Expression of Interest
-
ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్ తయారీ.. ఐసీఎంఆర్ రూపకల్పన
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే సరికొత్త కిట్‌ను ఐసీఎంఆర్ తయారు చేసింది. దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి వ్యక్తికరణ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్– ఈఓఐ) బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి వ్యక్తం చేసిన ఐవీడీ కిట్ తయారీదారులకు ఈ ఇన్విట్రో కిట్లకు(ఐవీడీ) కావాల్సిన సాంకేతికతను సంస్థ బదిలీ చేస్తుంది. నూతన సాంకేతికతతో ఈ రియల్‌టైమ్ ఆర్టీపీసీఆర్ పరీక్షా కిట్‌ను ఐసీఎంఆర్ అధీనంలోని ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రిసెర్చ్‌సెంటర్ రూపొందించింది. ఈ కిట్ల సాంకేతికత, ఐపీ హక్కులు, వాణిజ్యహక్కులు సంస్థ వద్దనే ఉంటాయని, ఎంపిక చేసిన ఉత్పత్తిదారులతో లైసెన్సు అగ్రిమెంట్లను సంస్థ కుదుర్చుకొని అవసరమైన సాంకేతికతను బదిలీ చేస్తుందని ఐసీఎంఆర్ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్ విధానాన్ని వాడుతున్నారు. ఇది ఖరీదైనదే కాకుండా, ఫలితాలకు సమయం పడుతోంది. -
Vijayawada: బేరానికి బెజవాడ రైల్వేస్టేషన్!
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. రీ డెవలప్మెంట్ పేరిట 99 ఏళ్లు పాటు ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వేలో ప్రాధాన్యం కల్గిన ఈ స్టేషన్‌ను లీజుకు ఇవ్వనుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే నిర్ణయం.. విజయవాడ రైల్వే స్టేషన్‌ను కమర్షియల్‌గా హంగులతో ఆధునికీకరించేందుకు ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని గతంలోనే రైల్వే బోర్డు నిర్ణయించింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కూడా కోరింది. అప్పట్లో బిడ్డర్లు ముందుకు వచ్చినా రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగు వేశారు. అప్పట్లో 30 ఏళ్లు లీజు కాలంగా ప్రతిపాదించడంతో ఉపయోగం ఉండదని బిడ్డర్లు భావించారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వేస్టేషన్‌ను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎంపిక చేశారు. అందులో విజయవాడ రైల్వేస్టేషన్‌ను కూడా చేర్చారు. దీనిపై రైల్వే కార్మిక సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రాధాన్యం ఉన్న స్టేషన్.. విజయవాడ రైల్వేస్టేషన్ 1888లో ప్రారంభమైంది. మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 ప్లాట్ ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ గుండా కరోనాకు ముందు ప్రతి రోజు 250, ప్రస్తుతం 150 రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ గతంలో రోజుకు రెండు లక్షలు కాగా ప్రస్తుతం లక్ష వరకు ఉంటోంది. అన్ని సదుపాయాలూ ఉన్నా.. ఇక ఈ స్టేషన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పది ప్లాట్ ఫారాలు అనుసంధానం చేస్తూ మూడు ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు ఉన్నాయి. వీటిలో ఒకటి పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆరు మీటర్లు వెడల్పు 185 మీటర్లు పొడవుతో ఉంటుంది. రైల్వేస్టేషన్లో రిటైరింగ్ రూమ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల సదుపాయాలూ ఉన్నాయి. జనరల్, నాన్ ఏసీ, ఏసీ రెస్ట్ రూమ్‌లు ఉన్నాయి. పే అండ్ యూజ్ టాయిలెట్స్‌తో పాటు ప్రయాణికులకు డిస్ప్లే సిస్టమ్, ఆధునికీకరించిన ప్లాట్‌ఫారాలు, స్టాండర్స్ ఎక్విప్మెంట్ల వినియోగం, క్లీన్ అండ్ గ్రీన్ వంటి సదుపాయాలతో నేషనల్ గ్రీన్బిల్డింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డును సాధించింది. ఐఎస్ఓ హోదాను కల్గి ఉంది. ఆదాయం ఫుల్ అయినా.. విజయవాడ డివిజన్ నుంచి రైల్వేస్‌కు గణనీయమైన ఆదాయం వస్తోంది. నంబర్‌వన్ స్థానానికి పోటీ పడుతోంది. ఇటువంటప్పుడు ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేకంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకునైనా రైల్వేనే సొంతంగా రీ డెవలప్మెంట్ వంటి వాటితో పాటు కమర్షియల్‌గా అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా ప్రైవేటు పరం చేసి 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ప్రయాణికులపైనా యూజర్‌చార్జీల భారం పడే అవకాశం ఉందని కార్మికులతో పాటు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. స్టేషన్ రీ డెవలప్మెంట్ కోసమే.. స్టేషన్‌ను రీడెవలప్మెంట్ చేయడానికి రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టు కింద తీసుకుని డెవలప్మెంట్ చేసేవారికి అప్పగిస్తారు. ఇప్పటికే గుజరాత్‌లోనూ, భోపాల్ వద్ద స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేశారు. డెవలప్మెంట్ చేసిన వాళ్లు యూజర్ చార్జీలు వసూలు చేసుకుంటారు. – పి.