దేశరాజధాని ఢిల్లీలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమికి జనం పడరాని పాట్లు పడుతున్నారు. గడచిన 24 గంటల్లో వడదెబ్బకు 33 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఐదు జిల్లాల్లో వడదెబ్బ కారణంగా మృతిచెందినవారి వివరాలు పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. వడదెబ్బకు బలైనవారిలో అత్యధికులు ఫుట్‌పాత్‌లు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారేనని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు ప్రతిరోజూ వందకుపైగా బాధితులు వాంతులు, తల తిరగడంలాంటి సమస్యలతో వస్తున్నారు.
లజ్‌పత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అలాగే నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ కింద రెండు మృతదేహాలు, మూల్‌చంద్ ఆస్పత్రి ముందు ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం, మూల్‌చంద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒకని మృతదేహం లభ్యమైంది. లజ్‌పత్ నగర్‌లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తర జిల్లాలో ఎనిమిది మృతదేహాలు, వాయువ్య జిల్లాలో ఏడు మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. జన్‌పథ్ లేన్ ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతల బారినపడటంతోనే వీరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు ఎండ వేడిమికి నెమళ్లు మృతి చెందుతున్నాయని నైరుతి జిల్లా పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో పోలీసులకు లభ్యమైన 33 మృతదేహాలు ఇంకా గుర్తిపునకు నోచుకోలేదు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం వివిధ ఆస్పత్రులలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment