Eye hospitals
-
Hyderabad: దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితుల క్యూ (ఫొటోలు)
-
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అశ్విని నేత్రాలయంతో మ్యాక్సివిజన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన డాక్టర్ ఏఏవీ రామలింగా రెడ్డి సంస్థ అశ్విని నేత్రాలయంతో చేతులు కలిపింది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇది మ్యాక్సివిజన్ డాక్టర్ రామలింగా రెడ్డి ఐ హాస్పిటల్స్ పేరిట కార్యకలాపాలు సాగించనున్నట్లు ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మాచర్ల, గుంటూరులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ నేత్ర వైద్యుడు శరత్ బాబు చిలుకూరితో కలిసి శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ పేరిట ఈ తరహాలో తెలంగాణ వ్యాప్తంగా జేవీ కింద ఐ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వేలు చెప్పారు. ప్రస్తుతం తమకు సుమారు 20 పైచిలుకు సెంటర్స్ ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 50 దాకా పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, జేవీ విధానం కారణంగా నిర్వహణ, వ్యాపార విస్తరణను నిపుణులకు అప్పగించి, వైద్యులు ప్రధానంగా వైద్య సేవలపై మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని మ్యాక్సివిజన్ వ్యవస్థాపక మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని రామలింగా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో 6 జిల్లాల్లోకి విస్తరించనున్నట్లు శరత్ బాబు పేర్కొన్నారు. -
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
సిరిసిల్ల: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్ వైద్యవిజ్ఞాన సంస్థ సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం లో కంటి సమస్యలు లేకుండా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరించి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని వివరించారు. ఆరోగ్య తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాలి.. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, మనిషికి ప్రపంచాన్ని చూపించేవి కళ్లని, అలాంటి కంటి వైద్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల పేదల సేవలో ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు తోడుగా ప్రైవేటు సంస్థలు కూడా పేదల సేవకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల, హెటెరో వంటి సంస్థలు సిరిసిల్లలో పేదలకు సేవలందించేందుకు ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హెటెరో ఫౌండేషన్ సిరిసిల్లలో రూ.5 కోట్లతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటి ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తుందని వివరించారు. వీరి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు పేదల వర్గాలకు సేవలందించేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రసాద్ సంస్థ వైస్‌చైర్మన్ ఆత్మకూరి రామన్ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల 2.80 కోట్ల మంది పేదలకు వైద్య సేవ లు అందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటి వైద్యసేవల్లో ఎల్వీ ప్రసాద్ సంస్థ ముందుందని పేర్కొన్నారు. హెటెరో సంస్థ ప్రతినిధి రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మా సంస్థ సంపద సృష్టించి పది మందికి పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.50 లక్షల చెక్కును కేటీఆర్‌కు అందించారు. -
23986 మందికి పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఈనెల 15న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 35 వైద్య బృందాలు కంటి శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇప్ప టి వరకు జిల్లా వ్యాప్తంగా 23,986 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో 4,590 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశా రు. 7,207 మందికి వారి కళ్లకు సరిపడే అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 2,566 మం దికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. ఈనెల 27 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వాసవి కంటి ఆస్పత్రి, బోధన్‌లోని లయన్స్‌కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు జరుగనున్నా యి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నా యి. మొత్తం 15, 66, 787 జిల్లా జనాభా ఉండగా దీనికి అనుగుణంగా శిబిరాల ని ర్వహణను రూపొందించారు. గ్రామాల్లో ప్రతి రోజు 360 మందికి, పట్టణ ప్రాం తా లో 460 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఆరోగ్య కేంద్రాల పరిధి లో శిబిరాలు కొనసాగుతున్నాయి. 2019 ఫిబ్రవరి వరకు కంటి వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. మెడికల్ ఆఫీసర్లు, కం టి వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు డాటాను నమోదు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు శిబిరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చేవారిలో ఎక్కువగా వృద్ధులు, 40 ఏళ్లు పైబడినవారికే కంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నా యని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తున్నాం : జిల్లా వైద్యాధికారి సుదర్శనం కంటివెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైద్యసిబ్బంది, వైద్యాధికారులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరల్లో అన్ని సౌకర్యలు కల్పించా ము. షెడ్యుల్ ప్రకారం వైద్యశిబిరాలు నిర్వహించి పరీక్షలు పూర్తి చేస్తాం. -
గంటల తరబడి పనిచేస్తున్నారా... జాగ్రత్త!