శ్రీనివాస్, డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రైవేటీకరణ తగదు రైల్వే స్టేషన్ ప్రైవేటీకరించాలనే ఆలోచన తగదు. ప్రైవేటు సంస్థలు ప్రయాణికులపై ఆర్థిక భారంమోపుతాయి. ముఖ్యంగా యూజర్ చార్జీల పేరుతో ఎక్కువ సొమ్ము వసూలు చేస్తాయి. ప్రస్తుతం స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా అవసరమైతే మెరుగైన సౌకర్యాలు రైల్వేశాఖే కల్పించాలి. – వడ్లమూడి రవి, ప్రయాణికుడు లీజుకు ఇవ్వడం సరికాదు.. దక్షిణ మధ్య రైల్వేలోనే మన స్టేషన్‌కు మంచి ఆదాయం వస్తుంది. అటువంటి స్టేషన్‌ను 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనుకోవడం సరియైన నిర్ణయం కాదు. అవకాశం ఉన్నంత వరకూ రైల్వే శాఖే స్టేషన్ల అభివృద్ధిని చేపట్టాలి. తద్వారా ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది. – శ్రీనివాస్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు విమానాశ్రయం ట్రీట్మెంట్
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ.. ప్రయాణికుల రైళ్లతో చేతులు కాల్చుకుంటున్న రైల్వే.. పాత విధానాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటీకరణ దిశగా పరుగుపెట్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెద్ద రైల్వే స్టేషన్లను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టి వాణిజ్యపరంగా ఆదాయాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా రైల్వేకు అనుబంధంగా ఏర్పాటైన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్డీసీ) ఈ నెలలోనే కార్యాచరణ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రణాళికను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇందుకు గాను ఆసక్తివ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) నోటిఫికేషన్‌ను ఈ నెలలోనే పిలవబోతున్నారు. సేవల విస్తరణ కంటే ఆదాయంపైనే దృష్టి.. దాదాపు ఐదున్నర ఎకరాల స్థలంలో లక్ష చదరపు మీటర్ల మేర నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ స్థలం లేక.. ఉన్న పది ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా కొత్తవి ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త నిర్మాణంలో కూడా ఆ సంఖ్య పెరగదు. అంటే రైలు ప్రయాణానికి సంబంధించిన సేవల విస్తరణ ఉండదు. వెరసి రైలు ప్రయాణికుల సేవల కంటే ఆదాయం పెంచుకోవడంపైనే రైల్వే ఈ ప్రాజెక్టులో దృష్టి సారించింది. గతంలో రైల్వే అధికారులు పీపీపీ పద్ధతిలో రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం రెండుసార్లు టెండర్లు పిలవగా స్పందన రాలేదు. ఇక అలా లాభం లేదని, కేవలం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకే ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఐఆర్ఎస్డీసీని ఏర్పాటు చేసింది. దీంతో కొత్త పంథాలో దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిర్మాణం, రైల్వేకు ఆదాయం, ఎంతకాలం లీజు.. తదితర వ్యవహారాలకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. దీనికోసమే ఆసక్తివ్యక్తీకరణ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అందులో ముందుకొచ్చే సంస్థలతో సంప్రదింపులు జరిపి కొత్త విధానాన్ని ఖరారు చేయనుంది. మెట్రో రైలుతో అనుసంధానం... కొత్త ఆలోచనలో మెట్రో రైలును కూడా చేర్చనున్నారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు ప్రత్యేకంగా మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు. సాధారణ రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఎస్కలేటర్ ద్వారా పక్కనే ఉన్న మెట్రో రైలు స్టేషన్లోకి చేరుకుంటారు. అక్కడ మెట్రో రైలు ఎక్కి గమ్యస్థానం వైపు వెళ్తారు. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఐఆర్ఎస్డీసీ ఎండీ మెట్రో రైలు అధికారులతో భేటీ అయ్యారు. అలాగే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కూడా కలిసి పనిచేయనున్నట్లు వారు పేర్కొంటున్నారు. నిర్వహణ భారం రైల్వేపై పడకుండా.. ప్రస్తుతం రైళ్లు, రైల్వేస్టేషన్ల నిర్వహణ అంతా రైల్వే శాఖనే చూస్తోంది. ఇక భవిష్యత్‌లో ఆ భారాన్ని పూర్తిగా వదిలించుకోనుంది. ప్రతిపాదిత స్టేషన్ల నిర్వహణ ఖర్చంతా ఐఆర్ఎస్డీసీనే చూస్తుంది. వాణిజ్యపరంగా స్టేషన్‌ను అభివృద్ధి చేసి భారీగా ఆదాయం పొందుతూ అందులో నుంచే ఖర్చును వెళ్లదీస్తుంది. అది పోనూ సాలీనా రైల్వేకు భారీ ఆదాయాన్ని ముట్టజెపుతుంది. దీనికి తగ్గ విధానాన్ని ఇప్పుడు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మాత్రమే దీని ప్రకారం అభివృద్ధి చేయనుండగా, ఆ తర్వాత నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, కాజీపేట, వరంగల్, తాండూరు, వికారాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, ఖమ్మం