డైట్ తిప్పలు
డైట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి సాగుతున్న ప్రక్రియతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆన్లైన్లోనే ఉన్న డైట్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు స్పాట్‌కు మార్చడంతో కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న 618 మంది జిల్లాలోని అభ్యర్థులంతా మెదక్‌కు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారికి గత రెండు రోజులుగా కొనసాగిస్తున్న కౌన్సెలింగ్‌ను మరో రోజుకు అధికారులు పొడిగించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. చిన్నపిల్లలతో మహిళా అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం.
డీఈడీ చేస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడంతో అభ్యర్థులు డైట్లో ప్రవేశానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా డైట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను సులభతరం చేసేందుకు 2012-13లో ప్రభుత్వం వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించింది. దీంతో ఎంట్రెన్స్ రాసిన అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభించింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లను ఆన్లైన్ ద్వారానే నిర్వహించారు. మూడో విడతకు వచ్చేసరికి జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాలలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
ముందుకు సాగని కౌన్సెలింగ్..
జిల్లాలో మొత్తం 24 ప్రైవేట్, ప్రభుత్వ డైట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 240 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద, మిగిలిన 1,060 సీట్లు కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చేసరికి 52 తెలుగు మీడియం, 11 ఉర్దూ మీడియం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈనెల 6న కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకోసం 618 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
రెండు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతోపాటు, 200 నుంచి 300 కళాశాలలకు ఆప్షన్లు ఇస్తుండడంతో ఒక్కో అభ్యర్థికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ దశలో రెండు రోజుల గడువు చాలకపోవడంతో మరో రోజు పెంచారు. 6,7 తేదీల్లో సుమారు 350 మందికి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. మిగతా 268 మంది ఎదురు చూస్తున్నారు. బుధవారం ఎంత ఆలస్యమైనా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రెండు రోజులుగా..
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మొదటి రోజు అవకాశం దక్కని అభ్యర్థులు రెండో రోజు కూడా వచ్చారు. రెండో రోజూ అవకాశం దొరకని వారు మూడో రోజు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బస్సు చార్జీలతోపాటు రాకపోకలు సాగించ డం, వసతుల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చంటి పిల్లల తల్లులు సైతం రెండు రోజులుగా అవస్థలు పడ్డారు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులను తోడుగా తెచ్చుకుంటున్నారు. కౌన్సెలింగ్ వేగంగా జరగకపోవడం తో తమ నంబర్ వచ్చే వరకు ఇలా వీరంతా డైట్లో పడిగాపులు కాస్తున్నారు.
స్లైడింగ్ లేక సమస్య..
గతంలో మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రెండో, మూడో విడతల్లో తమ ర్యాంకుకు అనుగుణంగా దగ్గరి కళాశాలల్లోకి అడ్మిషన్ బదిలీ చేయించుకునే(స్లైడింగ్) అవకాశం ఉండేది. కానీ ఈసారి ఆ అవకాశాన్ని తొలగించడంతో అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.