సాక్షి: రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి అదే పనిగా టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా పని చేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 70 శాతం మంది ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసు ఏర్పడటం, మంట, దురద, తడి ఆరిపోవడం, నీరు కారడం వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినిదేవి, మ్యాక్స్‌విజన్, తదితర కంటి ఆస్పత్రుల్లో ఈ సమస్యతో ప్రతి రోజూ 400కుపైగా కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెప్పవాల్చకుండా వీక్షించడం వల్లే: నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షలకుపైగానే ఉద్యోగులు పని చేస్తున్నట్లు ఓ అంచనా. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పని సరిగా మారింది. చివరికి షాపింగ్ మాల్స్‌లో కూడా వీటి వినియోగం పెరిగింది. కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పని చేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి వంద మందిలో 70శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సుదాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కంటిపై పెరుగుతున్న ఒత్తిడి వల్ల తీవ్రమైన ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇక పిల్లలు గేమ్స్ పేరుతో కంప్యూర్లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించడం వల్ల పుస్తకంలోని అక్షరాలను కూడా పిల్లలు చదవలేక పోతున్నారు. కళ్లను కాపాడుకోవచ్చు ఇలా: కనురెప్పవాల్చకుండా అదేపనిగా కంప్యూటర్‌పై పని చేయకూడదు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి దృష్టిని మరల్చాలి. కంట్లో మంట ఉన్నప్పుడు కనురెప్పలను రెండు చేతులతో మూసి అదిమిపట్టుకోవాలి. కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు ట్యూబ్ లైట్లు ఆర్పేయకూడదు. చీకట్లో పనిచేయడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ కాంతి ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి 20 నుంచి 30సార్లు కళ్లను మూసి తెరవాలి. మానిటర్‌కు కళ్లు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. కళ్లు దురదగా అన్పిస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా కంటిపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కంటికీ వ్యాయామం: నిమిషానికి పదిసార్లు కళ్లు మూసి తెరవడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. కనుగుడ్లను కిందికి, పైకి కనీసం పదిసార్లు కదిలించాలి. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కనీసం 15సార్లు తిప్పాలి. ఎదురుగా ఉన్న గోడపై నల్లని గుర్తుపెట్టి దానిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా చూపును మెరుగు పరుచుకోవచ్చు. మంచి నీరు, పళ్ల రసాలు బాగా తాగడం ద్వారా కన్నీటి సమస్యను కొంత వరకు జయించవచ్చు. రోజుకు ఎనిమిది గంటలు కంటి నిండా నిద్రపోవాలి. దోస కీర ముక్కలను కనురెప్పలపై ఉంచడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. కనురెప్పల కలర్ కూడా మెరుగు పడుతుంది. ఈ సూచనలను పాటించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కంటివైద్య విభాగం అధికారి డాక్టర్ రవీందర్‌గౌడ్ సూచిస్తున్నారు. -
‘స్వచ్ఛ’త ఏదీ?
ఎక్కడికక్కడ చెత్తాచెదారం.. వాడేసిన సిరంజిలు, దూది, మందు బిళ్లలు.. వార్డుల్లో అపరిశుభ్ర వాతావరణం.. రోత పుట్టించే వంట గది పరిసరాలు.. పొంగిపొర్లే డ్రయినేజీలు..ఇదీ విశాఖలో ప్రభుత్వాస్పత్రుల దుస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ ఆస్పత్రుల్లో అమలుకాకపోవడం విశేషం. సాక్షి, విశాఖపట్నం : కేజీహెచ్, ఘోషా, ప్రాంతీయ కంటి ఆస్పత్రులు ఉత్తరాంధ్ర ప్రజలకు పెద్దదిక్కు. ఇక్కడికి జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి వేలాది మంది రోగులు వస్తుంటారు. ఒక్క కేజీహెచ్‌లోనే 1045 పడకలుండగా, సుమారుగా వెయ్యి మంది రోగులు ఇన్పెషెంట్లుగా ఉంటున్నారు. నిత్యం ఓపీకి వచ్చే వారి సంఖ్య వందల్లోనే. ఇంత కీలక ఆస్పత్రిలో పరిశుభ్రత అందని ద్రాక్షగానే ఉంది. ఆస్పత్రిలో ఎటుచూసినా పొంగిపొర్లే డ్రయినేజీలతో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. భావనగర్, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లలు, ప్రసూతి వారు ్డతదితర మెడికల్ విభాగాల్లో డ్రయినేజీలు శిథిలమై మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. అదీకాక ఆస్పత్రి ఆవరణలోనే పందులు, కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాడేసిన సిరంజీలు, మందులు, ఇంజక్షన్లు, కాటన్కట్లు, ఉపయోగించిన దూది ఇలా ఎక్కడికక్కడ పడేస్తున్నారు. ఇవి ఎవరికీ గుచ్చుకున్నా పరిస్థితి విషమిస్తుంది. కానీ ఆస్పత్రి అధికారులు పారిశుద్ధ్యంపై కనీసం శ్రద్ధ వహించడం లేదు. ఆ రెండు ఆస్పత్రులూ అంతే.. ఘోషాస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ఒకపక్క పోర్టు కాలుష్యం మరోపక్క ఎక్కడికక్కడ చెత్తాచెదారంతో ఇక్కడకొచ్చే గర్భిణులు నరకయాతన పడుతున్నారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రి చుట్టూ భారీగా పెరిగిపోయిన పొదలతో పరిస్థితి భయానకంగా మారింది. వాస్తవానికి ఆస్పత్రుల్లో వాడిన మందులు, ఇంజక్షన్లను ఎప్పటికప్పుడు బయటకు తరలించి సురక్షిత పద్ధతుల్లో నాశనం చేయాలి. కానీ ఇది సక్రమంగా జరగడం లేదు. అటు రోగుల వార్డుల్లో భరించలేని దుర్గంధంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పెరిగిపోతున్నాయి. కొందరు రోగులు, వారి బంధువులు వార్డుల్లో వాసన భరించలేక వాంతులు చేసుకుంటున్నారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో వార్డుల్లోకి రాత్రుళ్లు విష పురుగులు వస్తాయన్న భయంతో రోగులు గడుపుతున్నారు. మరోపక్క కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభుత్వాస్పత్రుల్లో అమలుకావడం లేదు. మొదటిరోజు ఆస్పత్రి వర్గాలు పది నిమిషాలు చీపుర్లతో శుభ్రత కార్యక్రమం మొక్కుబడిగా చేపట్టి వదిలేశారంతే. అంతేకాదు ఈ ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం తయారుచేసే వంటగదుల్లో కనీస శుభ్రత ఉండడం లేదు. కాగితాల్లోనే ప్రతిపాదనలు ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చేయాలి. కానీ ఇది జరగడం లేదు. కేజీహెచ్‌లో సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో దాన్ని ఆధునికీకరించేందుకు గతంతో అధికారులు రూ.5 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి జీవీఎంసీ రూ.1కోటి ఇవ్వడానికి ముందుకువచ్చినా ఆచరణలోకి రాలేదు. ఘోషాస్పత్రిలో కనీసం మరుగుదొడ్లలో నీటి సదుపాయం సక్రమంగా లేక పరిసరాలు దయనీయంగా మారాయి. రూ.1.10 కోట్లతో ఆధునికీకరణ చేపట్టడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంత వరకు నిధులులేక అధ్వానంగా పరిస్థితులు మారాయి. ప్రాంతీయ కంటి ఆస్పత్రిని రూ.10 కోట్లతో ఆధునికీకరించాలని ప్రతిపాదనలు ఉన్నా ఆచరణలోకి రావడం లేదు.