Family history
-
డీఎన్ఏ టెస్ట్ ఓవర్!
మీ నాన్నగారి పేరు మీకు తెలుసు. మీ తాతగారి పేరు తెలుసు. మీ ముత్తాత పేరు అంటే కాస్త కష్టపడి తెలుసుకోవచ్చు. కానీ మీ ముత్తాత నాన్నగారి పేరేంటి? అని ఎవరైనా అడిగితే.. ఆలోచనలో పడతారు కదూ. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది కదూ. హీరోయిన్ అమీ జాక్సన్‌కు అలాంటి ఆలోచనే కలిగింది. తన ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకోవాలనుకున్నా రామె. ఆల్రెడీ వై క్రోమోజోమ్ డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకున్నారు. నాన్న వైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ టెస్ట్‌ను ప్రిఫర్ చేస్తారు. అమ్మవైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకునేవారు మైటోకాండ్రియాల్ డీఎన్ఏ టెస్ట్ ప్రిఫర్ చేస్తారు. అమ్మానాన్న.. ఇద్దరి ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆటోసోమల్ డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు. ఈ విషయంపై అమీ మాట్లాడుతూ– ‘‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావ్? అని కొత్తగా పరిచయమైన కొందరు నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను ఇంగ్లాండ్ అని చెప్పాను. ‘నువ్వు ఇంగ్లాండ్ అమ్మాయిలా లేవు. నీలో ఆ పోలికలు అంత స్పష్టంగా కనిపించడం లేదు’ అన్నారు. మా నాన్నమ్మ 1990లో పోర్చ్గల్లో ఉండేవారు. కానీ అంతకు ముందు ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం నాకు ముఖ్యం. మా నాన్నగారి వైపు వాళ్ల గురించి తెలుసుకోవాలనుంది. కష్టమని తెలుసు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాను’’ అన్నారు. డీఎన్ఏ టెస్ట్ ప్రాసెస్ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘టెస్ట్ చేయించుకోవడం ఈజీ. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అధికారులకు సంబంధిత వివరాలను చెప్పాలి. వీటితోపాటు మన లాలాజలాన్ని అందజేయాలి. దీనిని వాళ్లు మిలియన్ల మంది డీఎన్ఏలతో పోల్చి చూస్తారు. కొన్ని వారాల తర్వాత ఫలితాలను చెబుతారు’’ అని చెప్పుకొచ్చారు. -
రాజకీయాల్లో ఇంటిపేర్లకు కాలం చెల్లింది: జైట్లీ
రాజకీయాల్లో ఇంటిపేర్లకు కాలం చెల్లింది: జైట్లీ న్యూఢిల్లీ: త్వరలో రాజకీయాల్లో ఇంటిపేర్లు, వంశచరిత్రకు తెరపడుతుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలకు చురకలంటించారు. ఇప్పటికే ఈ సంప్రదాయం ప్రపంచ వాణిజ్యరంగంలో ఆరంభమైందన్నారు. భారత చరిత్రలో 1991 ముఖ్యమైన టర్నింగ్‌పాయింట్ అని చెబుతూ, ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక రంగం అంతకు మునుపెన్నడూ లేనటువంటి దురవస్థను చవిచూసిందని, సత్తా ఉన్నోడే మనుగడ సాగిస్తాడు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికే పట్టం కడతారన్నది రుజువైందని అన్నారు. ఆదివారమిక్కడ నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి జైట్లీ మాట్లాడారు. ఇంటిపేరు, కుటుంబాలు, వంశచరిత్రలాంటి వాటితో పనిలేదని సత్తా ఉన్నోడే మనుగడ సాగిస్తాడనే సూత్రం ప్రస్తుతం న్యాయ, వ్యాపార రంగాలకు బాగా వర్తిస్తుందన్నారు. -
ఏడు తరాలు తెలిశాయి!
కుటుంబ చరిత్ర వర్తమానం నుంచి చూస్తే భవిష్యత్తే కాదు... భూతకాలమూ ఒక మిస్టరీనే. భూ పరిణామ క్రమం దగ్గర నుంచి మనిషి ఆవిర్భావం, నాగరకతలు అభివృద్ధి చెందడం వరకూ అనేక విషయాల గురించి లెక్కలేనన్ని సిద్ధాంతాలున్నాయి. మరి భూ పరిణామక్రమం అంతటి పెద్ద విషయం గురించి కాకపోయినా, తమ కుటుంబ పరిణామక్రమం గురించి పరిశోధన చేశాడొకాయన. ఆయన పేరు నిరంజన్ లాల్ మిట్టల్. కొచ్చిలో ఉంటారు. దాదాపు 20 సంవత్సరాల పాటు పార్ట్‌టైమ్‌గా పరిశోధన చేసి తమ కుటుంబానికి సంబంధించి 700 సంవత్సరాల చరిత్రను తవ్వితీసి వంశవృక్షాన్ని రూపొందించాడు. ‘‘1994లో ఒకసారి కొచ్చిలోని ఇంటిని శుభ్రం చేస్తుంటే ఓ పాత పుస్తకం దొరికింది. అందులో మా నాన్న, తాతల వివరాలున్నాయి. మా తాత రాసిపెట్టిన వివరాలవి. వాటిని చదివాక వంశ వృక్షం గురించి ఆసక్తి కలిగింది. పరిశోధన మొదలు పెట్టాను’’అని తన ఆలోచనను వివరించారు మిట్టల్. ‘‘పరిశోధనలో హరిద్వార్ కూడా వెళ్లివచ్చాను. కర్మకాండల కోసం వెళ్లిన కుటుంబాల వివరాలు ఉంటాయక్కడ. ఆ వివరాలుచాలా ఉపకరించాయి. నా పరిశోధన 1321లో మా కుటుంబ పెద్ద ‘ధర్ మిట్టల్’ వరకూ వెళ్లింది. ఆయన కోల్‌కతా ప్రాంతంలో నివసించే వారు. వారి వారసులు అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రయత్నంలో మా దాయాదులు అనేక మంది గురించి తెలిసింది. వారిలో కొందరు విదేశాలలో వ్యాపారవేత్తలుగా ఎదిగారు...’’ అంటూ తమ వంశపరిణామ క్రమాన్ని వివరించారు మిట్టల్. ఇలా తమ పూర్వీకుల వివరాలు సంపాదించడం తనకు ఎంతో ఉద్వేగాన్ని ఇస్తోందని మిట్టల్ అంటున్నారు.