ఏడు తరాలు తెలిశాయి!
కుటుంబ చరిత్ర
వర్తమానం నుంచి చూస్తే భవిష్యత్తే కాదు... భూతకాలమూ ఒక మిస్టరీనే. భూ పరిణామ క్రమం దగ్గర నుంచి మనిషి ఆవిర్భావం, నాగరకతలు అభివృద్ధి చెందడం వరకూ అనేక విషయాల గురించి లెక్కలేనన్ని సిద్ధాంతాలున్నాయి. మరి భూ పరిణామక్రమం అంతటి పెద్ద విషయం గురించి కాకపోయినా, తమ కుటుంబ పరిణామక్రమం గురించి పరిశోధన చేశాడొకాయన. ఆయన పేరు నిరంజన్ లాల్ మిట్టల్. కొచ్చిలో ఉంటారు.
దాదాపు 20 సంవత్సరాల పాటు పార్ట్‌టైమ్‌గా పరిశోధన చేసి తమ కుటుంబానికి సంబంధించి 700 సంవత్సరాల చరిత్రను తవ్వితీసి వంశవృక్షాన్ని రూపొందించాడు. ‘‘1994లో ఒకసారి కొచ్చిలోని ఇంటిని శుభ్రం చేస్తుంటే ఓ పాత పుస్తకం దొరికింది. అందులో మా నాన్న, తాతల వివరాలున్నాయి. మా తాత రాసిపెట్టిన వివరాలవి. వాటిని చదివాక వంశ వృక్షం గురించి ఆసక్తి కలిగింది. పరిశోధన మొదలు పెట్టాను’’అని తన ఆలోచనను వివరించారు మిట్టల్. ‘‘పరిశోధనలో హరిద్వార్ కూడా వెళ్లివచ్చాను. కర్మకాండల కోసం వెళ్లిన కుటుంబాల వివరాలు ఉంటాయక్కడ. ఆ వివరాలుచాలా ఉపకరించాయి.
నా పరిశోధన 1321లో మా కుటుంబ పెద్ద ‘ధర్ మిట్టల్’ వరకూ వెళ్లింది. ఆయన కోల్‌కతా ప్రాంతంలో నివసించే వారు. వారి వారసులు అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రయత్నంలో మా దాయాదులు అనేక మంది గురించి తెలిసింది. వారిలో కొందరు విదేశాలలో వ్యాపారవేత్తలుగా ఎదిగారు...’’ అంటూ తమ వంశపరిణామ క్రమాన్ని వివరించారు మిట్టల్. ఇలా తమ పూర్వీకుల వివరాలు సంపాదించడం తనకు ఎంతో ఉద్వేగాన్ని ఇస్తోందని మిట్టల్ అంటున్నారు.