స్వర్ణం సాధించింది.. వెలుగునిచ్చింది!
రియో ఒలింపిక్స్ లో దేశానికి రజత, కాంస్య పతకాలను సాధించారని పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్లపై రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత క్రీడా సంఘాలు నజరానాలు ప్రకటించాయి. వీరితో పాటు వీరి కోచ్, ఇతర సహాయక సిబ్బందికి కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు మొదలయ్యాయి. ఇటీవల సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా దీపాకర్మాకర్, సాక్షి మాలిక్, పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్ కు బీఎండబ్ల్యూ కార్లు కూడా అందజేసి వారిని సన్మానించారు. అయితే కొన్ని దేశాల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి.
కెన్యా అథ్లెట్.. మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఫేత్ కిప్యేగాన్ విషయానికొస్తే ఆమె రియోలో స్వర్ణం సాధించడంతో పాటు తన గ్రామానికి వెలుగులు అందించింది. అదెలా అంటే.. రియోలో1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి గ్రామాని తిరిగి వెళ్లిన ఆమెను అధికారులు కలిశారు. ఈ సందర్భంగా కిప్యేగాన్ అధికారులను ఓ విజ్ఞప్తి చేసింది. 'మా గ్రామానికి మూడున్నర దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేదు. ఈ కారణం చేత నేను పాల్గొన్న ఈవెంట్ ను మా నాన్న టీవీలో చూడలేకపోయారు. దీంతో మరెన్నో సమస్యలను అధికారులకు, దేశాధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా దృష్టికి తీసుకెళ్లాను' అని స్వర్ణ విజేత తెలిపింది.
వెంటనే అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి, కొన్ని రోజుల్లోనే అక్కడ విద్యుత్ కాంతులు నింపారు. కిప్యేగాన్ తండ్రి సామ్యూల్ కొయిచ్ కిప్యేగాన్ కూడా రియోకు ముందే కరెంట్ సరఫరా చేసి తన కూతురి రేస్ ను చూడాలని కోరారు. రియోలో కిప్యేగాన్ స్వర్ణాన్ని సాధించిన తర్వాత అధికారులు కేవలం 9 రోజుల్లోనే విద్యుత్ కాంతులతో కళకళలాడుతోంది. ఆమె విజయం కుటుంబానికే కాదు మొత్తం గ్రామానికి వెలుగులు నింపిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.