eye damage
-
కల్తీ మద్యానికి 5 గురు బలి.. మరో 22 మంది..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించిన వారిలో 5 గురు చనిపోగా, మరో 22 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాలు.. అలీఘడ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పోలీసులకు తెలియకుండా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే, వారు పోలీసుల దాడులకు భయపడి మద్యాన్ని రోహెరా గ్రామంలోని ఒక చెరువులో పారబోశారు. దీన్ని చూసిన కొంత మంది ఇటుక బట్టీ కూలీలు ఈ కల్తీ మద్యాన్ని తాగారు. కాగా, వీరందరు గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తెలియగానే స్థానిక పోలీసులు బాధితులందరిని జవహర్లాల్ నెహ్రు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, కల్తీ మద్యం బాధితులలో ఇప్పటి వరకు 5 గురు చనిపోయారని, మరో 22 మంది బాధితుల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని డాక్టర్ హరిస్ మంజుర్ తెలిపారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం వరకు (గురువారం) 27 మంది ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో మొదటి ఆరు గంటలు బాధితులకు ఎంతో విలువైందని డాక్టర్ మంజుర్ పేర్కొన్నారు. వీరిలో చాలా మంది శాశ్వతంగా చూపును కోల్పోయారని, మరో 13 మంది తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్నారని యూపీ మెడికల్ ఆఫీసర్ భానుప్రతాప్ తెలిపారు. మెడికల్ కాలేజ్ కంటి డాక్టర్ జియా సిద్ధిఖీ మాట్లాడుతూ.. వీరిలో ఆరుగురు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండగా, మరో 2 సరిగ్గా చూడలేకపోతున్నారు. మిగతా 4 కోలుకుంటున్నారని తెలిపారు. అయితే, మరికొంత మంది బాధితులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. గత నెల మే 28 న ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు, 35 మంది మరణించారు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల నుంచి చనిపోయిన వారిలో 87 మందిని పరీక్షించగా వారంతా.. కల్తీ మద్యం కారణంగానే చనిపోయానట్లు తెలింది. అప్పటి, కేసులో 34 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. -
నాన్నా.. కనపడ్తలే
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విచ్చలవిడి వాడకంతో చిన్నారుల్లో కంటి సమస్యలు అధికం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. విటమిన్–ఏ లోపం వల్ల కూడా పిల్లల్లో దృష్టిలోపం మరింత పెరిగిందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ కంటి నివేదికను తాజాగా విడుదల చేసింది. మైదానాల్లో ఆటలు తగ్గడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టడంతో పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రధానంగా దూరం చూడలేని (మయోపియా) పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించింది. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన జ్వరం, డయాబెటిస్ ఉన్న పిల్లల్లోనూ కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని విశ్లేషించింది. మూడు మీటర్ల దూరం నుంచి కూడా వేళ్లను లెక్కించలేని వ్యక్తిని ‘గుడ్డి‘గా పరిగణిస్తారని (గతంలో ఇది ఆరు మీటర్లుగా ఉండేది) ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. పెరిగిన చైతన్యం... తగ్గుతున్న అంధత్వం దేశంలో నానాటికీ అంధత్వం తగ్గుముఖం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2007తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో అంధుల సంఖ్య 47 శాతం తగ్గిందని పేర్కొంది. 2020 నాటికల్లా మొత్తం జనాభాలో అంధుల సంఖ్యను 0.3 శాతానికి తగ్గించాలంటూ ఆ సంస్థ విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు చేరువైనట్లు పేర్కొంది. 2006–07లో దేశ జనాభాలో ఒక శాతం మంది అంధులు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 0.36 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 2010లో దేశ జనాభాలో 5.30 శాతంగా ఉండేదని, ఇప్పుడు అది 2.55 శాతానికి తగ్గిందని వివరించింది. మరోవైపు తెలంగాణలో గత పదేళ్లతో పోలిస్తే అంధత్వం దాదాపు 52 శాతం తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తర్వాత దీనిపై పలువురు వైద్యాధికారులు విశ్లేషణ చేశారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమం ద్వారా పరిస్థితి మరింత పెరిగిందని చెబుతున్నారు. ఏడు నెలలపాటు కంటి వెలుగు కింద 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. 9,882 గ్రామాల్లో (99.50%) కంటి పరీక్షలు పూర్తిచేశారు. 22.92 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అక్కడికక్కడే అందజేశారు. మరో 15 లక్షల మందికి చత్వారీ అద్దాలు ఇచ్చారు. ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం 9.30 లక్షల మందిని ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వారిలో దాదాపు 6 లక్షల మందికి వివిధ రకాల ఆపరేషన్లు అవసరమని, మిగిలిన వారికి తదుపరి వైద్యం అవసరమని అంచనా వేశారు. వారిందరికీ సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లోనూ ఆపరేషన్లు నిరంతరం జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు... అందరికీ ఆరోగ్యం వంటి పథకాల్లో కంటి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఆదాయం కలిగినవారికి కూడా అత్యాధునిక కంటి వైద్యం అందజేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ కంటి వైద్యం అందుబాటులోకి రావాలి. డయాబెటీస్, తల్లీపిల్లల ఆరోగ్యం వంటి వాటితోపాటు కంటి జాగ్రత్తలపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కంటి వైద్యం, చికిత్సలపై ఉన్నతస్థాయి పరిశోధనలు జరగాలి. సర్కారు నిధుల కేటాయింపు, ప్రైవేటురంగ భాగస్వామ్యం తప్పనిసరి. ప్రజల్లో కంటి సమస్యలపై అవగాహన పెంచాలి. ఇందుకోసం ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టాలి. ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో కంటిపై రేడియేషన్... పిల్లల్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల వాడకం పెరగడంతో వారిలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో గేమ్స్ వాడకం వల్ల బ్లూ రేడియేషన్ ఏర్పడి నిద్రలేమి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించేందుకు కూడా మొబైల్‌ను చేతికి ఇస్తున్నారు. ఇలా వారు అలవాటు పడిపోతున్నారు. – డాక్టర్ దీప శిల్పిక, కంటి వైద్య నిపుణులు శివాస్ హెల్త్ అండ్ ఐ రీసెర్చి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
పెన్సిల్ గుచ్చి కన్ను పోగొట్టాడు..!
ముంబై : బడి పిల్లల మధ్య మొదలైన గలాట ఓ విద్యార్థి కంటి చూపు పోయేందుకు కారణమైంది. ఓ విద్యార్థి కంట్లో పెన్సిల్‌తో గుచ్చడంతో అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. ఈ ఘటన ఘట్కోపర్లో గతేడాది జూలై 21న జరిగింది. అయితే, చికిత్స చేస్తే తమ కుమారుడి (9) కన్ను బాగవుతుందని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన విద్యార్థి కుటుంబం నుంచి నష్టపరిహారం ఇప్పించడని పోలీసులను ఆశ్రయించారు. పెన్సిల్‌తో పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం నమ్మబలికిందని... ఇప్పుడు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నష్టపరిహారం ఇప్పించకపోగా.. రూ.3 వేలు ఫీజు కట్టలేదని తమ పిల్లాడి మార్కుల మెమోను నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సర్జరీలు చేయించామని తమ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వాపోయారు. పెన్సిల్ లెడ్ చిన్నారి కంటిలోనే ఉండిపోవడంతో చూపు తిరిగిరావడం అసాధ్యమని వైద్యులు అంటున్నారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణల్ని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది. పిల్లాడి కంట్లో దాడి చేసిందెవరో ఖచ్చితంగా తెలియదన్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ టీచర్లెవరూ లేదని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇక బాధితుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్టుగా తాము ఎవరినుంచీ నష్టపరిహారం ఇప్పించలేమని స్పష్టం చేశారు. కావాలంటే.. స్థానికంగా ఉండే నాయకుల సహకారంతో పిల్లాడి కంటి చికిత్సకు అవసరమైన సాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు. గతేడాది కాలంగా బాధిత విద్యార్థి ఫీజు తనే చెల్లిస్తున్నానని వెల్లడించారు. బాధితుని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నిజానిజాలు కనగొంటామని పంత్నగర్ సీనియర్ ఇన్స్పెక్టర్ రోహిణీ కాలే తెలిపారు. -
చిన్నారి పాప.. ఎందుకీ శిక్ష?
