మద్యం దుకాణాలకు దరఖాస్తులు షురూ
- రెండో రోజు 19 దాఖలు
నెల్లూరు(క్రైమ్): మద్యం దుకాణాలకు లెసైన్సులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఒక్క దరఖాస్తు కూడా రాకపోగా బుధవారం 19 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో 10 ఉదయగిరి ఎక్సైజ్ సర్కిల్లోని మద్యం దుకాణాలకు దాఖలు కాగా, మిగిలినవి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిలోని దుకాణాలకు సంబంధించినవి. దరఖాస్తుదారుల్లో కొందరు మహిళలు కూడా ఉండడం గమనార్హం. దరఖాస్తుల సమర్పణకు 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఉండడంతో గురు, శుక్రవారాల్లో ఎక్కువ దరఖాస్తులు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. తదనుగుణంగా నెల్లూరులోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని దుకాణాలకు దరఖాస్తులు వచ్చేనా..
జిల్లాలో మొత్తం 348 మద్యం దుకాణాలు ఉండగా, అన్నింటికి దరఖాస్తులు దాఖలయ్యేది అనుమానంగా మారింది. గతంలో 30 దుకాణాలను పొందేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం తెలిసిందే. అప్పట్లో వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ ఉంటేనే 30 దుకాణాలు ఎవరూ పొందలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం పోటీ అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో అన్ని దుకాణాలకు దరఖాస్తుల దాఖలుపై ఎక్సైజ్ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు శ్లాబుల్లో మద్యం దుకాణాలకు గతేడాదికంటే మూడు, నాలుగు లక్షల రూపాయల లెసైన్సు ఫీజులు పెంచడం, బెల్టుషాపుల రద్దు తదితర నిర్ణయాలతో మద్యం వ్యాపారుల్లో నైరాశ్యం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బెల్టుషాపులు ఏర్పాటుచేసి వ్యాపారాలు చేస్తేనే నష్టపోకుండా బయపడగలిగామని, ఈ సారి అవి కూడా లేకుండా వ్యాపారం ఎలా నిర్వహించాలని వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.