breaking news
The farm loan waiver
-
విపక్షం గొంతు వినిపించొద్దు..!
* ప్రకటనలతో సాగదీద్దాం.. ఎదురు దాడితో ముగిద్దాం * శాసనసభ శీతాకాల సమావేశాలపై అధికార పక్షం వ్యూహం * 18 నుంచి 23 వరకే అసెంబ్లీ.. విపక్షం కోరితే మరో రోజు * అసెంబ్లీలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: స్వల్ప కాలం పాటు జరగనున్న ఏపీ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ప్రభుత్వ ప్రకటనల తో సరిపుచ్చాలని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా సభలో చేసే ప్రకటనలు, వాటిపై చర్చ కొనసాగించడంతో సమావేశాలకు ముగింపు పలకాలని అధికార పార్టీ వ్యూహం ఖరారు చేసింది. ఇందులో భాగం గా సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో ప్రకటన చొప్పున ఐదు ప్రకటనలతో అసెంబ్లీ సమయాన్ని పూర్తిగా తామే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేశారు. తద్వారా.. వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, హుద్‌హుద్ సహాయం లో వైఫల్యాలు, రాష్ట్రం లో నెలకొన్న తీవ్రమైన కరవు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, పిం ఛన్ల తొలగింపు వంటి సామాజికాంశాలు సాధ్యమైనంత మేరకు చర్చకు రాకుండా చేసి సభను ముగించాలనేది వ్యూహంగా ఉంది. ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా ఇరకాటంలో పడాల్సి వస్తుందని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అవసరమైతే.. రుణ మాఫీ, డ్వాక్రా రుణాలు, ఇసుక విధానం, ఎర్రచందనం విక్రయంవంటి అంశాలను అధికార పక్షం నుంచే ప్రస్తావించి ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడి చేయాలని కూడా టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా కొం దరు ఎంపిక చేసిన నేతలతో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శల దాడి చేయడం ద్వారా.. అసలు అంశాలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించాలన్న వ్యూహాన్ని టీడీఎల్పీ నేతలు ఖరారు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలను 18 నుంచి 23 వరకు జరపాలని, ప్రతిపక్షం డిమాండ్ చేస్తే ఒకే ఒక్క రోజు పొడగించాలని భావించారు. తొలి రోజు సంతాప తీర్మానం పోగా, రెండో రోజు 19న రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆరీడీఏ) బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇన్వాయిస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన వ్యాట్ చట్టంలో సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం అభ్యంతరం నేపథ్యంలో మార్కెట్ కమిటీలు, దేవాలయాలకు చెందిన చట్టాల్లో సవరణలు చేస్తూ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
బాబోయ్... బకాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరుగుతున్న నిరర్థక ఆస్తులతో ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్రంగా సతమతమవుతున్నాయి. మొండిబకాయిల కేసుల్లో చిక్కుకుని పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీల రాజీనామాలు, అరెస్టులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో స్పష్టమవుతోంది. యునెటైడ్ బ్యాంక్‌లో ఎన్పీఏలు ఒక్కసారిగా పెరిగిన కారణం వల్ల ఆ బ్యాంక్ సీఎండీ అరెస్ట్ జరిగితే, పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకున్న భూషణ్ స్టీల్ కంపెనీ రుణాల పునర్ వ్యవస్థీకరించడం కోసం లంచం తీసుకుంటూ సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రూ. 40,000 కోట్ల రుణాలు కలిగిన భూషణ్ స్టీల్ దివాళా తీస్తే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులను అధికంగా భయపెడుతోంది. దేశీయ కార్పొరేట్ ఎన్‌పీఏలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 7,500 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 4,000 కోట్ల ఎన్పీఏలు భూషణ్ స్టీల్ ముందు దిగదుడుపే. అందుకే బ్యాంకులు ఇప్పుడు భూషణ్ స్టీల్ రుణాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు ఈ రుణాల వసూలుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి. చివరకు భూషణ్ స్టీల్ వ్యవహారం ఎటు దారితీస్తోందనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో కొంత నయం ఆర్థిక మందగమనం ప్రభావం రుణ చెల్లింపులపై స్పష్టంగా కనిపించింది. గత నాలుగేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు మూడు రెట్లు పెరిగాయి. 2010-11లో పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండి బకాయిల విలువ రూ. 71,080 కోట్లుగా ఉంటే 2013-14కి రూ. 2.16 లక్షల కోట్లకు పెరిగాయంటే పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కాని ఇదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల వృద్ధి కేవలం 26 శాతంగానే ఉంది. 2011-12లో రూ. 17,972 కోట్లుగా ఉన్న ఎన్పీఏలు, గత మార్చి నాటికి రూ. 22,744 కోట్లకు చేరాయి. ఇచ్చిన రుణాల విలువ పెరగడం వల్ల ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏ విలువ పెరిగినట్లు కనిపిస్తున్నా, మొత్తం విలువలో ఎన్పీఏల వాటాను చూస్తే స్వల్పంగా తగ్గడం విశేషం. 2011 మార్చినాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.84 శాతంగా ఉంటే అది డిసెంబర్, 2013 నాటికి 5.07 శాతానికి చేరింది. ఇదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏ 2.29 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయి. ప్రభుత్వ బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్పీఏలు పెరగడానికి ఒక కారణంగా బ్యాంకు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, ఏదైనా ఒక అకౌంట్ ఎన్పీఏగా మారుతుంటే ముందుగానే వడ్డీ పెంచడం లేదా చెల్లించాల్సిన బకాయిని మొత్తానికి కలిపి రుణ కాలపరిమితిని పెంచుతూ పునర్ వ్యవస్థీకరించడం చేస్తున్నాయని, దీంతో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల శాతం తక్కువగా ఉందంటున్నారు. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడానికి ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఆగిపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల పనులు మధ్యలో ఆగిపోవడంతో వాటికిచ్చిన రుణాల్లో అత్యధిక శాతం ఎన్పీఏలుగా మారాయి. 2011 మార్చిలో ఇన్ఫ్రా విభాగంలో 3.23 శాతంగా ఉన్న ఎన్పీఏలు గత మార్చినాటికి ఏకంగా 8.22 శాతానికి ఎగబాకింది. వీటితోపాటు స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో కూడా ఎన్పీఏలు భారీగా పెరిగాయి. వృద్ధి బాట పడితేనే... ఆర్థిక వృద్ధి మందగమనం వల్లే నిరర్థక ఆస్తులు పెరిగాయని, ఒక్కసారి తిరిగి వృద్ధి బాటలోకి పయనిస్తే ఎన్‌పీఏల్లో తగ్గుదల నమోదవుతుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇక్కడ నుంచి తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిన ఇన్ఫ్రా ప్రాజెక్టులను వేగంగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటే మొండిబకాయిల చిక్కులు సగం తీరినట్లేనని వెల్లడించాయి.