్ కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్ బీన్స్, కందులు వేటమాంసం పాప్‌కార్న్ వేరుశెనగ పల్లీలు కృత్రిమరంగులు వాడిన ఆహారాలు తీపిని పెంచడానికి వాడే కృత్రిమపదార్థాలు... వీటిలో చాలా పదార్థాలు అందరికీ మంచివే అయినా ‘ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్’కు చెందిన అల్సరేటివ్ కొలైటిస్ రోగులకు అంత మంచివి కాదని గుర్తించాలి. అయితే కొందరు ఐబీడీ రోగులకు ఇవి సరిపడతాయి. కాబట్టి అలాంటివారు ఈ ఆహారపదార్థాలను పరిహరించాల్సిన అవసరం లేదు.
నొప్పి తగ్గించే మందులు
ఈ వ్యాధిగ్రస్తుల్లో కడుపునొప్పి వంటి లక్షణాలను అదుపు చేయడం కోసం నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) వంటి మందులను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఈ నొప్పినివారణ మందులు కూడా పరిస్థితిని తీవ్రతరం చేయవచ్చు. పారాసిటమాల్ మందులు మాత్రం ఎలాంటి సమస్యనూ సృష్టించవు కాబట్టి అలాంటప్పుడు పారాసిటమాల్ వాడటం మేలు.
లాక్టోజ్ ఇన్టాలరెన్స్
అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న రోగుల్లో కొందరికి చక్కెరను జీర్ణించుకునే సామర్థ్యం ఉండదు. ఈ పరిస్థితినే లాక్టోజ్ ఇన్టాలరెన్స్ అంటారు. అందుకే చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండే పాలు, పాల ఉత్పాదనల వంటివి తీసుకున్నప్పుడు ఈ రోగులకు నీళ్ల విరేచనాలు కావడం, కడుపు బిగదీసుకుపోవడం, గ్యాస్ పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఇలాంటివారు పాలు, పాల ఉత్పాదనలకు దూరంగా ఉండటం మేలు.
ఉపశమన చికిత్స
లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్న రోగులు మలద్వారం వద్ద నొప్పి, అక్కడ రక్తస్రావం, నీళ్ల విరేచనాలు కనిపిస్తుంటే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, డాక్టర్ల సలహా మేరకు అమైనోశాల్సిలిక్ ఆసిడ్ లేదా గ్లూకోకార్టికాయిడ్స్ వంటి పూత మందులు వాడటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
ఇక అవసరాన్ని బట్టి ఒక్కోసారి నోటి ద్వారా తీసుకునే నొప్పి నివారణ మందులూ ఇస్తారు.
కొందరిలో పేగుల ఆరోగ్యాన్ని పరిరక్షించే మంచి బ్యాక్టీరియా (ప్రోబయాటిక్స్)నూ కూడా డాక్టర్లు సూచిస్తారు.
ఇక లక్షణాల తీవ్రత ఒక మోతాదుకు మించి మొదలుకొని చాలా తీవ్రంగా ఉన్నప్పుడు గ్లూకోకార్డికాయిడ్స్ అనే స్టెరాయిడ్స్‌ను డాక్టర్లు సూచిస్తారు. వీటిని నోటి ద్వారా ఇవ్వడం వల్ల లక్షణాలు వేగంగానే తగ్గుతాయి కానీ ఒక్కోసారి అవి ఇతర సైడ్‌ఎఫెక్ట్స్‌కు దారి తీయవచ్చు. అంటే ఆకలి పెరగడం, బరువు పెరగడం, మొటిమలు రావడం, వణుకు, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, నిద్రపట్టకపోవడం వంటివి. ఇలాంటి సందర్భాల్లో వ్యాధి తీవ్రత తగ్గుతున్న కొద్దీ డాక్టర్లు మందు మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ వస్తారు. అందుకే ఈ తరహా మందులు వాడతున్నవారు తమంతట తామే వాటిని మానేయడమో, అకస్మాత్తుగా మొదలుపెట్టడమో చేయకూడదు.
రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటే... కొందరిలో మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గవు. అలాంటి కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. తమలోని రోగనిరోధక శక్తి అతిగా స్పందించడం వల్లనే అల్సరేటివ్ కొలైటిస్ వస్తుందనన విషయం తెలిసిందే కాబట్టి ఇలాంటి వారికి... వారిలోని రోగనిరోధక శక్తి తాత్కాలికంగా కాస్త మందగించేలాంటి మందులైన 6-మెర్కాప్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులు ఇస్తారు. అప్పటికీ గుణం కనిపించకపోతే సైక్లోస్పోరిన్ వంటి ఇతర మందులు వాడాలని సూచించడమో లేదా శస్త్రచికిత్సతో పెద్దపేగులని తొలగించడమో మంచిదని డాక్టర్లు సూచిస్తారు. (ఈ సైక్లోస్పోరిన్ అన్నది అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేసినప్పుడు బయటి నుంచి ఇచ్చిన అవయవాన్ని శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు ఇచ్చే ప్రభావపూర్వకమైన మందు).