తదితర స్టేషన్లను అధీనంలోకి తీసుకోనుంది. ఇలా చేస్తారు.. ప్రస్తుతమున్న రాతి కట్టడం ఎలివేషన్‌ను అలాగే ఉంచుతూ దాని మీదుగా మూడంతస్తులో భారీ భవన సముదాయం నిర్మితమవుతుంది. ప్లాట్‌ఫామ్ నం.1 ముందువైపు ఉండే ఖాళీ స్థలం, ప్లాట్‌ఫామ్ నం.10 వైపు ఉండే ఖాళీ స్థలాలను కలుపుతూ భారీ భవన సముదాయాన్ని నిర్మిస్తారు. దీనికి పూర్తిగా విమానాశ్రయాల ప్రణాళికను అమలు చేయనున్నారు. అరైవల్, డిపార్చర్‌కు విడివిడి సెక్షన్లు ఉంటాయి. భవనానికి దిగువన 450 వాహనాలు నిలిపేలా భారీ పార్కింగ్తో సెల్లార్ నిర్మిస్తారు. ప్రస్తుతం రైలు ట్రాక్‌పైన పూర్తి ఖాళీగా ఉంది. కొత్త ప్రణాళికలో.. అవి భవనం లోపలకు చేరతాయి. అంటే ట్రాక్ పైభాగంలో కూడా నిర్మాణం ఉంటుంది. టికెట్ కౌంటర్లు సహా ప్రయాణికులతో ముడిపడి ఉన్న ఇతర కార్యకలాపాలకు సంబంధించి వేర్వేరుగా ప్రాంగణాలు ఉంటాయి. ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. విమానాశ్రయంలోకి వెళ్లగానే ఉండే తరహా సెటప్ ఉంటుంది. పైఅంతస్తులు పూర్తిగా వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, గేమింగ్ జోన్, దుకాణ సముదాయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌ల సెటప్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా మారిపోతుంది. చదవండి: ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తెలంగాణలో చాప కింద నీరులా కరోనా -
చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపైనే దృష్టి
పుణే: నానాటికీ తలనొప్పిగా పరిణమిస్తున్న చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) దృష్టి సారించింది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను జారీచేసింది. ఈ విషయాన్ని పీఎంసీ అదనపు కమిషనర్ రాజేంద్ర జగ్తాప్ వెల్లడించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘చెత్త తొలగింపు కోసం అనేక దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. అటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ కూడా వినియోగించుకోవాలని నిర్ణయించాం’ అని అన్నారు. అనేక పత్రికల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)కు సంబంధించిన ప్రకటనలను జారీచేశాం. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ 30 ఏళ్లపాటు చెత్త తొలగింపు, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ఇక్కడ కొన్ని ప్లాంట్లను నెలకొల్పాల్సి ఉంటుంది. కనీసం 15 ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్‌లో 100 నుంచి 250 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 500 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన మరో భారీ ప్రాజెక్టును కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తీకరణపై స్పందన కోసం ఆయా అంతర్జాతీయ సంస్థలకు నెల రోజుల వ్యవధి ఇచ్చాం’ అని అన్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, జపాన్ తదితర దేశాలకు సంబంధించిన అధికారులతో పీఎంసీ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ మూడు దేశాలు చెత్త తొలగింపు శాస్త్రీయ ప్రక్రియను వినియోగిస్తున్నాయన్నారు. ఈ దేశాలకు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ప్రతులను పంపుతామన్నారు. స్థలకొరత సమస్య పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ప్రతిరోజూ 1,600 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతుంది. స్థలాభావ సమస్య కారణంగా ఈ వ్యర్థాలను ఎక్కడ పారబోయాలనే అంశం పీఎంసీకి పెనుసవాలుగా మారింది. ప్రస్తుతం నగర శివారులోని ఫుర్సుంగి, ఉరులి గ్రామాల్లోగల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు చెత్తను తరలిస్తున్నారు. పీఎంసీ ఇటీవల రాంటెక్డి ప్రాంతంలో మరో ప్లాంట్‌ను నిర్మించింది. అయితే ఇవి తమ సామర్థ్యం మేర పనిచేయకపోవడం భారీ డంపింగ్‌కు దారితీస్తోంది. డంపింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేక ఫుర్సుంగి, ఉరులి గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల పీఎంసీ ఎదుట భారీస్థాయిలో ఆందోళన చేశారు. పీఎంసీకి వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా చెత్త లారీలు తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామాలు నగరంలో చెత్త భారీఎత్తున పేరుకుపోయేందుకు దారితీసింది. 15 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే డంపింగ్ కేంద్రాలకు వస్తున్న వ్యర్థాల్లో ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉంది. ఇది దాదాపు 15 శాతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అత్యవసరంగా మారింది. మరోవైపు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై పీఎంసీ నిషేధం విధించింది. ఉత్పత్తిదారులకు జరిమానా కూడా విధించింది.