‘ఆమె చేసిన తప్పేంటి? లోకం తెలియని పసిపాప. ఆమెకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను దేవుడిని కోరేది ఒక్కటే. దీనంతకీ కారణమైన వారిని కఠిన శిక్ష పడాలి’ ఓ తల్లి ఆవేదన ఇది. తన 20 నెలల కుమార్తె హిబా నిసార్ కంటిపాపను చిదిమేసిన వారిపై మార్సలా జాన్ వ్యక్తం చేసిన ఆక్రందన అందరినీ కదిలిస్తోంది. జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని శ్రీ మహరాజ హరిసింగ్ (ఎస్ఎంహచ్ఎస్) ఆస్పత్రి ఆప్తమాలజీ విభాగంలో నాలుగో నంబరు మంచంపై హిబా నిసార్ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఏడుపు మాన్పించేందుకు ఆమె తల్లిదండ్రులు చాకెట్లు, స్వీట్లు ఇచ్చి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కంటి గాయం బాధను తట్టుకోలేక చిన్నారి రోదిస్తూనే ఉంది. షొపియాన్లో ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కుడి కంటికి గాయమైంది. ఇంట్లో ఆడుకుంటున్న హిబా కంట్లోకి పెల్లెట్ దూసుకొచ్చింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శత్రచికిత్స చేసి పెల్లెట్‌ను తొలగించారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కుడి కంటిచూపు పోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో హిబా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏం జరిగింది? షోపియాన్‌లో ఆదివారం తెల్లవారుజామున అల్లర్లు చెలరేగడంతో భద్రతా దళాలు, అల్లరి మూకలకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పౌరుడొకరు ప్రాణాలు కోల్పోగా, 50 మందిపైగా గాయపడ్డారు. ఇదే గొడవలు హిబా కంటి గాయానికి కారణమయ్యారు. తమ ఇంటి దీపం హిబాకు గాయమైన క్రమాన్ని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో ఆమె తల్లి జాన్ వివరించారు. ‘మేము ఇంట్లో ఉండగా బయట టియర్ గ్యాస్ కాల్పులు కొనసాగాయి. బయటంతా పొగ కమ్మేయడంతో ఐదేళ్ల నా కుమారుడు శ్వాస పీల్చుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో నా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాను. వెంటనే తలుపులు తీశాను. ముగ్గురు వ్యక్తులు(భద్రతా సిబ్బంది) నేరుగా మాపైకి పెల్లెట్లను ప్రయోగించార’ని వెల్లడించారు. హిబా కుటుంబం షొపియాన్ జిల్లా బాత్గండ్ ప్రాంతంలోని కాప్రిన్ గ్రామంలో నివసిస్తోంది. ఆదివారం ఇక్కడే అల్లర్లు జరిగాయి. వైద్యుల సలహా మేరకు హిబాను షొపియాన్ నుంచి శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. కొడుకు ఎలా ఉన్నాడో? తన పిల్లలను కాపాడుకునే క్రమంలో తన చేతికి కూడా గాయమైందని మార్సలా జాన్ తెలిపారు. హిబాను రక్షించేందుకు తన చేతిని ఆమె ముఖానికి అడ్డుగా పెట్టానని చెప్పారు. తన చేతి పక్క నుంచి పెల్లెట్ హిబా కంట్లోకి దూసుకుపోయిందన్నారు. తమ కొడుకు గురించి కూడా జాన్, ఆమె భర్త నిసార్ అహ్మద్ ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడి దేహంలోకి పెల్లెట్లు దూసుకెళ్లాయేమో చూడాలని షొపియాన్లోని తన బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. పెల్లెట్ల బారి నుంచి కాపాడేందుకు తన కుమారుడిని మరోవైపుకు తోసేసినట్టు వెల్లడించారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని దీనంగా చెప్పారు. హిబా ఆరోగ్య పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఎస్ఎంహచ్ఎస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘ఆమె పరిస్థితి బాలేదు. చేతి వేళ్లు చూపించి చికిత్సకు చిన్నారి ఏవిధంగా స్పందిస్తుందో పరీక్షిస్తున్నాం. పెల్లెట్ కారణంగా కంటిలోని కార్నియా దెబ్బతింద’ని ఆప్తమాలజీ విభాగం డాక్టర్ ఒకరు వెల్లడించారు. చిన్నారి హిబా పడుతున్న యాతన ఆస్పత్రి సిబ్బందితో పాటు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె కంటిచూపు కలకాలం ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. -
నీ కళ్లు చల్లగుండ... కాఫీ తాగవయ్యా!
కళ్లు బాగుండాలనుకుంటున్నారా? కంటి చూపు మందగించకుండ ఆఉండాలనుకుంటున్నారా? గ్లకోమా, డయాబెటిస్ వంటి సమస్యల వల్ల రెటీనా చెడిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే హాయిగా కాఫీ తాగేసేయండి. కాఫీ తాగితే కళ్లు బాగుంటాయని తాజా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. కాఫీలో కెఫీన్ ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కాఫీలో 9 శాతం వరకూ క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. కంటి లోపలి పొర అయిన రెటీనా లో లక్షలాది వెలుతురును గుర్తించే కణాలుంటాయి. వీటి ఆధారంగానే మనం చూడగడుగుతాం. వీటికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ అందుబాటు తగ్గితే కంటి చూపు మందగిస్తుంది. క్లోరోజెనిక్ యాసిడ్ వల్ల ఆక్సిజెన్ అందుబాటు పెరుగుతుంది. ఇప్పటికే కాఫీ వల్ల అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి పలు వ్యాధులు రాకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి కాఫీ లాంటి ఈ వార్త చదివాక ఓ కప్పు కాఫీ తయారు చేసుకుని తాగేయండి!.