ఆయుధం: మాటతో మానసిక దాడి?!
‘కత్తికన్నా మాటకు పదునెక్కువ’ అంటారు. సన్నిహిత సంబంధాలలో ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ‘మాట’ను మించిన ఆయుధం లేదు. ఒక్క మాటతో తమకు తామే బంధం మధ్య ఇనుప గోడగా మారచ్చు. చట్టం గృహహింసను మాత్రమే నేరంగా పరిగణించినప్పటికీ మానసిక దాడి అంతకుమించిన పరిణామాలకే దారితీస్తుందని, బంధాల నడుమ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కోవిడ్ సమయం నుంచి కుటుంబ బంధాలలో పెరుగుతున్న మానసిక దాడి గురించి .. నియంత్రించుకోదగ్గ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు నిపుణులు.
’ది రోల్ ఆఫ్ జెండర్ అండ్ ఏజŒ 2020æఅధ్యయనం ప్రకారం గృహహింసలో శారీరక దాడికి సమానమైన భావోద్వేగ దుర్వినియోగం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది.
► జోక్ చేస్తున్నామా...
భాగస్వామిని జోక్‌గా ఓ మాట అనాలనుకోవచ్చు. కానీ, జోక్స్ కూడా కొన్నిసార్లు చెడు పరిమాణాలకు దారి తీయవచ్చు. ఉదాహరణకు.. ‘ఎందుకంతగా తింటావు.. ఇప్పటికే ఏనుగులా అయ్యావు. ఇంకెంతవుతావు’ ఇలాంటి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణంగా భాగస్వామి ప్రవర్తనను నియంత్రించడానికి సంకేతంగా వాడుతారు.
► ప్రమాదకరమే
శారీరక లేదా లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కించపరిచిన వ్యక్తిత్వానికి గురవుతున్నారని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. యవ్వనంలో చాలా మంది వ్యక్తుల ప్రవర్తనపై బాల్యం ముద్ర అలాగే ఉండిపోయింది. లైంగిక, శారీరక వేధింపుల లాగానే భావోద్వేగ దుర్వినియోగం కూడా అత్యంత హానికరం.
► ప్రేమగా అవమానం..
ప్రేమతో అయినా అతను/ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ద్వారా భాగస్వామి తనను తాను ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. తమ విశ్వాసం దెబ్బతింటుంది. ’నువ్వు ఇంత తెలివితక్కువ దానివి అనుకోలేదు...’ చాలా సర్వసాధారణంగా ఇళ్లలో వాడే మాట. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా నిరూపణ చేసుకోవడానికి, తమ భాగస్వామిని మానసికంగా నియంత్రించడానికి, చాలా మంది వ్యక్తులు పెట్నేమ్స్తో అవమానకరంగా పిలుస్తుంటారు. ఆ మాటలు చాచి కొట్టినదానితో సమానంగా ఉంటాయి.
► జాప్యమూ లోపమేనా!
భాగస్వామిని నియంత్రించడానికి చిన్న చిన్న విషయాలు లేదా వారి పనులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకు.. ‘ఈ మాత్రం పని కూడా సరిగ్గా చేయడం చేతకాదా? ఎప్పుడూ లేటేనా..’ లాంటి మాటలు తరచూ అనేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఏదీ రాదని ఎదుటివారి ముందు నిరూపించాలనుకుంటారు.
► అరిస్తే వింటారా..
చిన్న విషయాలకే భాగస్వామిని కించపరచడం, పళ్లు కొరకడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, వస్తువులు పగులకొట్టడం.. లాంటివి బంధాలు బీటలువారడానికి సంకేతాలుగా నిలుస్తాయి.
► తామే గొప్పని..
కొందరికి తమ గొప్పతనాన్ని ప్రతీసారి చాటుకోవాలనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. భార్య ఉద్యోగం/వ్యాపారం లో ఏదైనా చిన్న విజయం సాధిస్తే ’నా వల్ల నీకు జాబ్ వచ్చింది. నేను కనికరిస్తే నువ్వు కాలు బయట పెట్టగలుగుతున్నావు. ఇదేమీ నీ గొప్పతనం కాదు’ వంటి మాటలు అనేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అంటారు మానసిక నిపుణులు.
చిన్నమాటే.. కానీ, అది పదునుగా మనసుపై దాడి చేస్తుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉంచేలా చేస్తుంది. ఒక్కో మాట పడుతున్నప్పుడు అది సమ్మెట దెబ్బలా బంధాన్ని చిధ్రం చేస్తూనే ఉంటుంది. అందుకే, హింస అంటే శారీరకమైనదే కాదు మానసికపరమైనది కూడా అని భావించి, ఎదుటివారిని నొప్పించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త పడటం మంచిది.
మాట్లాడే ముందే ఆలోచన
శారీరక దాడికన్నా భావోద్వేగపరమైన దాడి చాలా తీవ్రమైనది. ఒక చిన్న పదం చాలా తీవ్ర పరిమాణాలు చూపవచ్చు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అనే మాట ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బాంధవ్యం పలచబడటం మొదలవుతుంది. మానసిక దాడి కారణంగా ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోయి డిప్రెషన్ బారినపడిన వ్యక్తులను చూస్తుంటాం. కోవిడ్టైమ్లో ఈ సమస్య చాలా ఎక్కువ గమనించాం. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి ఒకే చోట ఉండేవారు. దీని వల్ల ఒకరినొకరు మాటలు అనుకోవడం కూడా పెరిగింది. ‘మానసిక దాడి’ భార్యభర్తలు, పిల్లలు–పెద్దలు మధ్య ఎక్కువయ్యింది.
ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణ ఉండాలి. బంధాల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. పెద్దలు ఒకరికొకరు కించపరిచేలా మాట్లాడుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మాట్లాడే ముందే ఆలోచించాలి. ‘ముందు మన మైండ్‌లో నన్నెవరైనా ఇలాగే అంటే ఎలా అనిపిస్తుంది’ అనే ఆలోచన చేయాలి. కోపం వచ్చినప్పుడు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయడం, ఆ ఆలోచనకు అక్కడ కట్ చేసి, మరో విషయంవైపు మైండ్‌ను డైవర్ట్ చేయడం, సహనాన్ని అలవర్చుకోవడం.. వంటివి పాటించాలి.
– ప్రొఫెసర్ జ్యోతి రాజ, సైకాలజిస్ట్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్
– నిర్మలారెడ్డి