హోమియో కౌన్సెలింగ్స్‌ | Homoeo Counseling | Sakshi
Sakshi News home page

హోమియో కౌన్సెలింగ్స్‌

Published Thu, May 10 2018 12:42 AM | Last Updated on Thu, May 10 2018 12:42 AM

Homoeo Counseling - Sakshi

ఫైబ్రాయిడ్స్‌కు పరిష్కారం ఉందా?
నా వయసు 43 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు.  హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎమ్‌. రమాదేవి, హైదరాబాద్‌
గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.  గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు.

1) సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌ 2) ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ 3) మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్స్‌.

కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్‌ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.
లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో, నడుములో నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడి మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.
చికిత్స: జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

- డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌


గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ తగ్గుతుందా?
నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కండుపులో మంట, వికారంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్‌ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – పి. రాజారావు, మిర్యాలగూడ
మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్‌) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ అంటారు. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి.

కారణాలు :
80 శాతం మందిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల అల్సర్లు వస్తాయి.
చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది.
మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం
కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి.

లక్షణాలు :
కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం
ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం
తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు
కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం
నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం.

నివారణ జాగ్రత్తలు :
పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి
మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి
కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి
కంటినిండా నిద్రపోవాలి
ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి.

చికిత్స : గ్యాస్ట్రిక్‌ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్‌ ఆల్బ్, యాసిడ్‌ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్‌ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి.

- డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌


ఒంటినిండా తెల్లమచ్చలు తగ్గుతాయా?
నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది.  డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది. హోమియో మందులతో తగ్గుతుందా? – కె. నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లి
చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు.

కారణాలు :
దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం
జన్యుపరమైన కారణాలు
దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు ∙మందులు, రసాయనాలు
కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్‌లలో లోపాలు
వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు.

లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు.

చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత డాక్టర్లు మందును సూచిస్తారు. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు చికిత్సను అందించవచ్చు.

- డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement