నుదుటిపై నల్లమచ్చలు.. తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. మల విసర్జనకు వెళ్తున్నప్పుడు నొప్పి ఉంటోంది. రక్తం కూడా పడుతోంది. డాక్టర్లకు చూపిస్తే ఆపరేషన్ అవసరమని అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? - సునీల్ కుమార్, నిడదవోలు
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీరు పైల్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య ఉన్నవారు మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం లేదా మలబద్దకంతో బాధపడుతుంటారు. మన శరీరంలోని రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగినప్పుడు రక్తం గడ్డకట్టి రక్తనాళాల్లో చిన్న బంతుల్లా తయారవుతాయి. వాటిని పైల్స్ అంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈమధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మలద్వారం వద్ద సమస్యలు ఉంటున్నాయి. మలవిసర్జన తర్వాత ఈ బాధ కొన్ని గంటల వరకు ఉంటుంది.
పైల్స్‌లో రకాలు: ఇందులో ఇంటర్నల్‌పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. మలవిసర్జన మార్గం లోపలి గోడలకు అంటి పెట్టుకొని ఉండేవి ఇంటర్నల్‌పైల్స్. ఇక మలవిసర్జన ద్వారం వద్ద ఉండేవి ఎక్స్‌టర్నల్ పైల్స్. ఇవి బఠాణీగింజ లేదా ద్రాక్షపండు పరిమాణంలో గులాబీరంగులో ఉండవచ్చు. మూడు నాలుగు కలిసి గుత్తులుగా లేదా విడివిడిగా కూడా ఉండవచ్చు.
కారణాలు: దీర్ఘకాలిక విరేచనాలు వంశపారంపర్యం మలబద్ధకం తగినన్ని నీళ్లు తాగకపోవడం మాంసాహారం అధికంగా తీసుకోవడం ఎక్కువ గంటల పాటు నిలబడి ఉండటం మద్యపానం వంటివి దీనికి కారణాలు. ఇక గర్భం ధరించిన మహిళల్లోనూ, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలోనూ పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ.
వైద్య పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ వంటి పరీక్షలతో వీటిని నిర్ధారణ చేస్తారు.
చికిత్స: పైల్స్ వ్యాధి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉంటుంది. దీనికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్బుమినా వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడటం వల్ల ఆపరేషన్ అవసరం లేకుండా ఈ సమస్య నయమవుతుంది.
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 54 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా నుదుటి మీద చర్మం నల్లగా, దళసరిగా మారుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. దీనికి కారణం ఏమిటి? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.
- సునీల్‌కుమార్, నూజివీడు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతుంది. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్‌ఓఎమ్‌ఏ-ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స ప్రక్రియ ఇలా
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం (అంటే వేళకు ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం) అవసరం. దాంతోపాటు ఒంటి రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... - ఆర్బుటిన్ - లికోరైస్ - కోజిక్ యాసిడ్
♦ పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి.
♦ యాభైకు ఎక్కువగా ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి.
♦ ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్స్యూల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్‌ఫార్మిన్ -500ఎంజీ ప్రతిరోజూ వాడాలి.
♦ ఇతర ప్రక్రియలు: ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 - 6 సెషన్ల పాటు చేయించుకోవాలి.
♦ లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్‌ను తగ్గించడంతో పాటు మందంగా మారిన చర్మం మామూలుగా కావడానికి, అక్కడి నలుపు తగ్గడానికి తోడ్పడుతుంది.
యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. మూడు నెలల క్రితం నెలసరి ఎక్కువవుతోందని పెద్దాపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. కానీ ఆపరేషన్ అయిన పదోరోజు నుంచి మూత్రం ఆగకుండా కారిపోతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మళ్లీ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇలా ఎందుకు జరిగింది? నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, హైదరాబాద్
ఒక్కోసారి పెద్దాపరేషన్ చేసే సమయంలో మూత్రాశయానికి గానీ మూత్రవాహికకి గానీ ప్రమాదవశాత్తు దెబ్బ తగిలినప్పుడు ఇలా మూత్రం కారిపోయే ప్రమాదం ఉంటుంది. దీనినే యూరినరీ ఫిస్టులా అంటారు. గర్భసంచిలో లేదా అండాశయంలో పెద్దగడ్డలు ఉన్నప్పుడుగానీ, ఎండోమెట్రియాసిస్ ఉన్నవారికి గానీ, ఇంతకు ముందు సిజేరియన్ అయినవారికి ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ. మూత్రాశయానికి లేదా యురేటర్‌కి ఎక్కడ దెబ్బతగిలిందో తెలుసుకొని యూరాలజిస్ట్ దీన్ని సరిచేస్తారు.
నా వయసు 45 ఏళ్లు. గత రెండేళ్లుగా చాలా ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి నేను మూత్ర విసర్జనకు వెళ్లే లోపలే దారిలోనే మూత్రం పడిపోతోంది. దాంతో నేను చాలా ఇబ్బందికి గురవుతున్నాను. ఎందుకిలా జరుగుతోంది? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ఒక సోదరుడు, విశాఖపట్నం
మూత్రం అతిగా విసర్జన జరుగుతున్న కండిషన్‌ను ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అని, దాన్ని ఆపుకోలేకపోవడాన్ని ‘అర్ట్ ఇన్‌కాంటిసెన్స్’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ వల్ల గానీ, నాడీవ్యవస్థలో వచ్చే వ్యాధుల వల్లగానీ లేదా డయాబెటిస్‌తో బాధపడుతుండటం వల్ల గానీ రావచ్చు. అంతేకాకుండా ప్రొస్టేట్ లేదా బ్లాడర్ వ్యవస్థను అదుపులో ఉంచే నాడీ కండరాలు దెబ్బతిన్నా జరగవచ్చు. ఒక్కోసారి ఏ కారణాలు లేకుండా కూడా ఈ సమ స్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇందుకు తగిన కారణమేదో తెలుసుకోడానికి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్స్‌లో వచ్చే ఫలితాలను పరిశీలించి తగిన చికిత్స చేయించుకోవాలి. మీ సమస్య చాలావరకు మందులతోనే నయమయ్యేందుకు అవకాశం ఉంటుంది.