హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. నేను పదేళ్లుగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున్న లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం కలుగుతోంది. ఈఎస్‌ఆర్ పెరిగి ఆర్‌ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? – సుమతి, కర్నూలు
మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకర కం. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ ఒక్కోసారి పొరబడి తన సొంత శరీరం పైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం, కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్లతోబాటు కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది.
కారణాలు : ∙శరీరంలోని జీవక్రియల్లో అసమతుల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. ∙శారీరక, మానసిక ఒత్తిడి ∙పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ∙ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు : ∙నిరాశ, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ∙మడమలు, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ∙ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ∙ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ∙రక్తహీనత, జ్వరం వంటివి.
నిర్ధారణ పరీక్షలు : సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్‌ఏ, ఎల్‌ఎఫ్‌టీ.
చికిత్స : రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్‌మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సంపూర్తిగా నయమవుతుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్
మైగ్రేన్ పెద్ద సమస్యగా మారిపోయింది..?
నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. దీంతో ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా ఈ సమస్యకు హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. – సురేశ్, హైదరాబాద్
సాధారణంగా ఈ సమస్య 15 – 45 ఏళ్ల వారిలో ఎక్కువగా ఉంటుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో మరీ ఎక్కువ. పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది.
కారణాలు: పార్శ్వపు నొప్పికి నిర్దిష్ట కారణాలేమిటనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియనప్పటికీ, తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు.
లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు.
2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు.
3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్‌టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
మాటిమాటికీ జలుబు... వాసనలు తెలియడం లేదు
నా వయసు 29 ఏళ్లు. నాకు గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. ఇలా తరచూ జలుబుచేస్తూనే ఉంది. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. ఈ సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – సుధాకర్‌రావు, నల్లగొండ
మీరు వివరించిన లక్షణాలను బట్టి మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి.
లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్‌లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
నివారణ: ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చల్ల్లని వాతావరణానికి, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం.
చికిత్స: హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్‌టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో కాన్‌స్టిట్యూషనల్ ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment