కొందరికి కీళ్లలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కాళ్లూ చేతులపై అధికభారం పడ్డప్పుడు ఎక్కువవుతూ ఉంటాయి. సాధారణంగా మోకాళ్లు, మోచేతులు, కాలి వేళ్లు, మణికట్టు. భుజాలు, నడుము, వెన్నెముక భాగాల వాపుతో నొప్పితో పాటు అప్పుడప్పుడూ జ్వరం రావడం, కదల్లేకపోవడం లాంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి కీళ్ల సమస్యను వైద్యపరిభాషలో ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అంటారు. గతంలో పెద్దవయసు వారిలోనే వచ్చే కీళ్ల నొప్పులు ఇటీవల 20 – 40 ఏళ్ల వయసున్న వారిలోనూ కనిపిస్తున్నాయి.
ఇదీ కారణం... ఎముకల మధ్య కుషన్‌లా ‘కార్టిలేజ్’ పొర ఉంటుంది. ఇది అరిగిపోయినా లేదా చాలా ఎక్కువగా దెబ్బతిన్నా, ఆ ప్రాంతం లో వాపు వచ్చినా, ఎముకలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నా ఈ కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కండిషన్‌ను ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు.
పెయిన్‌కిల్లర్స్ వద్దు!
ఇలాంటివాళ్లలో కొందరు నొప్పులు రాగానే పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు. అది సరికాదు. అవి వాడినంత సేపు బాగానే ఉంటుంది. వాటి ప్రభావం తగ్గగానే మళ్లీ నొప్పులు మొదలవుతాయి. అవి కిడ్నీలాంటి కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. ఈనొప్పులు వస్తున్నప్పుడు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, ఆయన సలహా మేరకు ఈఎస్‌ఆర్, ఆర్‌ఏ ఫ్యాక్టర్, సీరమ్ యూరిక్ యాసిడ్, సీబీసీ, అర్థరైటిస్ ప్రొఫైల్, ఎక్స్‌రేలాంటి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ ఫలితాల ఆధారంగా చికిత్సలుంటాయి. కొన్నిసార్లు మందులతో పాటు ఫిజియోథెరపీ అవసరం కావచ్చు. కొందరిలో అరుదుగా సర్జరీ కూడా చేయించాల్సి రావచ్చు.
చదవండి: పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది..
ఈ జాగ్రత్తలు పాటించాలి...
► స్థూలకాయం లేకుండా చూసుకోవాలి. బరువు అదుపునకు వ్యాయామం చేయాలి
► క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు అంటే తాజా కూరగాయలు, పాలు, గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి
► వంటలలో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి.
► డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలే తప్ప డాక్టర్ సలహా లేకుండా చాలాకాలం పాటు పెయిన్‌కిల్లర్స్ వాడితే అసలు జబ్బు తగ్గకపోగా అదనంగా ఇతరత్రా సమస్యలు రావచ్చు.
చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా..
డాక్టర్ కొల్లా సాకేత్ -కన్సల్టెంట్‌స్పోర్ట్స్ అండ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్ సర్జన్
Comments
Please login to add a commentAdd a comment