హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి కూడా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అని చెప్పారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
– ఎన్. శ్రీహరి, విశాఖపట్నం
మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.
మొలల దశలు: ∙గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది ∙గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి ∙గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత లోపలికి పోకుండా, వేలితో నెడితే లోనికి వెళ్తాయి ∙గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.
కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.
నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙కొబ్బరినీళ్లు ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
– డాక్టర్ ఎ.ఎం. రెడ్డి,
సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
మొలల సమస్యను తగ్గించవచ్చు!
Published Tue, Apr 25 2017 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement