ఆర్థరైటిస్ అంటే కీళ్లనొప్పులు లేదా కీళ్ల వాతంగా చెప్పవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈ నెల 12వ తేదీ ‘ప్రపంచ ఆర్థరైటిస్ డే’. ‘‘దీన్ని ఎదుర్కోవడం మీ చేతుల్లోనే, అందుకే దీనిపై చర్యకు ఉపక్రమించండి’’ (ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ యాక్షన్) అన్నది ఈ ఏడాది థీమ్. ఈ నేపథ్యంలో దీని నివారణకూ, మేనేజ్‌మెంట్‌కూ బాధితుల చేతుల్లో ఏ మేరకు అవకాశం ఉందనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.
వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోతుంటాయనీ, దాంతో కీళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంటుందనీ, ఇది వయసు పెరగడం వల్ల వచ్చే సమస్య కాబట్టి సర్దుకుపోక తప్పదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కొంతవరకే వాస్తవం. నిజానికి కీళ్లనొప్పులు / కీళ్లవాతం అనేక కారణాలతో వస్తుంటాయి. వీటిల్లో వందకు పైగా రకాలున్నాయి. అన్నింటినీ కలుపుకుని ఆర్థరైటిస్ లేదా కీళ్లవాతం అనే ఒక పదంతో సూచిస్తుంటారు. పైగా వయసు పెరిగిన వారిలోనే వస్తుంటాయన్నది కూడా పూర్తిగా నిజం కాదు. చాలామంది మధ్యవయస్కుల్లోనూ, కొంతమంది యువకుల్లోనూ కనిపిస్తుంటాయి.
కారణాలు
కొన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ల కారణంగా, హార్మోన్ల అసమతౌల్యతలూ, విటమిన్‌ల లోపాలు, వాతావరణ కాలుష్యాలూ... ఇలా అనేక కారణాలతో వస్తుంటాయి. అరుగుదలతో వచ్చే వాటిని మినహాయిస్తే... సొంత కణాలపైనే తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతికూలంగా పనిచేసి, కణాలను దెబ్బతీయడం వల్ల వచ్చే కీళ్ల వాతాలూ ఉన్నాయి. ఇలా వచ్చేవాటిని ఆటో ఇమ్యూన్ సమస్యలుగా పేర్కొంటారు. శరీరంలోకి ప్రవేశించే శత్రుకణాలను దెబ్బతీయడానికి పుట్టే యాంటీబాడీస్... తమ సొంత కణాలే పరాయివిగా భావించి దెబ్బతీయడంతో కొందరిలో ఎముకలు, కీళ్లు, కండరాలతో పాటు... కొన్ని సందర్భాల్లో కీలకమైన అవయవాలు, వ్యవస్థలూ దెబ్బతినవచ్చు.
ఆర్థరైటిస్‌లలో ప్రధాన ఆటోఇమ్యూన్ వ్యాధులు...
ఆటోఇమ్యూన్ సమస్యలతో మహిళల్లో కనిపించే వ్యాధుల్లో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ స్కీ›్లరోసిస్, ఏపియన్ వంటివి ముఖ్యమైనవి.
- ఎస్‌ఎల్‌ఈ మహిళల్లో ఎక్కువగా కనిపించే ఓ ముఖ్యమైన వ్యాధి. ఇది కిడ్నీలు, కీళ్లు, చర్మం, మెదడు, కండరాల వంటి అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. అది చూపే ప్రభావాన్ని బట్టి కొందరిలో తేలికపాటి నుంచి తీవ్రమైన సమస్యగానూ ఉండవచ్చు. కొందరిలో ప్రాణాపాయానికీ దారితీయవచ్చు.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ) కీళ్ల మీద ప్రభావం చూపే వ్యాధి. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు వంకర్లుపోయి, శాశ్వత వైకల్యానికీ దారితీయవచ్చు. ఇది కీళ్లను మాత్రమే కాకుండా లంగ్స్, రక్తనాళాలు, కళ్లు, నాడీవ్యవస్థతో సహా శరీరంలోని ఇతర అవయవాలను లక్ష్యంగా చేసుకుని, ఇతర వ్యవస్థలనూ ధ్వంసం చేసే అవకాశమూ ఉంది. ఈ సమస్యతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ. అలాగే నాడీ వ్యవస్థ దెబ్బతినవచ్చు. ఈ కారణాలతో మరణాలకూ అవకాశం ఉంది.
- స్కిర్లోడెర్మా అనే కీళ్లవాతంలో చర్మం గట్టిపడటంతో పాటు జీర్ణవ్యవస్థ, గుండె, లంగ్స్, కిడ్నీల వంటి అవయవాలు ప్రభావితం కావచ్చు.
- యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే కీళ్లవ్యాధిలో రక్తం తరచూ గడ్డకడుతుంది. మహిళల్లో గర్భస్రావాలూ జరుగుతుంటాయి.
- ఇవిగాక ఇతర వ్యాధులు చాలానే ఉంటాయి.
లక్షణాలు:
- కీళ్లవాతాలకు దాని రకాన్ని బట్టి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా బయటపడకపోవచ్చు. వ్యాధి రకాన్ని బట్టి, తీవ్రతను బట్టి, బాధితుల వయసు, వారి ఇతర వ్యాధులను బట్టి లక్షణాల తీరు మారుతూ ఉంటుంది.
- అయితే దాదాపు అన్ని రకాల కీళ్లవ్యాధుల్లో కనిపించే సాధారణ లక్షణాలను క్రోడీకరిస్తే... సాయంత్రానికి జ్వరం రావడం, నీరసం, నిస్సత్తువ, అలసట, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు తొలిదశలో కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర వ్యాధుల్లోనూ కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని.
- నిర్దిష్టంగా కీళ్ల విషయానికి వస్తే కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేనాటికి బాధితులు తమ సొంత పనుల్ని కూడా చేసుకోలేని స్థితి వస్తుంది.
ఇతర జాగ్రత్తలు...
వీటిలో చాలావాటికి నివారణ ఉండదు. ఎందుకంటే ఇవి జన్యుపరమైనవీ, జన్యులోపాలతో వచ్చేవి. ఈ కారణంతో ఈ పరిమితి ఉంటుంది. ఈ జన్యులోపాలకు పర్యావరణ కారణాలూ, జీవనశైలీ తోడైనప్పుడు ఇవి బయటపడతాయి. అందుకే ఈ ఏడాది థీమ్‌ను బట్టి మన చేతుల్లో ఉండే అంశాలేమిటో తెలుసుకుని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం చాలావరకు మేలు చేయడంతో పాటు... కొంతమేర నివారణకూ తోడ్పడేందుకు అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి...
- బరువును తగ్గించుకోవాలి. దీనివల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది.
- ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇదీ చికిత్సలో భాగమే. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ∙పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి.
- క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి.
- విశ్రాంతి వల్ల కీళ్లవాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు చురుగ్గా ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి.
- దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. ఇదీ వాస్తవం కాదు. ఈ అపోహలకు దూరంగా ఉండటమూ బాధితుల చేతుల్లో ఉన్న పనే.
- ఈ ఏడాది థీమ్‌ను అనుసరిస్తూ... బాధితులు తగిన జాగ్రత్తల్ని పాటించడం, రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలిని మెరుగుపరచుకుంటే కీళ్లవ్యాధుల బాధల నుంచి దూరంగా ఉండవచ్చు.
చికిత్స: ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స ఉంటుంది. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటే తగు మోతాదులో స్టెరాయిడ్స్‌తో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ని మొదలుపెట్టాలి. జబ్బు తీవ్రతను అదుపు చేయడం కష్టమైన సందర్భాల్లో కొందరిలో ‘బయలాజిక్స్’ అనే మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. వ్యాధి తీవ్రత, ప్రభావితమైన అవయవం, బాధితులు స్త్రీ లేదా పురుషుడా అన్న అంశంతో పాటు ఒకవేళ బాధితులు మహిళలైతే వారు గర్భవతా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మందుల్నీ, వాటి మోతాదుల్ని రుమటాలజిస్టులు నిర్ణయించి, సూచిస్తుంటారు.
డా‘‘ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment