కొత్తపేట ఘటనలో గాయపడిన ముగ్గురి మృతి
రాజమండ్రి(కొత్తపేట): తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పెలివెలలో మందు గుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రం గాయపడ్డారు. వీరంతా కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కొత్త పేట గ్రామంలోని కొబ్బరి తోటలో దూలం కొటేశ్వర రావు అనే వ్యక్తి అనధికారంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడుతో ఇటుక గోడలు, సిమెంట్ రేకులతో నిర్మించిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అ సమయంలో సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు అక్కడ పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి షెడ్డు శిథిలాల కింద ఉండిపోయారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, శిథిలాలను తొలగించారు. గాయపడిన వారిని స్తానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు మృతిచెందారు.