మామూలు కణుతులతో ఆందోళన అక్కర్లేదు! | do not need to worry with the tumor to normal! | Sakshi
Sakshi News home page

మామూలు కణుతులతో ఆందోళన అక్కర్లేదు!

Published Wed, Mar 9 2016 11:13 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

మామూలు కణుతులతో ఆందోళన అక్కర్లేదు! - Sakshi

మామూలు కణుతులతో ఆందోళన అక్కర్లేదు!

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 35 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు నొప్పిగా ఉండటంతో పాటు రక్తం పడుతోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. దీనికి చికిత్స ఏదైనా ఉందా?
 - సునీల్‌కుమార్,  నిజామాబాద్

పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మన మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బంతుల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈమధ్యకాలంలో ఈ సమస్య ఎక్కువ. మల విసర్జన తర్వాత ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే చికిత్స చేయవచ్చు.

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు.
 రకాలు: ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి.
 
కారణాలు:  మలబద్ధకం, తగినంత నీళ్లు తాగకపోవడం  పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం      గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు  మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం  ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం  మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
 
హోమియో చికిత్స: పైల్స్ ఉన్నవారికి హోమియో ద్వారా చికిత్స చేయవచ్చు. హోమియో చికిత్స ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే ఇవి తగ్గిపోతాయి. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులను వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ మురళి
కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 18 ఏళ్లు. నా ఒంటి మీద దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ     (ఫెయిర్‌గానూ), మిగతా ప్రాంతంలో స్కిన్ కాస్త నల్లగా (డార్క్‌గా) కనిపిస్తుంది. నా మేని రంగు అంతా ఒకేలా ఉండి, దానికి నిగారింపు వచ్చేందుకు ఏం చేయాలి?
 - చందన, కాకినాడ

దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. ఆ భాగాలతో పోలిస్తే సూర్యకాంతి పడేచోట అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల సన్ డ్యామేజీ వల్ల మేని రంగు కాస్త డార్క్‌గా ఉంటుంది.  మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా ఉండటంతో పాటు, మెరుస్తూ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
 
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే  మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి. * సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్‌పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి.  సాధారణంగా మీరు ఫుల్‌స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది.  గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి.  పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలతో మీ చర్మాన్ని నిగారింపుతో ఉండేలా చేస్తారు.
 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్
 
బోన్ కేన్సర్ కౌన్సెలింగ్
 
మా అబ్బాయి వయసు 19 ఏళ్లు. అతడికి తొడ భాగంలో వాపు వచ్చింది. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను కలిస్తే పరీక్షించి దాన్ని మామూలు కణితిగా నిర్ధారణ చేశారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? రాబోయే రోజుల్లో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా?                        - నిరంజన్, కోదాడ
 ఎముకల్లోని కణుతుల్లో రెండు రకాలు. ఒకటి ప్రమాదకరం కాని కణితి. దీన్ని బినైన్ అంటారు. ఇక రెండోది మాలిగ్నెంట్ కణితి. ఇది క్యాన్సర్ కణితి. దీన్ని ఎక్స్-రే, ఎమ్మారై ద్వారా నిర్ధారణ చేయవచ్చు. మామూలు కణుతులైతే చిన్న ఆపరేషన్ ద్వారా చికిత్స చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని మామూలు కణుతులే ఆ తర్వాత క్యాన్సర్ కణుతుల్లా మారే అవకాశం ఉంది. అయితే మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
 
మా అమ్మగారికి 50 ఏళ్లు. రెండేళ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. చికిత్స చేసి దాన్ని తొలగించారు. ఈమధ్యకాలంలో తుంటి నొప్పి ఉందని నడవలేకపోతున్నారు. వైద్యులు పరీక్షించి తర్వాత తుంటి ఎముకకు క్యాన్సర్ సోకిందని చెప్పారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో చెప్పండి.      
 - కొండలరావు, నర్సీపట్నం

ఇతర అవయవాల నుంచి ఎముకలకు పాకిన క్యాన్సర్‌ను సెకండరీ క్యాన్సర్ అని అంటారు. ఇవి క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్ (ముదిరిపోయిన దశ)లో కనిపిస్తాయి. ఇలాంటి క్యాన్సర్‌కు సర్జరీ, రేడియోథెరపీ లేదా రెండూ కలిసి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇది కాలికి సంబంధించిదా లేక చేతికి సంబంధించిందా, ఒక ఎముకకా లేక ఎక్కువ ఎముకలలో ఉందా అన్న విషయాలు నిర్ధారణ చేయాలి. దానికి అనుగుణంగా అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. చికిత్స ద్వారా నొప్పులు  లేకుండా, ఒకరి మీద ఆధారపడటం వంటివి జరగకుండా చూడవచ్చు.
 
మా బాబు వయసు పదేళ్లు. నెల్లాళ్ల క్రితం ఆడుకుంటుంటే కిందపడి చిన్న దెబ్బ తగిలింది. వారం తర్వాత నొప్పి, వాపు ఉందని ఎముకల డాక్టర్‌ను సంప్రదించాం. ఎముకల్లో కణితి ఉందేమోనని అనుమానించి, ఎక్స్-రే తీయాలన్నారు. బయాప్సీ కూడా చేయించాలని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏదైనా ఉందా?   - రమాకాంత్‌రావు, నెల్లూరు
 
ఎముల్లో కణుతులు సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత బయటపడే అవకాశం ఉంది. ఈ కణుతులను ఎక్స్-రే, ఎమ్మారై స్కానింగ్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎముకల్లో ఇన్ఫెక్షన్ ఇలా కనిపించే అవకాశం ఉంది. అతడికి నీడిల్ బయాప్సీ ద్వారా ఒక చిన్న ముక్కను తీసి పరీక్షించి, వ్యాధి నిర్ధారణ అయిన దాన్ని బట్టి చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది.
 
డాక్టర్ కిశోర్ బి రెడ్డి
హెడ్ ఆఫ్ ద మస్క్యులో స్కెలెటల్ ఆంకాలజీ,
అమెరికన్ ఆంకాలజీ
ఇన్‌స్టిట్యూట్, శేరిలింగంపల్లి, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement