మారుతున్న జీవనవిధానం, శారీరక శ్రమ లోపించడం, పోషకాహారలోపం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఒకే భంగిమలో కూర్చుని పనులు చేయడం వంటి వాటి వల్ల గతంలో యాభైలు, అరవైలు దాటిన తర్వాత వచ్చే కీళ్లనొప్పులు ఇటీవలి కాలంలో ముప్ఫైలు, నలభైలలోనే చాలామందిని వేధిస్తున్నాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్ అంటారు. దీన్లో చాలా రకాలున్నాయి. మోకాళ్లలో కార్టిలేజ్ అరగడం వల్ల, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల కీళ్లు రెండూ ఒరుసుకుపోయి నొప్పి, వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. ఏ వ్యాధికైనా కారణాలు తెలుసుకోగలిగితే నివారణ, చికిత్స సులువు అవుతాయి. ఆ తర్వాత ఆహార నియమాలు, చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కీళ్లనొప్పులను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, సరైన వ్యాయామం చేయకపోవడం, వయసు పైబడడం, ఎక్కువగా జాగింగ్ చేయడం, ఎక్కువగా మెట్లు ఎక్కడం, మితిమీరిన వ్యాయామం, పోషకాహార లోపం, క్యాల్షియం లోపం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, రసాయనాల సమతుల్యత లోపం, హార్మోన్ల ప్రభావం, రోగనిరోధకశక్తి తగ్గడం వల్ల కూడా ఆర్థరైటిస్ సమస్య తలెత్తుతుంది. మోకాలు కదిల్చినప్పుడు మెల్లగా మొదలయ్యే నొప్పి క్రమేపీ నడవలేని స్థితికి చేరుస్తుంది.
ఈ ఆహారం తీసుకోవాలి
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. కాలానుగుణంగా వచ్చే అన్ని రకాల పండ్లు, క్యారెట్, బీట్రూట్, కాప్సికం, బీన్స్, చిక్కుడు లాంటి రంగు రంగుల కూరగాయల్ని సలాడ్లు, కూరలు లేదా సూప్ రూపంలో రోజూ తీసుకోవాలి. అలాగే క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రొకొలి, ముల్లంగి లాంటివి అధికంగా తీసుకోవాలి. ఇంకా ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మంచిది. తక్కువ కొవ్వు ఉండే కోడి మాంసం, ఒమేగా–3 అధికంగా ఉండే చేప, అవిసె, ఆక్రోట్ ఎక్కువగా తీసుకోవాలి. సరైన ఆహారంతో పాటు చేయగలిగినంత వరకు వ్యాయామం కూడా చేస్తే మంచిది.
వీటికి దూరంగా ఉండాలి
పాలిష్ చేసిన తెల్ల బియ్యం అన్నం, మైదాతో తయారు చేసిన చిరుతిళ్లు, బేకరీ ఫుడ్స్, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ, కాఫీలు మొదలైనవన్నీ పరిమితంగా తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం తగ్గించాలి. అలాగని పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. మోకాలి నొప్పులుంటే యోగాసనాలు వేయకూడదు అనే అపోహ ఒకటి వ్యాప్తిలో ఉంది. అది తప్పు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేయదగిన, వేయవలసిన ఆసనాలు కొన్ని ఉన్నాయి. వాటితో నొప్పులు తగ్గడంతోపాటు, కీళ్ల కదలికలు మెరుగవుతాయి. వాటిలో ముఖ్యమైనవి వీరాసనం, త్రికోణాసనం.
త్రికోణాసనం ఇలా...
కాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉండేలా నిలబడాలి. కుడి పాదం కుడి పక్కకు తిప్పాలి. నడుము కదల్చకుండా, నడుము పైభాగాన్ని కుడి వైపుకు వంచి, కుడి చేతిని కుడి పాదం దగ్గర నేలకు ఆనించాలి. ఇలా చేస్తున్నప్పుడే, ఎడమ చేతిని నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి. ముఖాన్ని పైకి లేపిన చేతి వైపు తిప్పాలి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి.
వీరాసనం ఇలా ...
అరికాళ్లు పిరుదులకు ఆనేలా మోకాళ్లను లోపలికి మడిచి నేల మీద కూర్చోవాలి. రెండు అర చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఈ ఆసనంలో 30 – 60 సెకన్ల పాటు ఉండాలి.పైన చెప్పుకున్న ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తుంటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment