ఐస్‌క్రీం ఫ్యాక్టరీలపై దాడులు
విజయవాడ: నగరంలోని భవానీపురం, గొల్లపూడి పరిసర ప్రాంతాల్లో ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీలపై ఫుడ్‌సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణలో ఐస్‌క్రీంలు, చాకోబార్, క్యాండీలు తయారు చేస్తున్నట్లు, రంగు, రుచి కోసం నిషిద్ధ రసాయనాలు వాడుతున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఐస్‌క్రీం తయారీ కోసం వినియోగిస్తున్న నీటిని చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. కలుషిత నీటితోనే ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఐస్క్రీంల తయారీకి ఊరు, పేరు లేని పాలపొడి, ముడిపదార్ధాలను నిర్వాహకులు వాడుతున్నారు. తయారీ తేదీ, ఎక్స్పైర్ డేట్లు ఐస్‌క్రీం డబ్బాలపై ముద్రించడం లేదని గుర్తించారు. ఐస్‌క్రీం తయారీలో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ యాజమాన్యాలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి ఐస్‌క్రీంలు తింటే పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుండా, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఐస్‌క్రీం తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.