ఆనందం ఆకాశమంత!
విశాఖకు తరలివస్తున్న విమాన సర్వీసులు
రేపటి నుంచి ఎయిర్కోస్టా విమానం
త్వరలో విశాఖ-కోలాలంపూర్ సర్వీసు
1న ఎయిరేషియా ప్రతినిధుల రాక
విమానయాన రంగానికి సంబంధించి విశాఖ ప్రగతి ఇప్పుడు ఆకాశమే హద్దులుగా సాగుతోంది. అంబర వీధిలో పరుగులు తీస్తోంది. ఒక్కొక్కటిగా విమాన సర్వీసులుపెరుగుతూ ఉండడంతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు మరిన్ని ప్రారంభమవుతున్న తరుణంలో విశాఖ విమానాశ్రయానికి మరిన్ని మంచి రోజులు ఖాయంగా వస్తాయనిపిస్తోంది.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయం కొత్త విమానాల రాకపోకలతో కళకళలాడబోతోంది. అహర్నిశలూ విమానాల రాకపోకలకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో.. నగరానికి మరిన్ని సర్వీసులు నడపడానికి విమాన సంస్థలు ఉత్సాహం చూపుతూ ఉండడం ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఎయిర్ ఏషియా విమానం విశాఖలో వాలడానికి రంగం సిద్ధమవుతోంది. నగరానికి ఉగాది కానుకగా మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
విస్తృత సర్వీసులపై దృష్టి
విశాఖనుంచి విదేశీ సర్వీసులు నడపడానికి ఎయిర్ ఏషియా సంస్థ ఆసక్తి చూపుతోంది. విశాఖకు వచ్చివెళ్లే దేశవిదేశీ ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, పారిశ్రామిక వేత్తలను కలిసి డిమాండ్‌పై ఆరా తీయడానికి ఏప్రిల్ 1న ఆసంస్థ ప్రతినిధులు రానున్నారని భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. విశాఖ,కోలాలంపూర్ మధ్య నిత్యం విమానాలు నడిపడానికి ఆసంస్ధ యోచిస్తోందని చెప్పారు. విశాఖ నుంచి కోల్‌కతకు, విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు సర్వీసుల నిర్వహణపై అభిప్రాయాలు సేకరిస్తారన్నారు.
30 నుంచి ఇంకా తాకిడి
ఈనెల 30 నుంచి విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఇంకా పెరగనుంది. బ్రెజిల్ ఎంబ్రియార్ సంస్థకు చెందిన ఎయిర్ కోస్టా విమానం విశాఖకు రానుంది. ఈ విమానం హైదరాబాదులో ఉదయం ఏడుకు బయలు దేరి విశాఖకు ఉదయం 8.20కి చేరుతుంది. మరో అరగంటకు బెంగళూరు బయలు దేరుతుంది. బెంగళూరు నుంచి రాత్రి 8.20కి విశాఖ చేరుతుంది. 8.50కి బయ లు దేరి హైదరాబాదు వెళ్తుంది. అదే రోజు బెంగళూరు- విశాఖ- భువనేశ్వర్ మధ్య ఇండి గో విమానం నడవనుంది.
మధ్యాహ్నం 12.30 కి బెంగళూరులో బయల్దేరి 01.40కి విశాఖ వస్తుంది. 02.10కి బయల్దేరి భువనేశ్వర్‌కు 03.00 గంటలకు చేరుతుంది. అక్కడ 03.30కి బయలు దేరి సాయంత్రం 04.10కి విశాఖ వస్తుంది. ఇక్కడి నుంచి 04.30కి బయలు దేరి బెంగళూరుకి 05.50కి చేరుతుంది.