నకిలీ విత్తన వ్యాపారిపై పీడీ యాక్ట్
రాష్ట్రంలో తొలిసారిగా..
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలు తయారుచేసి రైతు లను మోసగిస్తున్న ఓ వ్యాపారిపై రాష్ట్రంలో తొలిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన చిన్నం జానకిరామ్ అలియాస్ గోపీకృష్ణపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మంగళవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్, మహబూబ్‌నగర్ జిల్లాలో నకిలీ విత్తనాల తయారీకి సం బంధించి మూడు కేసుల్లో ఇతను నిందితుడు. స్వతహాగా తన తండ్రి విత్తనాల వ్యాపారంలో ఉండటంతోనే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన జానకిరామ్ 2004లోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టాడు.
తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో నాణ్యతలేని విత్తనాలు తయారు చేసి ఏజెంట్ల ద్వారా విక్రయించడం మొదలుపెట్టాడు. సృష్టి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైబ్రిడ్ బీటీ ఇంద్ర, భీష్మ, బలరామ్ విత్తనాలు తయారుచేసి రైతులకు విక్ర యించి మోసం చేస్తున్నాడు. ఈ కేసులో జూన్ 27న హయత్‌నగర్ పోలీసులు జానకిరామ్‌ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇతను విడుదలై బయ టకు వస్తే మళ్లీ నకిలీ విత్తనాల ముసుగులో ఎంతో మంది రైతులకు ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా కారకుడయ్యే అవకాశం ఉందని మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. నకిలీ విత్తనాలతోపాటు ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కొరడా ఝళిపిం చేందుకు ఇటీవలే పీడీ యాక్ట్‌కు సవరణ తెచ్చారు.