ఫార్చూన్ టాప్ 20లో నలుగురు భారత టెకీలు
అసాధారణ ప్రతిభా పాటవాలు చూపించినవారికి గుర్తింపుగా ఫార్చూన్ పత్రిక వెలువరించే టాప్-20 టెకీల జాబితాలో ఈసారి నలుగురు భారతీయులకు చోటు దక్కింది. 'బిగ్ డేటా- ఆల్ స్టార్స్' పేరుతో ఫార్చూన్ ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉన్న 20 మందీ చాలా అద్భుతమైన ప్రతిభ చూపించారని, పరిశోధనలో లోతుల్లోకి వెళ్లారని ఆ పత్రిక పేర్కొంది. అందులో ఉన్న మన భారతీయుల వివరాలు చూద్దాం..
అరుణ్ మూర్తి హార్టన్వర్క్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. ముందుగా ఆయన యాహూలో పనిచేశారు. అప్పుడే హడూప్ అనే ఓపెన్ సోర్స్ స్టోరేజి, ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఉండేది. యాహూ వెబ్ సెర్చి కోసం దాన్ని అభివృద్ధి చేసే పనిని ఆయన బృందానికి అప్పగించారు. దాంతో మూర్తి 'యార్న్' అనే ఓ రిసోర్స్‌ను,వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను తయారుచేశారు. అది హడూప్కు ఆపరేటింగ్ సిస్టమ్‌గా పనిచేసింది.
సురభి గుప్తా ఎయిర్బిఎన్బి అనే ప్రముఖ ట్రావెల్ రెంటల్స్ వెబ్సైట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్టాన్ఫోర్డ్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె, టెక్స్ట్‌ను చదవాల్సిన అవసరం లేకుండానే దాని అర్థాన్ని వెలికితీసే 'సమ్మరైజేషన్' మీద కృషిచేసింది. తొలుత ఆమె గూగుల్‌లో పనిచేస్తూ ఓ పర్యటనకు వెళ్లాల్సి వచ్చి, ఎయిర్‌బీఎన్‌బీ సైట్ చూసింది. అందులో ఉన్న డేటాను చూసి ఇష్టపడింది. నాలుగు నెలల్లో ఆ కంపెనీ స్వరూప స్వభావాలను మార్చేసింది. వివిధ నగరాల ప్రాధాన్యం ఏమిటో.. ఎలా ఉంటాయో యూజర్లు చాలా సులభంగా ఈ సైట్ ద్వారా తెలుసుకోడానికి ఆమె చేసిన కృషి ఉపయోగపడింది.
స్వాతి సింగ్ జీఎంఎస్ ఐఎం ప్లాట్ఫాంస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 'మై ఆఫర్స్'ను ప్రవేశపెట్టడం వెనుక అసలు ఆలోచన ఆమెదే. దాని ద్వారా మెంబర్లు తమకు ఎప్పుడు ఏం కావాలో ఎంచుకోడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలు తమ వార్షిక పనితీరును పోల్చి చూసుకోడానికి ఉపయోగపడే టూల్‌ను కూడా ఆమె అభివృద్ధి చేశారు.
విజయ్ సుబ్రమణియన్ 'రెంట్ ద రన్‌వే' సంస్థలో చీఫ్ ఎనలిటిక్స్ ఆఫీసర్. ఈ సంస్థ డిజైనర్ డ్రస్సులను, యాక్సెసరీలను అద్దెకు ఇస్తుంది. తమకు తప్పిపోయిన డిమాండ్ ఏంటో అంచనా వేయడానికి, ఉత్పత్తులు ఎంతకాలం మనుగడ సాగిస్తాయో తెలుసుకోడానికి సుబ్రమణియన్ ఓ మోడల్‌ను తయారుచేశారు. దానివల్ల కంపెనీకి భారీ మొత్తంలో ఖర్చు తగ్గిపోయింది.