అమ్మ, నాన్న..ఇద్దరు కొడుకులు.. ఓ ‘ఎర్ర’ గ్యాంగ్
చిత్తూరు: అమ్మా, నాన్న.. వారి ఇద్దరు కుమారులు ముఠాగా ఏర్పడి ఎర్రచందనం తరలిస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని వేలూరు అళగిరి నగర్‌కు చెందిన నాగేంద్రన్(48), జ్యోతి(43), దంపతులు ఎర్ర చందనం స్మగ్లర్లు. వీరికి విశ్వనాథన్ (24), వీరాస్వామి (22) అనే ఇద్దరు కుమారులున్నారు. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో విశ్వనాథన్ బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా వీరాస్వామి ఎంఎస్ చదువుతున్నాడు.
నాగేంద్రన్, జ్యోతి 2013 నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నరకడానికి తమిళనాడులోని జవ్వాదిమలై నుంచి కూలీలను పిలిపించుకుని, నరికిన దుంగలను బెంగళూరులోని మాలూర్ భాషాకు విక్రయిస్తుంటారు. ఇలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేస్తుంటారు. వెనుక లారీలో ఎర్రచందనం దుంగలు వస్తుంటే ముందర స్కార్పియో వాహనంలో కుటుంబ సమేతంగా పైలట్‌లా వ్యవహరించి పోలీసుల నిఘాను పసిగడుతూ చాకచక్యంగా తప్పించుకుంటారు.
అయితే, ఆదివారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు బెంగళూరు– తిరుపతి బైపాస్ రోడ్డులోని పి.కొత్తూరు వద్ద లారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో టన్ను బరువున్న 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్నారు. జ్యోతి, నాగేంద్రన్తోపాటు వారి ఇద్దరు కుమారులు, జ్యోతి చెల్లెలి కొడుకు వెట్రివేల్ (22)లతో పాటు డ్రైవర్ కె.కుమార్ (22)ను అరెస్టు చేశారు. నాగేంద్రన్ దంపతులపై జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయి. వీరు వంద టన్నుల వరకు ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలించి రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వేలూరులో ఎర్రచందనం కేసులో అక్కడి పోలీసులు ఓ డీఎస్పీను సైతం అరెస్టు చేసినట్లు సమాచారం.