ఇవేగాక బయాలజిక్స్ అని పిలిచే ఇన్‌ఫ్లిక్సిమాబ్, అడాలిమంమాబ్, గోలిమంమాబ్ వంటి అత్యాధునికమైన మందులు సైతం ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇక ఇలా నిత్యం మందులు వాడుతూ ఈ వ్యాధితో పోరాటం చేయలేని వారికి చివరి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్సను డాక్టర్లు సూచిస్తారు. అయితే దీనివల్ల కలిగే లాభనష్టాలను క్షుణ్ణంగా బేరీజు వేసి, వాటిని రోగులకు వివరించాకే శస్త్రచికిత్సకు వెళ్తారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా మొత్తం పెద్దపేగును తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి చిన్నపేగు చివరి భాగాన్నే నడుము వద్ద తెరుచుకునేలా చేసి అక్కడే మలద్వారం వంటి మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు.
ఇక మరో తరహా శస్త్రచికిత్సలో పెద్దపేగును పూర్తిగా తొలగించి, చిన్న పేగు చివరి భాగాన్నే మలద్వారం వద్ద తెరచుకునేలా చేసే శస్త్రచికిత్సనూ నిర్వహిస్తారు. దీన్నే ఐపీఏఏ అని పిలుస్తారు. అయితే ఇలాంటి శస్త్రచికిత్సల తర్వాత మలద్వారం వద్ద తరచూ మలం బయటకు లీక్ అవుతుండటం అన్నది ఒక ప్రధానమైన రిస్క్. ప్రధానంగా రాత్రిళ్లు ఇలా జరుగుతుండటం సాధారణం.
చికిత్స
సాధారణంగా అల్సరేటివ్ కొలైటిస్‌కు పూర్తి తగ్గించేలా చేసే చికిత్స అందుబాటులో లేదు. అయితే పెద్దపేగు మొత్తాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి చికిత్స చేసే అవకాశం ఉంది. సంప్రదాయ చికిత్సలో భాగంగానైతే చాలా సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడి ఈ వ్యాధిని అదుపులో ఉంచి, రోగి తన దైనందిన వ్యవహారాలన్నీ మామూలుగానే చేసుకునేలా చూడవచ్చు. అయితే ఇటీవల ఈ
‘ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్’ చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అనేక ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తూ... ఈ వ్యాధి విషయంలో ఆశాకిరణాల్లా కనిపిస్తున్నాయి.
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అనే ఈ వ్యాధి కాస్తంత మొండిగా ఉంటూ తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అవలంబిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ వ్యాధికి దూరంగా ఉండాలి. లేదా కనీసం వ్యాధిని నియంత్రణలో అయినా ఉంచుకోవడం మేలు అని గుర్తించాలి.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు
ఈ లక్షణాలు కొందరిలో తక్కువగానో, మరికొందరిలో ఓ మోస్తరుగానూ, ఇంకొందరిలో చాలా తీవ్రంగానూ ఉండవచ్చు. ఒక్కోసారి ఈ తీవ్రతల్లో మార్పులూ-హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. ఆ లక్షణాలివి...
తరచూ మలద్వారం నుంచి రక్తస్రావం
బంక (మ్యూకస్) పడుతుండటం
కొద్దిగా నీళ్ల విరేచనాలు కావడం (రోజులో నాలుగు కంటే తక్కువ సార్లు)
కొద్దిగా కడుపులో పిసికినట్లుగా/బిగబట్టినట్లుగా వచ్చే నొప్పి
మలబద్ధకంగా ఉండటం.
లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు...
తరచూ పల్చటి రక్తవిరేచనాలు కావడం (రోజులో పదిసార్లు కూడా కావచ్చు)
రక్తహీనత
తీవ్రమైన కడుపునొప్పి
జ్వరం
బరువు తగ్గడం.
ఇవిగాక... జీర్ణవ్యవస్థకు సంబంధించని కొన్ని ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. అవి కీళ్ల నొప్పులు, కీళ్ల వద్ద వాపు వంటివి కాస్త అరుదుగా కనిపించవచ్చు. ఇలాంటివి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనిపిస్తాయి.
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అంటే...?
నిజానికి ఐబీడీ అని సంక్షిప్తంగా పిలిచినా ఇందులో రెండు వ్యాధులు ఉన్నాయి. మొదటిది అల్సరేటివ్ కొలైటిస్. మరోటి క్రోన్స్ డిసీజ్. నిజానికి కొంత కాలం క్రితం వరకు ఈ రెండూ మనకు సంబంధించిన వ్యాధులు కావనీ, కేవలం పాశ్చాత్య దేశాలకు సంబంధించినవనే అభిప్రాయం ఉండేది. కానీ గత రెండు దశాబ్దాల కాలంలో మన ప్రజల్లోనూ ఈ వ్యాధుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇటీవల ఈ వ్యాధి గ్రస్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యాధి నిర్ధారణ ఇలా...
సాధారణంగా మలద్వారం నుంచి పైప్ వేసి పేద్దపేగులోపలికి పరిశీలనగా చూసే ‘కొలనోస్కోపీ’ అనే ప్రక్రియ ద్వారా ఈ ‘ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్’ను నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షించి కూడా వ్యాధి నిర్ధారణ చేస్తారు. కొన్నిసందర్భాల్లో గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై వంటివీ అవసరం కావచ్చు.
క్రోన్స్ డిసీజ్ అంటే...
పెద్దపేగులోనే ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. అయితే ఒకవేళ ఇలాంటి ఇన్‌ఫ్లమేషనే... నోరు మొదలుకొని, మలద్వారం వరకు మొత్తం జీర్ణవ్యవస్థ పొడవునా ఎక్కడైనా రావచ్చు. ఒక్కోసారి ఈ జీర్ణనాళం కొన్ని చోట్ల సన్నబారిపోవచ్చు. ఇలా సన్నబారడాన్ని స్ట్రిక్చర్ అంటారు. అలాగే జీర్ణనాళం పొడవునా ఎక్కడైనా పుండ్లు కూడా పడవచ్చు. ఈ లక్షణాలు ఒక్కొక్కటీ ఉండవచ్చు లేదా అన్నీ కలిసి కూడా ఉండవచ్చు. ఈ వ్యాధినే క్రోన్స్ డిసీజ్ అంటారు.
అల్సరేటివ్ కొలైటిస్ అంటే...
ఏదైనా శరీర భాగం ఒరుసుకుపోయినట్లుగా ఎర్రబారి వాపు, మంట రావడాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. అల్సరేటివ్ కొలైటిస్ వ్యాధిలో పెద్దపేగు లోపలి లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఒక్కోసారి అక్కడ పుండ్లూ రావచ్చు. రక్తస్రావం కావచ్చు. దాంతో నీళ్ల విరేచనాలూ కనిపించవచ్చు. ప్రధానంగా ఈ ప్రభావం పెద్ద పేగు చివరి భాగం... అంటే మలద్వారానికి దగ్గర్లో పైభాగాన (రెక్టమ్ పైభాగాన) ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఒక్కోసారి మొత్తం పెద్దపేగులోనూ ఈ ఇన్ఫ్లమేషన్ విస్తరించవచ్చు. దీన్నే ‘అల్సరేటివ్ కొలైటిస్’ అంటారు.
కారణాలు
అల్సరేటివ్ కొలైటిస్‌కు లేదా క్రోన్స్ డిసీజ్‌కు కారణాలేమిటి అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ విషయమై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉంటే వాళ్ల సంతతికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కుటుంబాలకు చెందిన వాళ్లకు ఏదైనా సరిపడని అంశానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్లలో వ్యాధినిరోధకత తగ్గి అల్సరేటివ్ కొలైటిస్గానీ లేదా క్రోన్స్ డిసీజ్గానీ రావచ్చని నిపుణుల అభిప్రాయం. అంటే ఏదైనా సరిపడని వస్తువు జీర్ణవ్యవస్థకు సంబంధించిన జీర్ణనాళంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని శత్రువుగా పరిగణించిన మన వ్యాధినిరోధకత దాంతో పోరాటం సాగిస్తుందన్నమాట. ఫలితంగా అది పెద్దపేగులో లేదా జీర్ణనాళంలో పుండ్లు పడటానికీ లేదా ఇన్‌ఫ్లమేషన్‌కూ దారితీస్తుంది.
జన్యుపరమైన కారణాలు
చాలా సందర్భాల్లో ఇవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తుంటాయని పరిశోధనల్లో తేలింది.
పర్యావరణ కారణాలు
కొన్ని సందర్భాల్లో వాతావరణం కూడా ఈ వ్యాధి రావడానికి దోహదపడుతుందని తేలింది. ఇక కొందరిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, అది ఈ వ్యాధులను ప్రేరేపించడానికి దోహదపడవచ్చు. కొందరిలో సిగరెట్ అలవాటు మానేశాక అల్సరేటివ్ కొలైటిస్ రావడాన్ని గమనించారు. అయితే అల్సరేటివ్ కొలైటిస్ కంటే సిగరెట్ మరింత ప్రమాదకారి కాబట్టి ఈ కారణం చేత సిగరెట్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదు. పైగా సిగరెట్ తాగడం అన్నది క్రోన్స్ డిసీజ్ ఉన్నవారికి మరింత ప్రమాదకారి.