రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో బుధవారం చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మరో 11 మంది దుర్మరణం పాలవ్వడం విషాదాన్ని నింపింది. (పప్పా నా హీరో, బెస్ట్ ఫ్రెండ్..బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు)
ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక హెలికాప్టర్లలో ఒకటి, రష్యాకుచెందిన Mi-17V-5 హెలికాప్టర్ నీలగిరిలోని కూనూర్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రదేశంలో జనరల్ బిపిన్ రావత్‌ను సజీవంగా చూశానని ప్రత్యక్ష సాక్షి శివ కుమార్ తెలిపారు. టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న శివ మంటలు చెలరేగి హెలికాప్టర్ పడిపోవడం తాను స్వయంగా చూశానని పేర్కొన్నాడు. దీంతో తనతోపాటు కొంతమంది సంఘటనా స్థలానికి చేరుకుని శిధిలాలలో జనరల్‌ను సజీవంగా చూశానని వెల్లడించినట్టు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.
అక్కడ మూడు మృతదేహాలు పడి పోయి ఉన్నాయి. ఇంతలో ప్రాణాలతో ఉన్న ఒకతను మంచినీళ్లు కావాలని అడిగారని శివ కుమార్ చెప్పారు. వెంటనే ఆయనను బెడ్‌షీట్‌లో చుట్టి కిందికి తీసుకొచ్చి, రక్షణ దళాలకు అప్పగించాం. మూడు గంటల తరువాత ఆయనే బిపిన్ రావత్ అని ఎవరో చెప్పారని శివకుమార్ తెలిపారు. అయితే ఆ తరువాత ఆయన చనిపోయారని తెలిసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ఇంత చేసిన వ్యక్తికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. నీళ్లు ఇచ్చి ఉంటే బతికే వారేమో.. ఆయనను కాపాడుకోలేక పోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదంటూ శివ కుమార్ కంటతడి పెట్టారు.
కాగా ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపటడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్సకోసం ఆయనకు బెంగళూరుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రమాదస్థలినుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు హెలికాప్టర్ ఎందుకు కూలి పోయింది అనే అంశాలను పరిశోధించనున్నారు.